Idream media
Idream media
కార్య నిర్వాహక రాజధానిగా ప్రకటన వెలువడిన అనంతరం విశాఖ నగరంలో అనూహ్య మార్పులు చోటుచేసుకుంటున్న విషయం అందరూ గమనిస్తున్నదే. ప్రభుత్వం కూడా ఆ నగరంపై ప్రత్యేక దృష్టి సారించింది. భారీ ప్రాజెక్టులకు సంబంధించిన అంశాలను పరిగణనలోకి తీసుకుని వాటిని తక్షణం పూర్తి చేసేలా చర్యలు చేపడుతోంది. లాక్ డౌన్ కారణంగా నిలిచిపోయిన ప్రధాన పనులను పరుగులు పెట్టించేందుకు సిద్ధమవుతోంది. ఇందులో భాగంగా మెట్రోను వీలైనంత త్వరలో పరుగులు పెట్టించేందుకు ప్రయత్నాలు చేస్తోంది. విశాఖలో మెట్రో ప్రాంతీయ కార్యాలయ నిర్మాణ పనులు చకచకా సాగుతున్నాయి. ఇప్పటికే లైట్ మెట్రో, ట్రామ్ కారిడార్లకు సంబంధించిన డిటైల్ ప్రాజెక్టు రిపోర్ట్ లను తయారుచేసే పనిలో అర్బన్ మాస్ ట్రాన్సిస్ట్ కంపెనీ లిమిటెడ్ సంస్థ తలమునకలై ఉంది.
ఈ నెలలోనే…
ఈ నెల మూడో వారం నాటికి ప్రాంతీయ కార్యాలయ పనులు పూర్తయ్యే అవకాశాలు ఉన్నాయి. అలాగే ఈ నెలాఖరునాటికి లైట్ మెట్రో డీపీఆర్, నవంబర్ నాటికి ట్రామ్ కారిడార్ లకు చెందిన డీపీఆర్ లు పూర్తయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. లైట్ మెట్రోరైలు ప్రాజెక్టుకు సంబంధించి గతంలో రూపొందించిన 42.55 కిలోమీటర్ల డీపీఆర్ ను అప్ డేట్ చేస్తూ 79.91 కిలోమీటర్లకు చెందిన డీపీఆర్ ను రూ. 5.34 కోట్లకు, 60.20 కిలోమీటర్లు ఉన్న ట్రామ్ కారిడార్ కు సంబంధించిన డీపీఆర్ ను రూ. 3.38 కోట్లకు రూపొందించే బాధ్యతను అర్బన్ మాస్ ట్రాన్సిస్ట్ కంపెనీ లిమిటెడ్ కు ప్రభుత్వం అప్పగించింది. ఎల్ఐసీ భవన్ లో విశాఖ మెట్రో ప్రాంతీయ కార్యాలయం ఏర్పాటు చేస్తున్నారు. ఇది సిద్ధమైతే ప్రాజెక్టు పర్యవేక్షణకు మరింత అనుకూలంగా మారుతుంది.
మరోవైపు కేంద్రంతోచర్చలు
అలాగే ప్రాజెక్టులు వేగంగా ముందుకు కదిలించేందుకు కేంద్ర ప్రభుత్వం చేయాల్సిన కార్యక్రమాలు కూడా వేగంగా జరిగేలా ఎంపీ విజయసాయిరెడ్డి ప్రయత్నాలు చేస్తున్నారు. ఇటీవల జరిగిన పార్లమెంట్ సమావేశాల్లో కూడా విజయసాయిరెడ్డి విశాఖ వాయిస్ ను వినిపించారు. పార్లమెంట్ సమావేశాల్లో ప్రవేశ పెట్టిన నేషనల్ కమిషన్ ఫర్ ఇండియన్ సిస్టమ్ ఆఫ్ మెడిసిన్ బిల్లులో నేచురోపతి సిస్టమ్ ఆఫ్ యోగాను చేర్చాలని ఆయన చేసిన వినతికి కేంద్రం కూడా సానుకూలంగా స్పందించింది. అలాగే రైల్వే ప్రాజెక్టులు కూడా వేగవంతం కానున్నాయి. ఇలా విశాఖకు రాజధాని స్థాయిలో చేపట్టాల్సిన అభివృద్ధిని త్వరితగతిన చేసేందుకు ప్రభుత్వం వడివడిగా అడుగులు వేస్తోంది.