iDreamPost
android-app
ios-app

AP High Court, Three Capitals – ప్రభుత్వ విజ్ఞప్తి పై స్పందించని ధర్మాసనం.. రాజధాని అంశంలో ఏం జరుగుతోంది..?

AP High Court, Three Capitals – ప్రభుత్వ విజ్ఞప్తి పై స్పందించని ధర్మాసనం.. రాజధాని అంశంలో ఏం జరుగుతోంది..?

ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టులో కీలక పరిణామం చోటు చేసుకుంది. సీఆర్డీఏ రద్దు, పాలనా వికేంద్రీకరణ చట్టాలను సవాల్‌ చేస్తూ దాఖలైన పిటీషన్లపై విచారణను హైకోర్టు వచ్చే నెల 27వ తేదీకి వాయిదా వేసింది. ఈ రెండు చట్టాలను ఉపసంహరించుకుని, అందుకు సంబంధించిన బిల్లులను జత చేస్తూ ఏపీ సర్కార్‌ ఈ నెల 26వ తేదీ శుక్రవారం నాడు హైకోర్టులో అఫిడవిట్‌ దాఖలు చేసింది. ధర్మాసనం ఆదేశాల మేరకు ఈ రెండు చట్టాల ఉపసంహరణపై అఫిడవిట్‌ దాఖలు చేసిన ఏపీ సర్కార్‌.. ఈ అంశాలపై దాఖలైన పిటీషన్లపై విచారణను ముగించేలా తగిన ఆదేశాలు ఇవ్వాలని విజ్ఞప్తి చేసింది. అయితే ఈ రోజు మరోసారి పిటీషన్లపై విచారణ జరిపిన హైకోర్టు.. ప్రభుత్వ విజ్ఞప్తిని పరిగణలోకి తీసుకోలేదని విచారణను వాయిదా వేయడం ద్వారా స్పష్టమైంది.

రాష్ట్రంలోని రాయలసీమ, కోస్తా, ఉత్తరాంధ్ర ప్రాంతాలలో మూడు చోట్ల మూడు రాజధానులు ఏర్పాటు చేయాలని సీఆర్‌డీఏ రద్దు, పాలనా వికేంద్రీకరణ చట్టాలను జగన్‌ ప్రభుత్వం తీసుకొచ్చిన విషయం తెలిసిందే. అయితే ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ, అమరావతినే ఏకైక రాజధానిగా కొనసాగించాలంటూ.. అమరావతిలోని కొంత మంది రైతులు, టీడీపీ నేతలు హైకోర్టు, సుప్రీం కోర్టులో దాదాపు 200 పిటీషన్లు దాఖలు చేశారు. ఈ పిటీషన్లపై స్పందించిన దేశ అత్యున్నత న్యాయస్థానం.. రాజధాని అంశానికి సంబంధించిన అన్ని పిటీషన్లు కలిపి విచారణ చేయాలని ఏపీ హైకోర్టుకు సూచించింది. రోజు వారీ విచారణ జరిపి, వీలైనంత త్వరగా ఈ వివాదాల్ని పరిష్కరించాలని సూచించింది. అయితే కరోనా కారణంగా పలుమార్లు వాయిదా పడిన విచారణ.. ఇటీవల ప్రారంభమైంది.

అయితే.. మూడు రాజధానుల ఏర్పాటుపై ప్రతిపక్షం, కొన్ని మీడియా సంస్థలు ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నాలు చేస్తుండడంతో.. అసలు మూడు రాజధానుల ప్రతిపాదన ఎందుకు తెచ్చాము..? అవసరం ఏమిటి..? అనే అంశాలను కూడా బిల్లులో పొందుపరిచి, అందరి అనుమానాలను తీర్చేందుకు.. కొత్త చట్టాలను తెస్తామని సీఎం జగన్‌ ఈ నెల 22వ తేదీన అసెంబ్లీలో ప్రకటించారు. అందు కోసం ప్రస్తుతం చేసిన చట్టాలను వెనక్కి తీసుకుంటున్నామని ప్రకటన చేశారు. అదే రోజు హైకోర్టుకు ఈ విషయాన్ని అడ్వకేట్‌ జనరల్‌ సుబ్రమణ్య శ్రీరామ్‌ తెలియజేశారు. ఈ విషయంపై అఫిడవిట్‌ దాఖలు చేయాలని హైకోర్టు ఆదేశించడంతో.. ఈ నెల 26వ తేదీన సీఆర్‌డీఏ రద్దు, పాలనా వికేంద్రీకరణ చట్టాలను వెనక్కి తీసుకుంటున్నట్లు రెండు చట్టసభలు ఆమోదించిన బిల్లులతో అఫిడవిట్‌ దాఖలు చేశారు. చట్టాల రద్దు విషయంలో శాసనపరమైన ప్రక్రియ పూర్తవగా.. హైకోర్టులో ఈ విషయం కొనసాగేలా కనిపిస్తోంది. ఈ వ్యవహారంలో రాబోయే రోజుల్లో ఏం జరుగుతోందన్న ఆసక్తి విచారణను వాయిదా వేయడం వల్ల నెలకొంది.

Also Read : Andra Pradesh, Education – వైఎస్సార్ , జగన్.. ఆ విషయంలో ఇద్దరిదీ ఒకే సిద్ధాంతం