Idream media
Idream media
గ్రామ పరిపాలనలో భాగస్వాములయ్యే అవకాశాన్ని ఆంధ్రప్రదేశ్‌లోని యువత కోల్పోయింది. 2019 ఓటర్ల జాబితా ప్రకారం జరుపుతున్న ఎన్నికల వల్ల 3.60 లక్షల మంది ఓటు హక్కు వినియోగించుకునే అవకాశం కోల్పోతున్నారని, 2021 ఓటర్ల జాబితా ప్రకారం ఎన్నికలు నిర్వహించేలా ఆదేశాలివ్వాలని దాఖలైన పిటిషన్లను ఆంధ్రప్రదేశ్ హైకోర్టు కొట్టివేసింది. పిటిషనర్ల వాదనతో విభేధించిన హైకోర్టు.. ఈ దశలో పంచాయతీ ఎన్నికల్లో జోక్యం చేసుకోబోమని చెబుతూ.. దాఖలైన రెండు పిటిషన్లను తోసిపుచ్చింది.
పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలనే పట్టుదలతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్‌కుమార్ తీసుకున్న ఏకపక్ష నిర్ణయం ఇప్పుడు యువ ఓటర్ల పాలిట షరాఘాతౖమైంది. కరోనా, వ్యాక్సినేషన్ నేపథ్యంలో ఎన్నికలు నిర్వహించలేమని ఏపీ ప్రభుత్వం చెబుతున్నా, అధికారులు ఆందోళనల వ్యక్తం చేస్తున్నా.. తాను పట్టిన కుందేలుకు మూడే కాళ్లన్నట్లుగా, తన మాటే నెగ్గాలనే వైఖరితో నిమ్మగడ్డ రమేష్‌కుమార్ పంచాయతీ ఎన్నికలకు నోటిఫికేషన్ జారీ చేశారు. 2019 సాధారణ ఎన్నికలకు సిద్ధం చేసిన ఓటర్ల జాబితా ప్రకారం ఎన్నికలు నిర్వహిస్తామని ప్రకటించారు. ఫలితంగా 2019 జనవరి నుంచి ఈ ఏడాది జనవరి వరకు ఓటర్లుగా నమోదైన యువత ప్రస్తుతం జరగబోతున్న పంచాయతీ ఎన్నికల్లో ఓటు హక్కు కోల్పోతున్నారు. ఓటర్లుగా నమోదైనప్పటికీ.. 2019 ఓటర్ జాబితా ప్రకారమే ఎన్నికలు నిర్వహించబోతుండడంతో యువ ఓటర్లకు నష్టం జరగబోతోంది.