iDreamPost
android-app
ios-app

కేంద్రం వదిలేసింది.. రాష్ట్రం భరోసా ఇచ్చింది

  • Published Apr 24, 2021 | 4:24 AM Updated Updated Apr 24, 2021 | 4:24 AM
కేంద్రం వదిలేసింది.. రాష్ట్రం భరోసా ఇచ్చింది

ఉచిత వ్యాక్సిన్ కార్యక్రమం నుంచి కేంద్ర ప్రభుత్వం మధ్యలోనే తప్పుకున్నా.. రాష్ట్ర ప్రభుత్వం నేనున్నానంటూ ముందుకొచ్చింది. ఆ బాధ్యతను మోసేందుకు సిద్ధమైంది. ప్రపంచ విపత్తు అయిన కోవిడ్ నుంచి ప్రజలను రక్షించాల్సిన కర్తవ్యాన్ని కట్టుబడి.. ఆర్థిక భారమైనా సరే ఉచితంగా టీకాలు ఇవ్వాలని జగన్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో ఇప్పటికే 45 ఏళ్ళు పైబడిన వారికి ఉచిత టీకా కార్యక్రమం ముమ్మరంగా సాగుతోంది. సీఎం జగన్ నిర్ణయంతో 18ఏళ్ళు దాటినా వారికి కూడా ఉచిత టీకా అందుతుంది.

కాడి దించేసిన కేంద్రం

దేశంలో జనవరి 16న కోవిడ్ టీకా ప్రారంభమైనప్పటి నుంచి దేశ ప్రజలందరికి ప్రాధాన్యత క్రమంలో టీకాలు ఉచితంగా వేస్తామని ప్రధానితో సహా కేంద్ర పెద్దలందరూ పలు సందర్భాల్లో గొప్పలు చెప్పారు. కానీ మధ్యలోనే కాడి దించేశారు. తొలిదశలో ఫ్రంట్ లైన్ వర్కర్లకు, 60ఏళ్ళు పైబడిన వారికి.. మలిదశలో 45 ఏళ్ళు దాటిన వారికి ఉచితంగా టీకాలు వేస్తున్నారు. మూడో దశలో 18 ఏళ్ళు దాటిన వారికి మే ఒకటో తేదీ నుంచి వ్యాక్సిన్ వేయనున్నట్లు కేంద్రం ప్రకటించింది. అయితే ఈ బాధ్యత నుంచి కేంద్రం తప్పుకుంది. ఉత్పత్తిదారుల నుంచి రాష్ట్రాలు, ప్రైవేట్ ఆస్పత్రులు నేరుగా వ్యాక్సిన్ కొనుగోలు చేసుకొని టీకా కార్యక్రమం కొనసాగించాలని సెలవిచ్చింది. దానికి కూడా కేంద్రానికి ఇచ్చే ధర కంటే ఎక్కువ రేటు నిర్ణయించింది. దీనివల్ల అటు రాష్ట్రాలు.. ఇటు ప్రైవేట్ ఆస్పత్రుల్లో వ్యాక్సిన్ వేయించాకోవాలనుకునే పౌరులపై ఆర్థిక భారం మోపింది. కేంద్ర నిర్ణయం భారత ఫెడరల్ స్ఫూర్తికి విఘాతమన్న విమర్శలు వచ్చినా లెక్కచేయలేదు.

ప్రజారోగ్యానికే జగన్ సర్కార్ ప్రాధాన్యం

రాష్ట్రంలో ప్రజారోగ్యానికి అధిక ప్రాధాన్యమిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం కరోనా కట్టడికి ఇప్పటికే పలు చర్యలు చేపట్టింది. టెస్టుల సంఖ్య పెంచేందుకు వీలుగా అదనపు సిబ్బంది, సౌకర్యాల కల్పనకు ఆదేశించిన ప్రభుత్వం.. కేంద్రం వదిలేసిన టీకా కార్యక్రమాన్ని వెంటనే అందిపుచ్చుకుంది. రాష్ట్రం ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్నా 18 ఏళ్ళు దాటిన వారందరికీ ఉచితంగా టీకాలు వేయాలని నిర్ణయించింది. కరోనా సెకండ్ వేవ్ ఎక్కువగా ఈ ఏజ్ గ్రూప్ వారిపైనే దాడి చేస్తున్న తరుణంలో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై హర్షం వ్యక్తమవుతోంది. రాష్ట్రంలో 18-45 ఏళ్ల వయసు ఉన్న వారి సంఖ్య 2.04 కోట్ల వరకు ఉందని అంచనా. అంటే రాష్ట్ర జనాభాలో దాదాపు మూడో వంతు అన్నమాట. వీరందరికి రెండు డోసుల టీకా ఉచితంగా వేయడానికి సుమారు రూ.1600 కోట్లు ఖర్చవుతుంది ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని చెప్పారు. సీఎం నేతృత్వంలో జరిగిన ఉన్నతస్థాయి సమావేశంలో ఉచిత టీకా నిర్ణయం జరిగిందన్నారు. సమావేశం నుంచే భారత్ బయో టెక్, హెటిరో డ్రగ్స్ ఎండీలతో సీఎం జగన్ ఫోనులో మాట్లాడి రాష్ట్ర అవసరాలకు తగినంత టీకా డోసులు, రెం డెసివర్ ఇంజక్షన్లు సరఫరా చేయాలని కోరారని మంత్రి వివరించారు.