Idream media
Idream media
ఇళ్లు లేని పేదలందరికీ సొంత ఇళ్లు కట్టించి ఇవ్వాలనే జగన్ సర్కార్ లక్ష్యానికి అడ్డంకులు తొలగాయి. ఇళ్ల పథకం నిలిపివేయాలంటూ సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పును తోసిపుచ్చుతూ.. పేదలందరికీ ఇళ్లు పథకాన్ని కొనసాగించవచ్చని హైకోర్టు ద్విసభ్య ధర్మాసనం ఆదేశాలు జారీ చేసింది. రాష్ట్రంలో 30 లక్షల మంది పేదలకు ఇళ్ల స్థలాలు, వాటిలో ఇళ్లు కట్టించే బృహత్తర పథకానికి జగన్ సర్కార్ గత ఏడాది డిసెంబర్ 25వ తేదీన శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే. అర్హులైన ప్రతి ఒక్కరికీ గ్రామాల్లో ఒకటిన్నర సెంటు, పట్టణాలు, నగరాల్లో సెంటు చొప్పన స్థలాలను కేటాయించింది. ఆయా స్థలాలను మహిళల పేరుపై పట్టాను మంజూరు చేసింది.
వంద శాతం స్థలాలను మహిళలకే ఎలా ఇస్తారంటూ.. పలు పిటిషన్లు హైకోర్టులో దాఖలయ్యాయి. అంతే కాకుండా సెంటు, సెంటున్నర స్థలంలో ఇళ్లు ఇస్తే.. మౌలిక వసతుల సమస్య వస్తుందని కూడా వారు ఆ పిటిషన్లలో పేర్కొన్నారు. ఈ పిటిషన్లు దాఖలు చేసిన వారు సామాన్యులు కావడం, అందులో మహిళలకు కూడా ఉండడం విశేషం. మహిళలకు ఇళ్ల స్థలం ఇస్తుంటే.. వాళ్లే ఎందుకు వ్యతిరేకిస్తారే సందేహం సామాన్యులకైనా వస్తుంది. ఇది ఇళ్ల పథకాన్ని అడ్డుకోవాడానికి చేసిన కుట్ర అని వైసీపీ భావించింది. అయితే సింగిల్ జడ్జి కూడా పిటిషనర్ల వాదనతో ఏకీభవిస్తూ.. సెంటు, సెంటున్నర స్థలాల్లో ఇళ్లు ఎలా సాధ్యమని ప్రశ్నిస్తూ.. ఈ పథకాన్ని నిలిపివేయాలని ఆదేశాలు జారీ చేశారు.
సింగిల్ జడ్జి ఉత్తర్వులపై జగన్ సర్కార్ డివిజనల్ బెంచ్‌ను ఆశ్రయించింది. ఇళ్ల నిర్మాణం ఎందుకు చేపడుతున్నాం.. ఇళ్ల నిర్మాణాలకు సంబంధించిన రాష్ట్ర, కేంద్ర మార్గదర్శకాలతో డివిజనల్ బెంచ్ ముందు హౌస్‌మోషన్ పిటిషన్ దాఖలు చేసింది. సెంటు, సెంటున్నర స్థలంలో ఇళ్ల నిర్మాణం వల్ల అగ్ని ప్రమాదాలు, తాగునీటి, ఆరోగ్య సమస్యలు వస్తాయంటూ పేర్కొంటూ.. ఇళ్ల నిర్మాణాలను తాత్కాలికంగా నిలిపివేయాలని సింగిల్ జడ్జి జారీ చేసిన ఆదేశాలను కొట్టివేయాలని కోరింది.
ప్రభుత్వం పిటిషన్‌ను విచారణకు స్వీకరించిన ధర్మాసనం.. ఇరు వైపుల వాదనలను ఆలకించింది. పిటిషనర్ల వాదనలను తోసిపుచ్చింది. మహిళలకు ఇళ్ల స్థలం ఇస్తే.. ఆ కుటుంబం మొత్తానికి ఇచ్చినట్లే కదా..? అంటూ ప్రశ్నించింది. పథకానికి జగన్ పేరు పెట్టడంలో తప్పేముందంటూ ప్రభుత్వ నిర్ణయాన్ని సమర్థించింది. పిటిషనర్లు ఎవరైనా ఇళ్ల స్థలం కావాలనుకుంటే 3 వారాల్లో దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం కల్పించింది. ఇళ్ల స్థలం కోసం పురుషులు చేసుకున్న దరఖాస్తులను మూడు నెలల్లో పరిష్కరించాలని కలెక్టర్లను ఆదేశిస్తూ… ఈ పిటిషన్లను పరిష్కరిస్తున్నట్లు తెలిపింది. దీంతో పేదల ఇళ్ల నిర్మాణానికి న్యాయపరమైన అడ్డంకులు అన్ని తొలగిపోయాయి.
Also Read : Jagananna Vidya Deevena – విద్యార్థులకు శుభవార్త .. నేడు విద్యాదీవెన సొమ్ము జమ