Idream media
Idream media
ఎన్నో నెలలుగా వాయిదా పడుతూ వస్తున్న స్థానిక సంస్థల ఎన్నికలు రానే వచ్చాయి. మూడు రకాల స్థానిక సంస్థలకు మార్చి 29లోపు ఎన్నికలు, ఫలితాలు పూర్తి అయిపోతాయి. ఎండా కాలం మొదలు కాలేదు.. కానీ ఈ ఎన్నికలు పార్టీల్లో చెమటలు పట్టించే వేడిని రగిలించాయి. అభివృద్ధి కేంద్రంగా ఆరోపణలు, ప్రత్యారోపణలు జరుగుతాయనుకుంటే.. ఆశ్చర్యకంగా బీసీ అజెండా ముందుకొచ్చింది. తొమ్మిది నెలలుగా తాము చేస్తున్న మంచి పనులే తమను గెలిపిస్తాయని అధికార వైఎస్సార్‌సీపీ ధీమాగా ఉంది. ఎప్పటిలాగే సింగిల్‌గానే ఎన్నికల బరిలో దిగబోతోంది. ఈ ఎన్నికల్లో మద్యం, మనీని దూరంగా ఉంచేందుకు ఆర్డినెన్స్‌ను తీసుకొచ్చింది. అభ్యర్థి ప్రజలను ప్రలోభాలకు గురిచేస్తే అతను గెలిచినా అనర్హత వేటు పడనుంది. ఇలాంటి ఆర్డినెన్స్ వస్తే విపక్షాలు ఎగిరి గంతేయాలి. అయితే విపక్షాల్లో మాత్రం ఎక్కడ లేని నైరాశ్యం ఆవహించింది. అభ్యర్థులు కూడా దొరకని పరిస్థితుల్లో తత్తరపాటుకు గురవుతున్నాయి. ఎన్నికలు ఆపడానికి రాష్ట్ర ఎన్నికల కమిషన్‌కు సిల్లీగా కరోనా వైరస్‌ను కారణంగా చెప్పి అభాసుపాలయ్యాయి. ఇక ఎన్నికలు ఆపడం సాధ్యం కాదని తెలుసుకొని కొత్త పొత్తుల కోసం విపక్షాలు ప్రయత్నాలు మొదలు పెట్టాయి.
బీజేపీ, జనసేన ఇప్పటికే తమ పొత్తును ఖరారు చేసుకున్నాయి. అయితే పోటీ చేసే స్థానాలపై ఇంకా స్పష్టత రాలేదు. ఆ రెండు పార్టీలు మేనిఫెస్టో పేరుతో హడావుడి చేస్తున్నాయి. 2019 సాధారణ ఎన్నికల్లో వామపక్షాలను వెంటేసుకొని తిరిగినా.. లబ్ధి చేకూరకపోవడంతో జనసేన బీజేపీ పంచన చేరింది. ఇది ఎంతమేర వర్క్‌అవుట్ అవుతుందో ఈ స్థానిక సంస్థల ఎన్నికలతో క్లారిటీ వచ్చేస్తుంది. అధికార వైఎస్సార్‌సీపీకి మేమే ప్రత్యామ్నాయం అని బీజేపీ, జనసేన చెప్పుకుంటున్నా.. క్షేత్రస్థాయిలో ఆ పార్టీలకు అభ్యర్థులు కూడా దొరకని పరిస్థితి తలెత్తుతోంది.
మరోవైపు బీజేపీ, జనసేన కూటమితో కలవడానికి ప్రయత్నాలు చేసి విఫలమైన తెలుగుదేశం పార్టీ దశాబ్ద కాలంనాటి పాత స్నేహం కోసం అర్రులు చాస్తోంది. సీపీఎం, సీపీఐ పార్టీలతో కలసి పోటీ చేయడానికి తహతహలాడుతోంది. అంతే ఆరాటం సీపీఐలో కూడా కనపడుతోంది. ఇప్పటికే పొత్తుల కోసం చంద్రబాబు, టీడీపీ నాయకులతో ఒక దఫా సమావేశమయ్యింది. సోమవారం సీపీఐ నాయకులు నారాయణ, రామకృష్ణలు టీడీపీతో కలసి పోటీ చేయడాన్ని ధ్రువీకరించాయి. అయితే ఇక్కడే ఓ తిరకాసు మొదలయ్యింది. సీపీఐతో కలసి పోటీచేయడానికి సీపీఎం సిద్ధంగా ఉన్నప్పటికీ.. టీడీపీతో కలవడానికి కాస్త తర్జన భర్జన పడుతోంది. ప్రభుత్వం తీసుకునే ప్రతి నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ సీపీఐ పార్టీ దాదాపుగా టీడీపీ పచ్చ రంగు పూసుకుంది. సీపీఎం మాత్రం ఆచితూచి వ్యవహరిస్తోంది. ఆ పార్టీ నాయకుడు మధు ప్రభుత్వం చేసే మంచిని సపోర్ట్ చేస్తూ వస్తున్నారు. ఎన్నో ఏళ్లుగా టీడీపీపై పోరాటాలు చేసి.. ఇప్పుడు అదే పార్టీతో పొత్తు అంటే సీపీఎం ఇబ్బందిగా ఫీల్ అవుతోంది. మరోవైపు టీడీపీ సీపీఎంను కూడా ఒప్పించడానికి జాతీయ నాయకులకు ఫోన్లు చేస్తూ చంద్రబాబు ఒత్తిడి చేస్తున్నారు. ఆ మూడు పార్టీల ఉమ్మడి పోటీపై నేడో రేపో క్లారిటీ వచ్చేస్తుంది.
అయితే.. స్థానిక పోరులో నిలవడానికి టీడీపీ నేతలు ధైర్యం చేయడం లేదు. ప్రభుత్వ పథకాలతో క్షేత్రస్థాయిలో ప్రజలు సంతృప్తికరంగా ఉన్నారని, ఇలాంటి పరిస్థితుల్లో టీడీపీ తరఫున పోటీ చేయడం వృథా అనే భావన స్థానిక టీడీపీ కార్యకర్తల్లో వ్యక్తమవుతోంది. సీనియర్లు ఎవరూ పోటీకి ముందుకు రావడం లేదు. మరోవైపు టీడీపీ ఆస్థాన పత్రికాధినేత రాధాకృష్ణ సైతం చేతులు ఎత్తేశాడు. ఈ ఎన్నికల్లో టీడీపీ పోటీ చేయడం అనవసరం అని తేల్చేశాడు. దీంతో పార్టీ అధినేత చంద్రబాబుకు దిక్కు తోచడం లేదు. సీనియర్లు పోటీకి ముందుకు రాకపోతే.. యువత ముందుకు రావాలంటూ చంద్రబాబు మాట్లాడుతున్నారు. ఆయన మాటల్లో బేలతనం స్పష్టంగా కనపడుతోంది.
అధికార వైఎస్సార్‌సీపీలో మాత్రం స్థానిక పోరు ఎక్కడ లేని ఉత్సాహాన్ని తెచ్చింది. గ్రామాల్లో ఇప్పటికే అభ్యర్థుల ఖరారును ముమ్మరం చేసింది. పార్టీ అధినేత, సీఎం వైఎస్ జగన్ ఈ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. 90 శాతం స్థానాలను గెలిచి తీరాలంటూ పార్టీ నేతలకు అల్టిమేటం జారీ చేశారు. దీంతో నాయకులు ఉత్సాహంగా పనిచేస్తున్నారు. గెలుపు నల్లేరుపై నడకేనని ఆ పార్టీ నేతల్లో అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇదిలాఉండగా జిల్లాల్లో టీడీపీ నాయకులు వైఎస్సార్‌సీపీలో క్యూ కడుతున్నారు. ఇప్పటికే డొక్కా, రెహ్మాన్ పార్టీ కండువా కప్పుకోగా, మరికొందరు ఆ దిశలో పయనిస్తున్నారు.
ఏది ఏమైనా విపక్షాల్లో గెలుపుపై ఆశ సన్నగిల్లింది. కేవలం పరువు కాపాడుకుంటే చాలన్న భావనలో ఉన్నాయి. ఓటమిని తలా పిడికెడు పంచుకునే పనిలో ఉన్నాయి. అందుకే పొత్తుల ఎత్తులని విశ్లేషకులు చెబుతున్నారు.