iDreamPost
android-app
ios-app

ఉపాధి హామీ పనుల చెల్లింపులపై మరోసారి హైకోర్టు ఆదేశాలు

ఉపాధి హామీ పనుల చెల్లింపులపై మరోసారి హైకోర్టు ఆదేశాలు

చంద్రబాబు ప్రభుత్వ హాయంలో 2018–19 ఆర్థిక ఏడాదిలో జరిగిన ఉపాధి హామీ పనుల బిల్లుల చెల్లింపులపై ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు మరోమారు రాష్ట్ర సర్కార్‌కు ఆదేశాలు జారీ చేసింది. ఉపాధి హామీ పనులు చేసిన టీడీపీ నేతలు బిల్లులు చెల్లించేలా ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేయాలంటూ దాఖలు చేసిన పిటిషన్లపై మరోమారు ఏపీ హైకోర్టు ఈ రోజు విచారణ జరిపింది. 500 మందికి చెందిన బిల్లులను రెండు వారాల్లోగా చెల్లించాలని ఆదేశించింది. ఇప్పటికే 70 శాతం మందికి సంబంధించిన బిల్లులను చెల్లించామని ప్రభుత్వ తరఫు న్యాయవాది కోర్టుకు తెలపగా.. అందుకు సంబంధించిన వివరాలను కోర్టు ముందు ఉంచాలని కోరింది.

పనులు చేయకుండానే సొమ్ము నొక్కేసి..

టీడీపీ ప్రభుత్వ హాయంలో ఉపాధి హామీ నిధులతో పలు పనులను చేపట్టారు. సిమెంట్, మట్టి రోడ్ల నిర్మాణం, నీరు–చెట్టు పేరుతో చెరువుల్లో పూడికతీత తదితర పనులను టీడీపీ గ్రామ స్థాయి నేతలు చేశారు. ఉపాధి హామీ నిధుల ద్వారా జరిగిన పనుల్లో అనేక అవకతవకలు ఉన్నట్లు విజిలెన్స్‌ అధికారులు గుర్తించారు. ముఖ్యంగా నీరు – చెట్టు పేరుతో చెరువుల్లో పూడిక తీయకుండానే తీసినట్లు చూపించి బిల్లులు కోట్ల రూపాయల బిల్లులు చేసుకున్నారు. ఈ పనుల్లో జరిగిన అవకతవకలపై అప్పటి అధికారులు ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చినా.. బాబు సర్కార్‌ తమ వారేనన్నట్లుగా చూసిచూడకుండా ఉంది. విజిలెన్స్‌ అధికారుల దర్యాప్తు చేయగా భారీగా అవకతవకలు జరిగినట్లు తేలింది. 4,338 పనుల్లో సొమ్ము రికవరీ చేయాలని ప్రభుత్వానికి నివేదిక అందజేసింది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం 2018–19 ఆర్థిక ఏడాదిలో జరిగిన పనులపై విచారణ జరిపిన తర్వాత బిల్లులు చెల్లించే ందుకు సిద్ధమైంది. ఈ మేరకు విజిలెన్స్‌ విచారణకు ఆదేశించింది.

24 శాతం వడ్డీతో ఇస్తానంటూ చంద్రబాబు హామీ..

విజిలెన్స్‌ దర్యాప్తు చేస్తుండడంతో.. ఉలిక్కిపడిన టీడీపీ శ్రేణులు తమ బండారం బయటపడుతోందనే ఆందోళనతో ప్రభుత్వం బిల్లులు చెల్లించడంలేదంటూ నానా యాగీ చేయడం మొదలుపెట్టారు. టీడీపీ నేతలు ప్రత్యక్ష ఆందోళనలు చేశారు. అటు తిరిగి ఇటు తిరిగి ఈ వ్యవహారం తనపైకి వస్తుందని గ్రహించిన చంద్రబాబు గత ఏడాది సెప్టెంబర్‌లో ప్రత్యేకంగా జూమ్‌ మీటింగ్‌ పెట్టి.. బిల్లులు వచ్చేలా కోర్టుల్లో న్యాయపోరాటం చేస్తామని చెబుతూ వారిని చల్లబరిచారు. మరేదైనా కారణాలచేత బిల్లులు రాని వారికి మళ్లీ ప్రభుత్వం వచ్చిన తర్వాత 24 శాతం వడ్డీతో చెల్లిస్తానని హామీ ఇచ్చారు. ఆ తర్వాత కోర్టుల్లో పిటిషన్లు దాఖలు చేయించారు. పిటిషనర్ల తరఫున టీడీపీ ప్రభుత్వంలో అడ్వకేట్‌ జనరల్‌గా పని చేసిన దమ్మాలపాటి శ్రీనివాస్‌ వాదిస్తున్నారు.

Also Read : టీడీపీ జిల్లా సమావేశం.. నియోజకవర్గ ఇంఛార్జిలందరూ ఎందుకు డుమ్మా కొట్టారు..?