iDreamPost
iDreamPost
ఆంధ్రప్రదేశ్ లో చంద్రబాబు ఇచ్చిన హామీల అమలుకోసం ఉద్యమించిన కాపులను టీడీపీ ప్రభుత్వం ఎక్కడికక్కడ అణచివేసింది. అనేక రకాలుగా నిర్బంధం విధించింది. ముఖ్యంగా 2015 నుంచి 2018 వరకూ వివిధ రూపాల్లో జరిగిన కాపు రిజర్వేషన్ల పోరాట సమితి ఆందోళనపై ఉక్కుపాదం మోపింది. ఆ ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం కుటుంబ సభ్యుల నుంచి ఎవరినీ వదిలిపెట్టలేదు. అందరినీ నిర్బంధించి, నిందలు వేస్తూ నానా రకాలుగా హింసించింది. ఈ నేపథ్యంలో కాపు ఉద్యమం పట్ల చంద్రబాబు ధోరణిని జగన్ విపక్షంలో ఉండగా తప్పుబట్టారు. ఇచ్చిన హామీ అమలు చేయమన్నందుకు కేసులు పెట్టి ఇబ్బంది పెడతారా అంటూ ప్రశ్నించారు.
తాజాగా జగన్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఆ మేరకు హోం శాఖ ముఖ్య కార్యదర్శి కుమార్ విశ్వజిత్ కీలక ఆదేశాలు జారీ చేశారు. పోలీస్ ఉత్తర్వుల ప్రకారం ఏపీలో కాపు రిజర్వేషన్ల ఉద్యమం సందర్భంగా నమోదయిన 1661 కేసులను ఉపసంహరించుకున్నారు. తద్వారా వేలమందికి ఉపశమనం దక్కింది. కాపుల హక్కుల కోసం పోరాడిన సందర్భంగా వివిధ సందర్భాల్లో ఈ కేసులు నమోదయ్యాయి. రాష్ట్ర వ్యాప్తంగా కాపుల పోరాటం అణగదొక్కే క్రమంలో నమోదయిన కేసులను తాము రద్దు చేస్తామని అప్పట్లో జగన్ ప్రకటించారు. దానికి అనుగుణంగా ఈ నిర్ణయం వెలువడింది. రద్దు చేసిన కేసుల్లో అప్పట్లో ముద్రగడ ఇంటివద్ద పోలీసులను అడ్డుకున్నారంటూ నమోదయిన కేసుల్లో ఆయనతో పాటుగా పలువురు నాయకులకు విముక్తి లభించింది.
కాపుల ఉద్యమంలో అనేక చోట్ల టీడీపీ నేతలే చొరబడి విధ్వంసానికి పాల్పడినట్టు అప్పట్లో ఆరోపణలు వచ్చాయి. ముఖ్యంగా తునిలో జరిగిన బహిరంగసభను పక్కదారి పట్టించే క్రమంలో అప్పట్లో యనమల మనుషులు నేరుగా రత్నాచల్ తగులబెట్టేందుకు సిద్ధమయ్యారనే విమర్శలను కాపు ఉద్యమనేతలు చేశారు. అయితే ఆ కేసులో అనేక మంది సామాన్యులు, లారీడ్రైవర్లను కూడా ఇరికించి, జైళ్లచుట్టూ తిప్పిన అనుభవం ఉంది. దాంతో ఈ వ్యవహారం పై తాజాగా ఏపీ ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులు వారందరికీ ఉపశమనం కలిగిస్తాయని భావిస్తున్నారు. అయితే రైలు దహనం కేసు రైల్వే పోలీసుల పరిధిలో ఉంది. విచారణ సాగుతోంది. ఆ కేసు ఇంకా కొనసాగుతోంది. అదే సమయంలో కాపు ఉద్యమనేతలు ఈ నిర్ణయాన్ని ఆహ్వానిస్తున్నారు. జగన్ ఇచ్చిన మాటకు అనుగుణంగా ఉత్తర్వులు వెలువడడం పట్ల సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. చంద్రబాబు చెప్పింది చేయకపోగా కేసులు పెట్టి ఇరిక్కిస్తే, జగన్ దానికి విరుద్ధంగా వ్యవహరించడం ఆకట్టుకుంటోంది.
Also Read : డిప్యూటీ సీఎం కుల వివాదానికి ముగింపు, క్లారిటీ ఇచ్చేసిన రాష్ట్ర ప్రభుత్వం