iDreamPost
android-app
ios-app

‘నిమ్మగడ్డ’ వ్యవహారంపై నేడే తీర్పు

‘నిమ్మగడ్డ’ వ్యవహారంపై నేడే తీర్పు

రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌గా తనను తొలగిస్తూ, సంస్కరణల పేరిట తెచ్చిన ఆర్డినెన్స్, నూతన ఎస్‌ఈ కనగరాజన్‌ నియామకాన్ని సవాల్‌ చేస్తూ నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌ తోపాటు ఇతరులు 13 మంది దాఖలు చేసిన పిటిషన్లపై ఈ రోజు రాష్ట్ర హైకోర్టు తీర్పు వెలువరించనుంది. ఇప్పటికే ఈ వ్యవహారంలో వాదనలు పూర్తి అవగా ఈ నెల 8వ తేదీన తీర్పును హైకోర్టు రిజర్వ్‌లో పెట్టింది. ఈ కేసులో సుదీర్ఘ వాదనలు జరిగాయి.

నిమ్మగడ్డను తాము తొలగించలేదని ప్రభుత్వం పేర్కొనగా.. ప్రభుత్వం తెచ్చిన ఆర్డినెన్స్‌ తనకు వర్తించదని నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌ వాదించారు. నిమ్మగడ్డ ప్రభుత్వానికి వ్యతిరేకంగా వ్యవహరించిన తీరు, ప్రభుత్వాన్ని కించపరిచేలా కేంద్ర ప్రభుత్వానికి రాసిన లేఖ తదితర అంశాలను ప్రభుత్వం హైకోర్టు దృష్టికి తెచ్చింది. ఈ నేపథ్యంలో తీర్పు ఎవరికి అనుకూలంగా ఉంటుందనే అంశంపై రాష్ట్ర వ్యాప్తంగా ఉత్కంఠ నెలకొంది.

ఇటీవల కాలంలో రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న పలు ముఖ్యమైన నిర్ణయాలకు హైకోర్టులో వ్యతిరేకంగా తీర్పులు, ఆదేశాలు వస్తున్నాయి. రాజధాని, ఇంగ్లీష్‌ మీడియం, ప్రభుత్వ కార్యాలయాలకు రంగులు, మత్తు డాక్టర్‌ సుధాకర్‌ వ్యవహారం, భూముల విక్రయం తదితర అంశాలపై ప్రభుత్వ లక్ష్యాలకు భిన్నంగా హైకోర్టులో తీర్పులు వచ్చాయి. ఇలాంటి పరిస్థితుల్లో తీర్పు ఎలా వస్తుందోనన్న ఆసక్తి సర్వత్రా నెలకొంది.