Idream media
Idream media
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని అంశంపై దాఖలైన వ్యాజ్యాల విచారణ మళ్లీ వాయిదా పడింది. ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ ఏకే గోస్వామి బాధ్యతలు చేపట్టిన తర్వాత రాజధాని వ్యాజ్యాలపై ఈ ఏడాది మార్చి 26వ తేదీన తొలిసారి విచారణ జరిగింది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఏకే గోస్వామి నేతృత్వంలోని జస్టిస్ జోయ్ మల్య బాగ్చి, జస్టిస్ ఎన్. జయసూర్యలతో కూడిన త్రిసభ్య బెంచ్ ఈ విచారణ మొదలుపెట్టింది. అయితే కరోనా సెకండ్ వేవ్ మొదలుకావడంతో విచారణను ఆగస్టు 23వ తేదీకి వాయిదా వేస్తూ ధర్మాసనం నిర్ణయం తీసుకుంది. ఈ రోజు విచారణ ప్రారంభం కాగా.. కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో విచారణను వాయిదా వేయాలని పిటిషనర్ల తరపు న్యాయవాదులు కోరారు. వాయిదా నిర్ణయం ధర్మాసనానికే వదిలిపెడుతున్నట్లు ప్రభుత్వం తరఫున న్యాయవాదులు పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో విచారణను నవంబర్ 15వ తేదీకి వాయిదా వేస్తూ ధర్మాసనం నిర్ణయం తీసుకుంది.
కరోనా వల్ల విచారణ ఆగిపోవడం, ప్రభుత్వం, ప్రజలు అందరూ కరోనాను ఎదుర్కొవడం, వైరస్ ఉధృతి తగ్గిన తర్వాత చితికిపోయిన ఆర్థిక పరిస్థితిని చక్కదిద్కుకోవడంపై దృష్టి పెట్టారు. మీడియా కూడా ఈ అంశంపై పెద్దగా స్పందించిన సందర్భాలు లేవు. అయితే విచారణ మళ్లీ వాయిదా పడడంతో నవంబర్ 15 వరకూ ఈ అంశంపై ఎలాంటి ముందడుగు ఉండబోదు. 2019 ముగింపు, 2020 ప్రారంభంలో మొదలైన ఈ వివాదం.. 2021కి పరిష్కారం అవుతుందని ఆశిస్తే.. కరోనా వల్ల సాధ్యపడలేదు. తాజాగా విచారణ నవంబర్ 15కు వాయిదా పడడంతో 2022 నాటికైనా ఈ అంశం ఓ కొలిక్కి వచ్చే పరిస్థితులు కనిపించడం లేదు. ఈ రోజు విచారణ ప్రారంభం కాబోతుండడంతో అమరావతి ఉద్యమకారులు ఈ అంశంపై తమదైన శైలిలో స్పందిస్తూ న్యాయస్థానంతోపాటు ప్రజల దృష్టిని ఆకర్షించే ప్రయత్నం చేశారు. విచారణ ప్రారంభమవుతున్న తరుణంలో అమరావతి ఉద్యమకారులు న్యాయదేవతకు పాలాభిషేకం చేశారు.
2019 డిసెంబర్ 17వ రాష్ట్ర సమగ్ర అభివృద్ధి కోసం మూడు రాజధానులను ఏర్పాటు చేసే ఆలోచనతో ఉన్నట్లు వైసీపీ సర్కార్ శాసన సభలో పేర్కొంది. సీఎం వైఎస్ జగన్ చేసిన ఈ ప్రకటన తర్వాత అమరావతినే ఏకైక రాజధానిగా ఉంచాలంటూ టీడీపీ నేతలు, అమరావతి ప్రాంత గ్రామాల్లోని కొంత మంది ఉద్యమం మొదలుపెట్టారు. తదుపరి కాలక్రమంలో ప్రభుత్వం సీఆర్‌డీఏను రద్దు చేయడం, వికేంద్రీకరణపై చట్టం చేసింది. వీటిని వ్యతిరేకిస్తూ పలువురు హైకోర్టు, సుప్రిం కోర్టుల్లో వ్యాజ్యాలు దాఖలు చేశారు. విచారించిన సుప్రిం కోర్టు.. అన్ని వ్యాజ్యాలను ఏపీ హైకోర్టు విచారించాలని, రోజు వారీ విచారణ జరిపి, వీలైనంత త్వరగా తేల్చాలని ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ జేకె మహేశ్వరి నేతృత్వంలోని బెంచ్.. విచారణ ప్రారంభించింది. అయితే ప్రధాన న్యాయమూర్తి సిక్కిం రాష్ట్రానికి బదిలీ కావడం, ఆ తర్వాత కోవిడ్ వ్యాపించడంతో ఈ వ్యాజ్యాలపై విచారణ నెమ్మదించింది. కోవిడ్ వల్ల మరోసారి విచారణ దీర్ఘకాలిక వాయిదా పడింది.
Also Read : అభివృద్ధి వికేంద్రీకరణలో విప్లవాత్మక మార్పు విలేజ్ క్లినిక్కులు