iDreamPost
android-app
ios-app

నిమ్మగడ్డకు హైకోర్టులో చుక్కెదురు

నిమ్మగడ్డకు హైకోర్టులో చుక్కెదురు

ఒంటెద్దు పోకడలతో ఎన్నికల సంఘానికి ఉన్న అధికారాలను విచక్షణారహితంగా వాడుతున్న రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ (ఎస్‌ఈసీ) నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌కు వరుస ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. రీ నామినేషన్ల ఉత్తర్వులను కొట్టివేసిన ఏపీ హైకోర్టు మరికొద్దిసేపటికే వార్డు వలంటీర్లపై జారీ చేసిన ఉత్తర్వులను కూడా కొట్టివేసింది. వార్డు వలంటీర్లు విధులు నిర్వర్తించేందుకు వీలుగా మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.

మున్సిపల్‌ ఎన్నికల్లో ప్రత్యక్షంగాగానీ, పరోక్షంగాగానీ వార్డు వలంటీర్లు జోక్యం చేసుకోవడానికి వీలులేదని, వారి వద్ద ఉన్న సెల్‌ఫోన్లు ఎన్నికలు ముగిసే వరకూ స్వాధీనం చేసుకోవాలని నిమ్మగడ్డ రమేష్‌మార్‌ ఈ నెల 1వ తేదీన ఉత్తర్వులు జారీ చేశారు. అధికార పార్టీకి అనుకూలంగా వలంటీర్లు పని చేస్తున్నారని, అధికార పార్టీకి ఓటు వేయకపోతే పథకాలు నిలిపివేస్తామని ఓటర్లను బెదిరిస్తున్నారంటూ టీడీపీ ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణ, మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌ రెడ్డిలు కూడా వేర్వేరుగా హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు.

ఎస్‌ఈసీ జారీ చేసిన ఆదేశాల వల్ల ప్రభుత్వ పథకాల అమలు నిలిచిపోయే ప్రమాదం నెలకొనడంతో రాష్ట్ర ప్రభుత్వం అదే రోజు ఏపీ హైకోర్టులో లంచ్‌మోషన్‌ పిటిషన్‌ దాఖలు చేసింది. ఒకటో తేదీనే పింఛన్లు పంపిణీ చేయాల్సి ఉన్న తరుణంలో వెంటనే విచారణ చేపట్టాలని కోరింది. ప్రభుత్వం దాఖలు చేసిన లంచ్‌మోషన్‌ పిటిషన్‌తోపాటు టీడీపీ నేతలు దాఖలు చేసిన రెండు పిటిషన్లను కలిపి హైకోర్టు విచారించింది.

ప్రభుత్వం తరఫున అడ్వకేట్‌ జనరల్‌ ఎస్‌.శ్రీరామ్‌ వాదనలు వినిపించారు. ఎస్‌ఈసీ జారీ చేసిన ఆదేశాలు చట్టవిరుద్ధమని, ఆ ఆదేశాల వల్ల ఫించన్ల పంపిణీ ఆగిపోతుందని కోర్టు దృష్టికి తెచ్చారు. వలంటీర్లు ఎన్నికల విధుల్లో పాల్గొనడంలేదని, ప్రభుత్వం వారి సేవలను కేవలం ప్రభుత్వ కార్యక్రమాలు, పథకాల అమలుకే వినియోగించుకుంటోందని తెలిపారు. టీడీపీ నేతలవి ఆరోపణలు తప్పా అందులో వాస్తవం లేదన్నారు. అడ్వకేట్‌ జనరల్‌ వాదనతో ఏకీభవించిన రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం ఎస్‌ఈసీ నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌ జారీ చేసిన ఉత్తర్వులను నిలిపివేస్తూ ఆదేశాలు జారీ చేసింది. వలంటీర్లు మొబైల్‌ఫోన్లు వినియోగించవచ్చని తెలిపింది.