ఢిల్లీ కరోనా లింకు కనిపెట్టిన ఏపీ ఐపీఎస్

ఢిల్లీలోని తబ్లీగ్ జమాత్ శిక్షణ సదస్సు దేశంలో నలుమూలల కరోనా వైరస్ వ్యాప్తికి కారణమైందని అందరికీ తెలిసిన విషయమే. ఈ సదస్సు ద్వారా కరోనా వైరస్ దేశవ్యాప్తంగా వ్యాపించిందని కనుగొన్నది ఏపీకి చెందిన ఐపీఎస్ కావడం విశేషం. సదరు ఐపిఎస్ ఆఫీసర్ దేశం మొత్తాన్ని కాపాడాలి అని చెప్పవచ్చు. ఆయన ఎవరో కాదు గుంటూరు అర్బన్ డీఐజీ పి హెచ్ డి రామకృష్ణ కావడం ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన విషయం.

గత నెల 25వ తేదీన గుంటూరులో 52 ఏళ్ల వ్యక్తికి కరోనా సోకింది. అతడు విదేశాలకు వెళ్లలేదు. అతనికి వైరస్ ఎలా సోకిందన్నది పెద్ద మిస్టరీగా మారింది. దాంతో పి.రామకృష్ణ తన మేధస్సుకు పదును పెట్టారు. అతని మొబైల్ నంబర్ తీసుకుని మొత్తం సమాచారం రాబట్టారు. ఆ ప్రయత్నంలో ఢిల్లీ జమాత్ విషయం బయటపడింది. దాంతో జమాత్ కేంద్రంగా ఉన్న ప్రాంతంలో సెల్ ఫోన్ టవర్ ను పరిశీలిస్తే ఒకేసారి కొన్ని వేల మంది అక్కడ ఉన్నట్లు తేలింది. దాదాపు 13,500 నంబర్లు మూడు రోజుల్లో అక్కడ ఉన్నాయి. దాంతో వెంటనే ఆయన కేంద్ర ఇంటెలిజెన్స్ బ్యూరో కు సమాచారం చేరవేశారు.

రామకృష్ణ పంపిన సమాచారాన్ని చూసిన కేంద్ర ప్రభుత్వం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. వెంటనే అన్ని రాష్ట్రాలకు హెచ్చరికలు పంపింది. జమాత్ శిక్షణలో పాల్గొన్న వారందరినీ వెతికి పట్టుకుని ఆస్పత్రికి తరలించే ప్రయత్నం యుద్ధ ప్రాతిపదికన చేపట్టింది. రామకృష్ణ ముందుగా ఆ సమాచారాన్ని వెతికి పట్టుకుని తీయకుంటే కనీసం మరో పది పదిహేను రోజుల పాటు జమాత్ విషయం ప్రపంచానికి తెలిసేది కాదు. అదే జరిగి ఉంటే దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి భారీ స్థాయిలో ఉండేది. ఒకరకంగా చెప్పాలంటే గ్రామాలకు వ్యాపించేది. అదే జరిగి ఉంటే.. కరోనా ను కట్టడి చేయడం తలకుమించిన భారం అయ్యేది. కేసు నమోదు అవగానే.. దాని లింక్ కును కనిపెట్టి కేంద్ర ప్రభుత్వాన్ని అప్రమత్తం చేసిన రామకృష్ణ దేశాన్ని ఒక పెద్ద ప్రమాదం నుంచి రక్షించారు.

Show comments