iDreamPost
android-app
ios-app

బ్రహ్మంగారి మఠం పీఠం వివాదం.. తీర్పు వెల్లడించిన హైకోర్టు

బ్రహ్మంగారి మఠం పీఠం వివాదం.. తీర్పు వెల్లడించిన హైకోర్టు

వైఎస్సార్‌ కడప జిల్లా కందిమల్లాయపల్లి గ్రామంలో ఉన్న శ్రీ మద్విరాట్‌ పోతులూరి వీరబ్రహేంద్ర స్వామివారి మఠం పీఠాధిపతి వివాదంపై ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు తీర్పు వెలువరించింది. మఠం పీఠాధిపతిగా వెంకటాద్రి స్వామి నియామకం చెల్లదని కోర్టు తీర్పు చెప్పింది. మఠం పీఠాధిపతి వివాదాన్ని పరిష్కరించేందుకు, నూతన పీఠాధిపతిని ఎంపిక చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక అధికారిగా చంద్రశేఖర్‌ ఆజాద్‌ను నియమిస్తూ జారీ చేసిన జీవోను రద్దు చేసింది. మఠం ఎగ్జిక్యూటివ్‌ మండలిలో తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) ఈవో కూడా సభ్యుడుని, పీఠాధిపతి నియామకంలో టీడీపీ ఈవో సంతకం లేదని కోర్టు తన తీర్పులో పేర్కొంది. టీటీడీ ఈవో ఆమోదం లేని పీఠాధిపతి నియామకం చెల్లదని స్పష్టం చేసింది.

పీఠాధిపతి విషయంలో పెద్దమనుషులు కుదిర్చిన రాజీని కాదని ఇటీవల స్వర్గస్తులైన పిఠాధిపతి వీరభోగ వసంత వేంకటేశ్వరస్వామి రెండవ భార్య మారుతీ మహాలక్ష్మమ్మ గత నెల 30వ తేదీన హైకోర్టును ఆశ్రయించారు. ప్రభుత్వంతోపాటు ఇరు పక్షాల వాదనలు విన్న ధర్మాసనం.. ఈ నెల 14వ తేదీన తీర్పును రిజర్వ్‌ చేసింది. ఈ రోజు తీర్పును వెలువరించింది. దీంతో పీఠాధిపతి ఎంపిక ప్రక్రియ మళ్లీ మొదటికి వచ్చింది.

ఇదీ వివాదం..

ఇటీవల పరమపదించిన పీఠాధిపతి వీరభోగ వసంత వేంకటేశ్వరస్వామి స్థానంలో నూతన పీఠాధిపతి ఎంపిక జరగాల్సి ఉండగా.. పీఠాధిపతి ఎవరుండాలనే అంశంపై ఆయన రాసిన వీలునామాతో వివాదం చెలరేగింది. వేంకటేశ్వరస్వామికి ఇద్దరు భార్యలు. పెద్ద భార్య చంద్రావతికి 8 మంది సంతానం. నలుగురు కుమారులు, నలుగురు కుమార్తెలు. చంద్రావతి మరణించిన తర్వాత వేంకటేశ్వరస్వామి మారుతీ మహాలక్ష్మమ్మను రెండో వివాహం చేసుకున్నారు. ఆమెకు 13, 10 ఏళ్ల వయస్సున్న ఇద్దరు కుమారులున్నారు. సాంప్రదాయం ప్రకారం కుటుంబ సభ్యుల్లో పెద్దవారు పీఠాధిపతి కావాలి.

అయితే చంద్రావతి కిడ్నీ సంబంధిత సమస్యతో ఆస్పత్రిలో ఉన్నప్పుడు ఆమెకు కిడ్నీ దానం చేసిన వారికి పిఠాధిపతి పదవి దక్కేలా వేంకటేశ్వరస్వామి వీలునామా రాశారు. రెండో కుమారుడు వీరభద్రయ్య కిడ్నీ దానం చేశారు. వీరభద్రయ్య తర్వాత రెండో భార్య మారుతీ మహాలక్ష్మమ్మ కుమారుడు పీఠాధిపతి అయ్యేలా వీలునామలో పేర్కొన్నారు.

Also Read : పీకే ఫ్యూచర్ చుట్టూ చర్చ, వ్యూహకర్తగా ఉంటారా..కార్యకర్తగా మారతారా

పీఠాధిపతి కోసం మహాలక్ష్మమ్మ పట్టు..

వేంకటేశ్వరస్వామి తర్వాత పీఠాధిపతిగా ఎవరు ఉండాలనే అంశంపై కందిమల్లాయపల్లి గ్రామస్తులు కొంత మంది వేంకటేశ్వరస్వామి పెద్ద కుమారుడు వెంకటాద్రి స్వామికి, మరికొంత మంది తల్లికి కిడ్నీ దానం చేసిన రెండో కుమారుడు వీరభద్రయ్యకు మద్ధతుగా నిలబడ్డారు. వీలునామా ప్రకారం పీఠాధిపతిగా తన కుమారుడుకు కూడా అవకాశం ఉందని, అయితే వారు చిన్నపిల్లలు కావడం వల్ల అప్పటి వరకు తాను పీఠాధిపతిగా ఉంటానంటూ మారుతీ మహాలక్ష్మమ్మ పట్టుబట్టారు. పలు దఫాలు చర్చల తర్వాత.. పెద్ద కుమారుడు వెంకటాద్రి స్వామిని పీఠాధిపతిగా, రెండో కుమారుడు వీరభద్రయ్యను ఉత్తరాధికారిగా ఎన్నుకున్నారు.

వెంకటాద్రి స్వామి తర్వాత వీరభద్రయ్య పీఠాధిపతిగా ఉంటారు. ఆయన తర్వాత మారుతీ మహాలక్ష్మమ్మ కుమారుడు పీఠాధిపతి అవుతారు. అప్పటి వరకు మారుతీ మహాలక్ష్మమ్మకు భృతిగా ప్రతి నెలా కొంత మొత్తం నగదు పీఠాధిపతి చెల్లించేలా అవగాహన ఒప్పదం కుదిరింది. వారి యోగ క్షేమాలు కూడా పీఠాధిపతియే చూసేలా పెద్దలు ఒప్పందం కుదిర్చారు. మంచి ముహూర్తాన వెంకటాద్రి స్వామి పీఠాధిపతిగా బాధ్యతలు స్వీకరిస్తారని దేవాదాయ శాఖ ప్రత్యేక అధికారి చంద్రశేఖర్‌ ఆజాద్‌ ప్రకటించారు.

రాజీకి వచ్చి.. ఆ పై కోర్టుకు..

పెద్దల సమక్షంలో రాజీకి వచ్చిన మారుతీ మహాలక్ష్మమ్మ.. ఆ రోజు రాత్రి అక్కడ నుంచి తన స్వగ్రామం ప్రకాశం జిల్లా టంగుటూరుకు వెళ్లారు. పీఠంపై హక్కును కోరుతూ ఆమె హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. కుటుంబంలో పెద్దవారే మఠాధిపతిగా ఉండాలనే నియమం లేదని, పీఠాధిపతి కావాలనుకుంటున్న వెంకటాద్రి స్వామికి అందుకు తగిన అర్హతలు లేవని, ఆయన న్యాయవాదిగా ప్రాక్టీసు చేస్తున్నారంటూ మహాలక్షమ్మ తరఫు న్యాయవాది వాదనలు వినిపించారు. తరతరాలుగా వస్తున్న ఆచార, సంప్రదాయాల ప్రకారం మఠాధిపతి అయ్యే అర్హత తనకే ఉందని, మహిళలు పీఠాధిపతులుగా చేసిన దాఖలాలులేవని వెంకటాద్రి స్వామి తరఫు న్యాయవాది వాదించారు. ఇరు వైపుల వాదనలు విన్న కోర్టు.. ఈ రోజు తీర్పును వెలువరించింది.

Also Read : ఈడబ్ల్యూఎస్‌ రిజర్వేషన్ – చంద్రబాబు తప్పును సరిదిద్దుతూ జ‌గ‌న్ స‌ర్కార్ ఉత్తర్వులు