Idream media
Idream media
టీడీపీ ప్రభుత్వ హయాంలో దాదాపు నాలుగేళ్ల పాటు ముఖం చాటేసిన వరుణుడు వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఏడాది నుంచి నిత్యం పలుకరిస్తున్నాడు. ప్రతి ఏడాది పుష్కలంగా వర్షాలు పడుతున్నాయి. గత ఏడాది గులాబ్ తుఫాను కారణంగా ఏపీలో విస్తారంగా వర్షాలు కురిశాయి. వాగులు, వంకలు, చెరువులు పొంగిపొర్లడంతో రహదారులు దెబ్బతిన్నాయి. ప్రధాన రహదారులతోపాటు గ్రామీణ ప్రాంతాల్లోనూ రోడ్లు గుంతలమయమయ్యాయి. వైసీపీ సర్కార్‌పై విమర్శలు చేసేందుకు ఎలాంటి అవకాశం లభించక సతమతమవుతున్న ప్రతిపక్ష పార్టీలకు వర్షాలు, వరదల వల్ల దెబ్బతిన్న రహదారులు కనిపించాయి. దొరికిందే సందు అన్నట్లుగా టీడీపీ, జనసేన పార్టీలు రోడ్లపై రాజకీయాలు చేయడం మొదలుపెట్టాయి. వర్షాల వల్ల రోడ్లు దెబ్బతినడం సర్వసాధారణమైనా.. అది వైసీపీ ప్రభుత్వం వైఫల్యం అయినట్లుగా నానారచ్చ చేశాయి.
అయితే వర్షాలు పడినప్పుడు రోడ్లు దెబ్బతినడం సర్వసాధరణమనే విషయం ప్రజలకు తెలిసిందే. ఆ విషయాన్నే సీఎం వైఎస్‌జగన్‌మోహన్ రెడ్డి కూడా చెప్పారు. వర్షాకాలం ముగిసిన తర్వాత.. రోడ్లకు మరమ్మత్తులు, నూతన రహదారులు వేస్తామని చెప్పారు. సాధారణంగా వేసవిలో ఇలాంటి పనులు ఎక్కువగా జరుగుతుంటాయి. ఈ నేపథ్యంలోనే వేసవిలో రోడ్ల పనులు చేసేందుకు ప్రణాళికలు రచించిన వైఎస్ జగన్ సర్కార్.. దాన్ని అమలు చేసేందుకు సిద్ధమైంది. రాష్ట్ర వ్యాప్తంగా రహదారులకు కొత్త సొబగులు అద్దేందుకు 2,205 కోట్ల రూపాయలను ప్రభుత్వం మంజూరు చేసింది. ఇప్పటికే రోడ్ల పనులకు సంబంధించి 83 శాతం టెండర్లు కూడా పూర్తి చేసింది. ఈ నెలాఖరు లోపు మిగతా 17 శాతం పనులకు కూడా టెండర్లు ఖరారు చేయనుంది. ఇప్పటికే పలు చోట్ల రహదారుల నిర్మాణ పనులు మొదలయ్యాయి. వేసవి ముగిసేలోపు (మే నెల) ఈ పనులను పూర్తి చేయాలని జగన్ సర్కార్ లక్ష్యం పెట్టుకుంది.
మొత్తం మీద రహదారుల సమస్యకు పరిష్కారం లభించబోతోంది. మళ్లీ భారీ వర్షాలు పడితే.. దెబ్బతినే ప్రమాదం లేకపోలేదు. మళ్లీ దెబ్బతిన్నా.. ఆయా రోడ్లను తిరిగి పునరుద్ధరిస్తారు. ఇది నిత్యం జరిగే ప్రక్రియే. అయితే ఇప్పటి వరకు రోడ్లపై రాజకీయాలు చేసిన ప్రతిపక్ష పార్టీల పరిస్థితి ఏమిటన్నదే ఇప్పుడు పశ్న. మరో అంశం దొరికేవరకూ ఎదురుచూడడం తప్పా ప్రతిపక్ష పార్టీలు చేయగలిగింది ఏమీ లేదు. రోడ్లపై రభస చేసిన ప్రతిపక్ష పార్టీలు.. అంతిమంగా వైసీపీ ప్రభుత్వానికి మేలే చేశాయి. రహదారులను దెబ్బతినడం సర్వసాధారణమే అయినా.. వర్షాకాలం ముగిసిన వెంటనే నెలల వ్యవధిలో యుద్ధ ప్రాతిపదికన ఆయా రోడ్లను అద్దాల్లా మెరిసేలా జగన్ సర్కార్ చేస్తోందనే విషయం ప్రజలకు అర్థమవుతోంది.