Idream media
Idream media
గుంటూరు జిల్లా తాడేపల్లిలోని అమరారెడ్డి నగర్‌లో ఇరిగేషన్ భూముల్లో అక్రమంగా నిర్మించుకున్న ఇళ్లను ఖాళీ చేసే విషయంలో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ప్రభుత్వం ఇళ్ల స్థలాలు ఇచ్చి, వారి ఇళ్లకు పరిహారం ఇవ్వడంతో పలువురు ఇళ్లను ఖాళీ చేశారు. మరికొంత మంది ఇళ్లను ఖాళీ చేయకుండా మొండికేశారు. ముందుగానే నోటీసులు ఇచ్చిన అధికారులు తమ పని తాము చేసుకునిపోతున్నారు. అయితే ఇందులో కొంత మంది ఖాళీ చేయబోమని భీష్మించుకూర్చున్నారు. ఈ విషయంపై ఏపీ హైకోర్టులో లంచ్‌మోషన్ పిటిషన్‌ను దాఖలు చేశారు. విచారించిన ధర్మాసనం.. ఇరు వైపుల వాదనలు ఆలకించింది.
తమకు న్యాయం జరగలేదని పిటిషన్‌దారులు వాదించారు. అయితే ఇరిగేషన్ భూముల్లో అక్రమంగా ఇళ్లు నిర్మించుకున్న 245 మందికి వేరే ప్రాంతంలో స్థలాలు కేటాయించామని, పరిహారం కూడా అందించామని ప్రభుత్వ న్యాయవాదులు కోర్టుకు తెలిపారు. అందరూ స్వచ్ఛందంగా ఇళ్లు ఖాళీ చేసి వెళుతుండగా.. పిటిషన్‌దారులు మాత్రం అద్దె ఇళ్లలోకి వెళ్లేందుకు కూడా ప్రయత్నం చేయడం లేదని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో తాము ఇళ్లు ఖాళీ చేసేందుకు రెండు నెలల సమయం కావాలని పిటిషన్‌దారులు కోరారు. పిటిషన్‌దారులు వినతిని తోసిపుచ్చిన హైకోర్టు.. రెండు వారాల్లో ఖాళీ చేయాలని ఆదేశాలు జారీ చేసింది. ఆగస్టు 7వ తేదీ వరకూ సమయం ఇచ్చింది.
రాజకీయం చేయాలని చూసిన ప్రతిపక్షాలు..
సీఎం వైఎస్ జగన్ నివాసానికి సమీపంలో ఉన్న ఇరిగేషన్ భూముల్లో అక్రమంగా నిర్మించుకున్న ఈ ఇళ్లను తొలగించే విషయంపై బాధితులను అడ్డుపెట్టుకుని ప్రతిపక్షాలు రాజకీయం చేసేందుకు యత్నించాయి. ముఖ్యమంత్రి భద్రతా కారణాల వల్ల వైఎస్ జగన్ ఇంటి సమీపంలోని ప్రభుత్వ భూముల్లో నిర్మించుకున్న వారి ఇళ్లను ఖాళీ చేయాలని అధికారులు రెండు నెలల ముందే నోటీసులు జారీ చేశారు. అప్పటికే వారికి ఇళ్ల స్థలాలు కేటాయించారు. పరిహారం అందించారు. అయినా కొంత మంది ఖాళీ చేయకుండా హంగామా చేశారు. ఈ విషయంలో వాస్తవాలను పట్టించుకోని టీడీపీ, జనసేన, సీపీఐ పార్టీల నేతలు ప్రభుత్వాన్ని లక్ష్యంగా చేసుకుని విమర్శలు చేశారు. ప్రభుత్వ చర్యలు సరైనవేనని తాజాగా హైకోర్టు ఇచ్చిన ఆదేశాలతో స్పష్టమైంది.
Also Read : కృష్ణా జలవివాదం -ఆంధ్రాకు సానుకూల నిర్ణయం దిశగా కేంద్రం ప్రకటన