iDreamPost
android-app
ios-app

AP High Court, Rayapati Sailaja – ప్రతి నిర్ణయంపై కోర్టుకెక్కడమేంటి.? అమరావతి జేఏసీ నేత రాయపాటి శైలజకు హైకోర్టు మందలింపు

AP High Court, Rayapati Sailaja – ప్రతి నిర్ణయంపై కోర్టుకెక్కడమేంటి.? అమరావతి జేఏసీ నేత రాయపాటి శైలజకు హైకోర్టు మందలింపు

ప్రభుత్వం తీసుకునే ప్రతి నిర్ణయంపై ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టులో పిటీషన్లు, ప్రజాప్రయోజన వ్యాజ్యాలు (పిల్‌) దాఖలు కావడం వైసీపీ సర్కార్‌ అధికారంలోకి వచ్చినప్పటి నుంచీ చూస్తున్నాం. టీడీపీ నేతలు లేదా ఆ పార్టీ సానుభూతి పరుల పేరుతో ఈ పిటీషన్లు దాఖలు చేస్తున్నారు. విధానపరమైన నిర్ణయాలతోపాటు ప్రజా సంక్షేమ పథకాలు, ప్రజా ప్రయోజన నిర్ణయాలు, ఆఖరుకు టీటీడీ తయారు చేసే అగరబత్తీలపైన కూడా హైకోర్టులో వ్యాజ్యాలు దాఖలయ్యాయి. వీటిలో కొన్నింటిని హైకోర్టు విచారణకు స్వీకరించింది. మరికొన్నింటిని కొట్టివేసింది.

జగన్‌ ప్రభుత్వ పాలనను కోర్టుల ద్వారా టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ప్రభావితం చేస్తున్నారనే వ్యాఖ్యలు సర్వత్రా వినిపిస్తున్నాయి. ఈ విషయంపై సామాజిక మాధ్యమాల్లో జోరుగా చర్చ సాగుతూనే ఉంది. ప్రతి దానికి టీడీపీ కోర్టుల్లో పిటీషన్లు దాఖలు చేస్తోందని సాధారణ ప్రజలే కాదు.. చివరికి ఏపీ హైకోర్టు కూడా ఆ భావనకు వచ్చేసింది.

తాజాగా అమరావతి రైతు జేఏసీ నేత డాక్టర్‌ రాయపాటి శైలజ ప్రభుత్వ పథకాలకు పెట్టిన పేర్లను వ్యతిరేకిస్తూ హైకోర్టులో పిల్‌ దాఖలు చేశారు. జగన్‌ ప్రభుత్వం సంక్షేమ పథకాలకు వైఎస్‌ రాజశేఖర రెడ్డి, వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డిల పేర్లను పెడుతుండడంపై ఆ పిటీషన్‌లో అభ్యంతరం వ్యక్తం చేసింది. ఇలా పేర్లు పెట్టుకోవడం వల్ల వైఎస్‌ జగన్‌ లబ్ధిపొందుతున్నారని, ప్రజలను ప్రభావితం చేస్తున్నారంటూ శైలజ తన పిటీషన్‌లో పేర్కొన్నారు. ముఖ్యమంత్రి అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారని, దీనిపై విచారణ జరిపి తగిన ఆదేశాలు జారీ చేయాలంటూ హైకోర్టును కోరారు.

Also Read : Nani ,Vamsi -కొడాలి నాని ,వంశీ మరికొందరు ఎమ్మెల్యే లకు భద్రత పెంపు

అయితే ఈ పిటీషన్‌ను ఆదిలోనే రిజిస్ట్రీ నిలువరించారు. అసలు ఈ పిటీషన్‌కు విచారణ అర్హతలేదని అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ నంబర్‌ కేటాయించలేదు. అయితే ఈ విషయంపై రాయపాటి శైలజ మరో పిటీషన్‌ దాఖలు చేయడంతో.. రిజిస్ట్రీ అభ్యంతరాలను పరిశీలించేందుకు హైకోర్టు సిద్ధమైంది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ప్రశాంత్‌కుమార్‌ మిశ్ర, జస్టిస్‌ మల్లవోలు సత్యనారాయణ మూర్తిలతో కూడిన ధర్మాసనం రాయపాటి శైలజ పిటీషన్‌ను పరిశీలించింది. ఆ పిటీషన్‌లో ఆమె పేర్కొన్న అంశాలపై ధర్మాసనం తీవ్ర అభ్యంతరం తెలిపింది.

ప్రభుత్వ పథకాలకు నేతల పేర్లు పెట్టడంతో తప్పేముందని హైకోర్టు ప్రశ్నించింది. ఇది ఆనవాయితీగా వస్తోందని, పేర్లు పెట్టకూడదనే చట్టం ఏమైనా ఉందా..? అంటూ శైలజ తరఫున న్యాయవాదిని ధర్మాసనం ప్రశ్నించింది. ప్రతివాదిగా సీఎం వైఎస్‌ జగన్‌ పేరును చేర్చడంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ప్రతి దానికి సీఎం పేరును ఎందుకు తెస్తున్నారని ప్రశ్నించింది. ఇది ఇలాగే కొనసాగితే.. ఇప్పుడు ముఖ్యమంత్రి, రేపు ప్రధానమంత్రి పేర్లను కూడా తెస్తారని ఘాటుగా వ్యాఖ్యానించింది. ప్రభుత్వం తీసుకునే ప్రతి నిర్ణయంపై ఇలా కోర్టుకెక్కడం ఏమిటని అసహనం వ్యక్తం చేసింది. ఇలా చేయడం సాంప్రదాయం కాదని మందలించింది. పథకాలకు నేతల పేర్లు పెట్టకూడదని చట్టం చేయాలంటూ పోరాటాలు చేయాలని, చట్టం ఉంటే ఈ పిటీషన్‌పై విచారణ జరుపుతామని పిటీషనర్‌ రాయపాటి శైలజకు హైకోర్టు చురకలు అంటించింది.

Also Read : Chandrababu- చివరి అస్త్రాన్ని ప్రయోగించడం మొదలు పెట్టిన చంద్రబాబు