Idream media
Idream media
మూడు రాజధానుల ఏర్పాటుపై ఏపీ సర్కార్ తెచ్చిన చట్టాలను వెనక్కి తీసుకున్నా.. మూడు రాజధానుల ఏర్పాటును వ్యతిరేకిస్తూ, అమరావతియే ఏకైక రాజధానిగా కొనసాగించాలంటూ అమరావతి జేఏసీ సహా పలువురు దాఖలు చేసిన పిటీషన్లు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. సాంకేతికపరమైన లోపాలను సరిచేసి, రాష్ట్ర సమగ్ర అభివృద్ధిపై మరింత సమాచారంతో అందరి అనుమానాలను, భయాలను తొలగించేలా మళ్లీ బిల్లు పెడతామని జగన్ సర్కార్.. ఇటీవల జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో సీఆర్‌డీఏ రద్దు, అభివృద్ధి వికేంద్రీకరణ చట్టాలను వెనక్కి తీసుకుంది. ఈ విషయాన్ని ఏపీ హైకోర్టుకు తెలిపింది. హైకోర్టు ఆదేశాల మేరకు అడ్వకేట్ జనరల్ సుబ్రమణ్య శ్రీరామ్ అఫిడవిట్ దాఖలు చేస్తూ.. ఈ అంశంపై విచారణను ముగించాలని కోరారు. సీఆర్‌డీఏ అమలులోకి వచ్చింది.
అయితే సీఆర్‌డీఏ రద్దు, అభివృద్ధి వికేంద్రీకరణ చట్టాలను సవాల్ చేస్తూ అమరావతి జేఏసీ దాఖలు చేసిన పిటీషన్లపై విచారణ ఇంకా కొనసాగుతూనే ఉంది. తమ పిటీషన్లపై విచారణ కొనసాగించాలంటూ అమరావతి జేఏసీ తరపు న్యాయవాదులు హైకోర్టులో వాదిస్తున్నారు. ఈ చట్టాలు వెనక్కి తీసుకున్నా.. ఇంకా ఆ పిటీషన్లపై విచారణ కొనసాగించాలనే వింత వాదనలను పిటీషనర్ల తరపు న్యాయవాదులు వినిపిస్తుండడం విడ్డూరంగా ఉంది.
పిటీషనర్ల వాదనలను పరిగణలోకి తీసుకున్న ధర్మాసనం.. ఈ అంశానికి సంబంధించి సమగ్ర వివరాలను ఓ నోట్ రూపంలో తమ వద్ద ఉంచాలని పిటీషనర్లను ఆదేశించింది. నోట్ దాఖలు చేసిన తర్వాత.. దానిపై పది రోజుల్లోగా ప్రభుత్వం తన స్పందన తెలపాలని హైకోర్టు పేర్కొంది. తదుపరి విచారణను వచ్చే నెల 28వ తేదీకి వాయిదా వేసింది.
సీఆర్‌డీఏ రద్దు, అభివృద్ధి వికేంద్రీకరణ చట్టాలను వెనక్కి తీసుకున్న ప్రభుత్వం.. ఈ విషయాన్ని హైకోర్టుకు రాతపూర్వకంగానూ తెలిపింది. ఈ విషయం సమసిపోయిందని, విచారణను ముగించాలని కోరింది. ఇలా.. ప్రభుత్వం తన వైఖరిని అఫిడవిట్ రూపంలో స్పష్టంగా హైకోర్టు ముందు ఉంచింది. పిటీషన్లపై విచారణను కొనసాగించాలని ఎందుకు కోరుతున్నారో.. అమరావతి జేఏసీ తరఫున పిటీషన్లు దాఖలు చేసిన వారు నోట్‌లో పేర్కొనాల్సి ఉంటుంది. వారి వాదన ఎలా ఉండబోతోందో..? చూడాలి. వారి వాదన ఎలా ఉన్నా.. ఈ విషయంలో మాత్రం రాష్ట్ర ప్రభుత్వం గతంలో అఫిడవిట్‌లో పేర్కొన్న అంశాన్నే పునరుద్ఘాటించే అవకాశం ఉంది. చట్టాలనే రద్దు చేసిన తర్వాత.. వాటిని వ్యతిరేకిస్తూ దాఖలైన పిటీషన్లపై విచారణ జరపాల్సిన అవసరం ఏముందనే ప్రశ్న సహజంగానే ఉద్భవిస్తుంది.
Also Read : ఏపీ సర్కార్ మరో నిర్ణయాన్ని తోసిపుచ్చిన హైకోర్టు