iDreamPost
iDreamPost
ఆంద్రప్రదేశ్ హైకోర్ట్ మరోసారి కీలక వ్యాఖ్యలు చేసింది. ప్రభుత్వ వ్యవహారశైలి మీద ఘాటుగా స్పందించింది. పరిస్థితులు అదుపు లేవని వ్యాఖ్యానించింది. పౌర హక్కులు కాపాడలేనప్పుడు మేము ఉండి ఏం లాభమంటూ బెంచ్ చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశాలవుతున్నాయి. సోషల్ మీడియాలో జడ్జిలపై చేసిన వ్యాఖ్యల కేసు, ఎస్ ఈ సీ కేసులో విచారణకు పిటీషనర్ల తరుపు న్యాయవాదులు సహకరించాలని కోరింది. కోర్టు ఉత్తర్వులు వేటినైనా పరిగణలోకి తీసుకునే అవకాశం ధర్మాసనానికి ఉందంటూ చేసిన కామెంట్స్ ఆసక్తికరంగా కనిపిస్తున్నాయి.
జస్టిస్ రాకేష్ కుమార్, జస్టిస్ ఉమాదేవితో కూడిన ధర్మాసనం శుక్రవారం నాడు జరిగిన విచారణ సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేసింది. హెబియస్ కార్పస్ పిటీషన్ పై విచారణ జరిగింది. రాష్ట్రంలో రాజ్యాంగ విచ్ఛిన్నం జరిగిందో లేదో తాము నిర్ణయం తీసుకుంటామని పేర్కొంది. హైకోర్ట్ న్యాయమూర్తుల మీద సోషల్ మీడియాలో చేసిన పోస్టులపై రిజిస్ట్రార్ చేసిన ఫిర్యాదుని పోలీసులు పట్టించుకోలేదని హైకోర్ట్ ఆక్షేపించింది.
గుంటూరుకి చెందిన ముగ్గురిని నిర్బంధించిన కేసులో విచారణ సందర్భంగా సీబీఐ తీరు పట్ల హైకోర్ట్ అసంతృప్తి వ్యక్తం చేసింది. సీబీఐ జేడీని పిలిపించి విచారణ చేయాల్సి ఉంటుందని హెచ్చరించింది. ఈ సందర్భంలో సీబీఐ దర్యాప్తు పురోగతిని సంబంధిత న్యాయవాది కోర్ట్ కి తెలిపారు.
ఇప్పటికే ఏపీ హైకోర్ట్ పలు సందర్భాలలో చేసిన వ్యాఖ్యల పరంపరలోనే తాజాగా విచారణ సమయంలో చేసిన వ్యాఖ్యలున్నాయి. దాంతో ఇప్పుడివి రాజకీయంగా చర్చనీయాంశాలవుతున్నాయి. మొన్న శాసనమండలి, నిన్న ఎస్ ఈ సీ, ఇప్పుడు మాపై పడతారా అంటూ కోర్ట్ వ్యాఖ్యానించిందని పత్రికల్లో వచ్చిన కథనాలు విశేషంగా కనిపిస్తున్నాయి. అదే రీతిలో కోర్ట్ వ్యాఖ్యలు చేసి ఉంటే అది తీవ్ర పరిస్థితికి దర్పణం పడుతున్నట్టేనని పలువురు న్యాయ నిపుణుల అభిప్రాయం.