Idream media
Idream media
పరిషత్ ఎన్నికలకు మార్గం సుగమమైంది. ఎన్నికలుకు ఏపీ హైకోర్టు డివిజనల్ బెంచ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఎన్నికలను నిలిపివేయాలని మంగళవారం సింగిల్ జడ్జి ఇచ్చిన ఉత్తర్వులను హైకోర్టు డివిజనల్ బెంచ్ నిలిపివేసింది. అయితే తదుపరి ఉత్తర్వులు ఇచ్చే వరకు ఫలితాలను వెల్లడించవద్దని ఆదేశించింది. దీంతో పరిషత్ ఎన్నికలు జరగడంపై నెలకొన్న ఉత్కంఠకు తెర పడింది.
సుప్రిం కోర్టు ఆదేశాల మేరకు ఎన్నికలు జరిగే ముందు 28 రోజుల పాటు కోడ్ ఉండాలనే నిబంధనను ఎస్‌ఈసీ పాటించలేదని, ఎన్నికలను నిలిపివేయాలని కోరుతూ టీడీపీ నేత వర్ల రామయ్య ఏపీ హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేశారు. బీజేపీ, జనసేన సహా మరో ముగ్గురు ఇప్పటి వరకు జరిగిన పరిషత్ ఎన్నికలను రద్దు చేసి.. కొత్తగా నోటిఫికేషన్ ఇవ్వాలని పిటిషన్లు దాఖలు చేశారు. వీటన్నింటిని కలిపి విచారించిన ఏపీ హైకోర్టు.. కొత్త నోటిఫికేషన్ ఇవ్వాలన్న బీజేపీ, జనసేన, ఇతరుల పిటిషన్లను కొట్టివేసింది. టీడీపీ నేత వర్ల రామయ్య తరఫు న్యాయవాది వాదనలతో ఏకీభవించిన హైకోర్టు.. పరిషత్‌ఎన్నికల ప్రక్రియను నిలిపివేయాలని, 28 రోజుల వ్యవధి కోడ్‌తో మళ్లీ నోటిఫికేషన్ జారీ చేయాలని ఆదేశాలు జారీ చేసింది.
Also Read : ప్రభుత్వానికి అడ్డంకులు సృష్టించడమే టీడీపీ లక్ష్యమా..?
హైకోర్టు సింగిల్ జడ్జి ఇచ్చిన ఆదేశాలను ఎస్‌ఈసీ డివిజనల్ బెంచ్‌లో సవాల్ చేసింది. ఈ రోజు పిటిషన్‌ను డివిజనల్ బెంచ్ విచారించింది. పరిషత్ ఎన్నికలకు కొత్తగా నోటిఫికేషన్ ఇవ్వలేదని, మధ్యలో ఉన్న ప్రక్రియను పూర్తి చేసేందుకు నోటిఫికేషన్ జారీ చేశామని పేర్కొంది. సుప్రిం ఆదేశాలు ఈ సమయంలో వర్తించవని ఎస్‌ఈసీ తరఫున న్యాయవాది సీవీ మోహన్ రెడ్డి ధర్మాసనం దృష్టికి తీసుకెళ్లారు. అయితే సరైన పత్రాలతో రావాలంటూ విచారణను ధర్మాసనం మధ్యాహ్నానికి వాయిదా వేసింది. మళ్లీ విచారణ ప్రారంభమైన తర్వాత ఎస్‌ఈసీ వాదనలను ఆలకించింది. కొంత విరామం తర్వాత తీర్పును వెల్లడించింది.
రేపు రాష్ట్ర వ్యాప్తంగా ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల పోలింగ్ జరగబోతోంది. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు పోలింగ్ జరగబోతోంది. బ్యాలెట్ పద్ధతిలో పార్టీ గుర్తులతో పరిషత్ ఎన్నికలు జరగబోతున్నాయి. ఇందు కోసం అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. పోలింగ్ సిబ్బంది సిద్ధంగా ఉన్నారు. 9వ తేదీన అవసరమైన చోట రీపోలింగ్ నిర్వహించనున్నారు. 10వ తేదీన కౌటింగ్ చేపట్టనున్నారు. ఈ ఎన్నికలను బహిష్కరిస్తున్నట్లు టీడీపీ ప్రకటించినా.. పలు చోట్ల ఆ పార్టీ అభ్యర్థులు బరిలో ఉన్నారు. వైసీపీ సహా బీజేపీ, జనసేన, ఇతర పార్టీలు, స్వతంత్ర అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నారు.
Also Read : రాజకీయాల్లో ఆదర్శం అనుకుంటుండగానే.. ట్విస్ట్ ఇచ్చిన మాజీ హోం మంత్రి