iDreamPost
android-app
ios-app

రాజధాని బిల్లులుపై కోర్టులు ప్రశ్నించలేవు, క్లారిటీ ఇచ్చేసిన మండలి కార్యదర్శి

  • Published Sep 22, 2020 | 4:30 PM Updated Updated Sep 22, 2020 | 4:30 PM
రాజధాని బిల్లులుపై కోర్టులు ప్రశ్నించలేవు, క్లారిటీ ఇచ్చేసిన మండలి కార్యదర్శి

నిబంధనావళి ప్రకారం శాసన ప్రక్రియ జరిగి, ఆమోదం పొందిన బిల్లుల విషయంలో విపక్ష ఎమ్మెల్సీ పిటీషన్ చెల్లదని ఏపీ శాసన మండలి కార్యదర్శి బాలకృష్ణాచార్యలు స్పష్టం చేశారు. ఆమేరకు ఆయన హైకోర్టులో పిటీష్ దాఖలు చేశారు. టీడీపీ ఎమ్మెల్సీ ఏఎస్ రామకృష్ణ వేసిన వ్యాజ్యం చెల్లదని తేల్చిచెప్పారు. ఏపీ పాలనా వికేంద్రీకరణ, సీఆర్డీయే బిల్లులు సెలక్ట్ కమిటీ ముందున్నాయనే వాదన చెల్లదన్నారు. నిర్ణీత సమయంలో ఆమోదం పొందని బిల్లులకు రూల్ 197(2) కింద ఆమోదం లభించినట్టే భావించాల్సి ఉంటుందని గుర్తు చేశారు. ఈ రెండు బిల్లులను నిబంధనలకు అనుగుణంగా ఆమోదం పొందినట్టు కోర్ట్ కి తెలిపారు.

రాష్ట్రపతి, గవర్నర్ ఆమోదించిన బిల్లుల విషయంలో చట్టాలను కోర్టులు ప్రశ్నించలేవని అభిప్రాయం వ్యక్తం చేశారు. 226 అధికరణం ప్రకారం శాసనసభ ఆమోదించిన వాటిని న్యాయస్థానం ప్రశ్నించడం కుదరదని పేర్కొన్నారు. ఈ రెండు బిల్లులు సాధారణ సమావేశాల్లోనే జనవరి 20 న ఆమోదించిన విషయాన్ని గుర్తు చేశారు. పిటీషనర్ దానిని వక్రీకరించడం తగదన్నారు. నిబంధనలు పాటించకుండా బిల్లులు సెలక్ట్ కమిటీకి పంపించడం తగదు… విచక్షణాధికారం చెల్లదని సెక్రటరీ అసెంబ్లీ కార్యదర్శి వివరించారు. దానికి సంబంధించి తీర్మానం ప్రవేశపెట్టడం, ఆమోదించడానికి ఓటింగ్ నిర్వహించడం వంటివి లేకుండా సెలక్ట్ కమిటీ మనుగడలోకి వచ్చే అవకాశం లేదన్నారు.

రూల్ 71 కింద నోటీసు ఇచ్చినంత మాత్రాన బిల్లులు ఆమోదానికి అడ్డంకి కాదనే సంగతి గుర్తించాలన్నారు. బిల్లులు ఆమోదం పొందలేదని మండలి చైర్మన్ ఎక్కడా పేర్కొనలేదని, అలాంటి రికార్డులు కూడా లేవని వివరించారు. మండలి రద్దు కి సంబంధించిన నిబంధనల ప్రకారం ఏపీ అసెంబ్లీలో సీఎం తీర్మానం ప్రవేశపెట్టారని తెలిపారు. దానికి 137 మంది మద్ధతు తెలిపారు. ఇప్పటికే కేంద్రం పరిధిలో ఈ అంశం ఉందని కార్యదర్శి వివరించారు. పిటీషన్ చెబుతున్నట్టుగా రాజకీయ కక్ష సాధింపు అనేది లేదని స్పష్టం చేశారు. పిటీషన్ వాదనల్లో వాస్తవం లేదని, వ్యాజ్యాం కొట్టివేయాలని తన పిటీషన్ లో పేర్కొన్నారు.