Idream media
Idream media
కరోనా మహమ్మారి కారణంగా ఇప్పటికీ ఆర్థిక వ్యవస్థ కుదేలై కోలువడానికి పలు రాష్ట్రాలు సతమతం అవుతున్నాయి. సంక్షేమ పథకాల్లో కోత విధిస్తున్నాయి. మరోవైపు ప్రజల జీవన ప్రమాణాలు కూడా పడిపోయాయి. కానీ ఆంధ్రప్రదేశ్‌లో మాత్రం ప్రజల ఆర్థిక భద్రతకు భరోసా ఏర్పడింది. ఎన్ని ఇబ్బందులున్నా వెనుకడుగు వేయకుండా ప్రజల కోసం ప్రభుత్వం చెప్పినవన్నీ చేస్తోంది. ఫలితంగా ఏపీలో మాత్రం పేద ప్రజల జీవన ప్రమాణాలు పెరుగుతున్నాయి. గ్రామాల్లో ఎక్కడా కూడా ప్రజలు జీవనోపాధి కోసం ఇబ్బంది పడుతున్న దాఖలాలు కనిపించడం లేదు. ఎకానమీ సైకిల్ పటిష్టంగా ఉండటం వల్లే కూలి పనులకు ఎక్కువ డిమాండ్ ఏర్పడి రేట్ల పెరుగుదల కనిపిస్తోందని ఆర్థిక నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్ లో వ్యవసాయ కూలీలు మొదలు అసంఘటిత కార్మికులు, చేతి వృత్తి పనులు చేసుకునే వారి వరకు రోజు వారీ సంపాదన ఏడాదిలో తొమ్మిది నుంచి పదమూడు శాతం వరకు పెరిగినట్టు ఎకనామిక్స్ అండ్ స్టాటిస్టిక్స్ డైరెక్టరేట్ అధ్యయనంలో తేలింది. అసంఘటిత కార్మిక వర్గంలో అత్యంత బలహీన కేటగిరీగా భావించే గ్రామీణ ప్రాంతంలోని చేతివృత్తిదారులు, వ్యవసాయ కూలీల రోజు వారీ కూలీ రేట్లపై ఈ సంస్థ రాష్ట్ర వ్యాప్తంగా నలభై రెండు రెవెన్యూ డివిజన్ల పరిధిలోని నలభై నాలుగు ప్రాంతాల్లో పదహారు రకాల వృత్తులలో కూలీ రేట్లపై అధ్యయనం చేసింది. ఈ అధ్యయనంలో పేదల జీవనోపాధికి లోటు లేకుండా ఉందనే విషయం వెల్లడైంది.
సాధారణ వ్యవసాయ కూలీకి 2019–20 ఆర్థిక సంవత్సరంలో రోజుకు రూ.368 కూలి దక్కితే.. కరోనా విపత్తు సంభవించిన 2020–21 ఆర్థిక సంవత్సరంలో రూ.416 చొప్పన అందింది. అంటే విపత్తు వేళ కూడా కూలి రూ.48 పెరగడం అంటే చిన్న విషయం కాదని ఆర్థిక రంగ నిపుణులు అంటున్నారు. వ్యవసాయ కూలీల కూలి రేట్లలో కూడా పదమూడు శాతం పెరుగుదల నమోదైంది. అదే సమయంలో వడ్రంగి (చెక్క పని చేసే వారు) పని చేసే వారి రోజు వారీ కూలి రేటు తొమ్మిది శాతం, చెప్పులు కుట్టుకునే వారి రోజు వారీ కూలీ రేటు ఎనిమిది శాతం పెరిగినట్టు అధ్యయనంలో తేలింది. అయితే ఇదే సమయంలో వ్యవసాయ కూలీ పనులు చేసుకునే వారిలో స్త్రీ, పురుషుల కూలి రేట్ల మధ్య భారీ వ్యత్యాసం ఉంది. పురుషులకు రోజు వారీ కూలి సరాసరి రూ.416 చొప్పున దక్కితే, మహిళలకు మాత్రం సరాసరి రూ.298 చొప్పునే అందుకోగలిగారు. కాగా, మహిళల కూలి రేట్లలో ఏడాదిలో 12 శాతం పెరుగుదల నమోదవ్వడం గమనార్హం.
2019–20 ఆర్థిక సంవత్సరంతో పోల్చితే ప్రస్తుత ఆర్థిక సంవత్సరం హోల్‌సేల్ ప్రైస్ ఇండెక్స్ (ధరల సూచి)లో పెరుగుదల 8.5 శాతంగా ఉంది. అంటే వినియోగ వస్తువుల ధరల సూచీలో పెరుగుదల కంటే గ్రామాల్లో చేతి వృత్తిదారులు, వ్యవసాయ కూలీల రోజు వారీ వేతనాల పెరుగుదల ఎక్కువగా ఉన్నట్టు అధ్యయనం తేల్చింది. గత ఏడాది కాలంగా ప్రపంచ వ్యాప్తంగా, మన దేశంలోనూ అన్ని వ్యవస్థలను అతలాకుతలం చేస్తోన్న కరోనా, మన రాష్ట్రంలోని గ్రామీణ ఆర్థిక వ్యవస్థపై ఏమాత్రం ప్రభావం చూపలేదని స్పష్టమవుతోందని ఆర్థిక నిఫుణులు పేర్కొంటున్నారు. వివిధ రంగాల్లోని కూలీలకు అధిక కూలి రేట్లు దక్కడానికి నిపుణులు చెబుతున్న కారణాలు ఇలా ఉన్నాయి.
రాష్ట్ర ప్రభుత్వం వివిధ సంక్షేమ కార్యక్రమాల ద్వారా దాదాపు రూ.1.25 లక్షల కోట్ల మొత్తాన్ని రైతులకు, మహిళలకు, పేదలకు నేరుగా నగదు రూపంలోనే అందజేసింది. ఇందులో అధిక మొత్తం గ్రామీణ లబ్ధిదారులకే చేరింది. ఫలితంగా గ్రామీణ ప్రాంతాల్లో పేదల కొనుగోలు శక్తిలో కరోనా సమయంలో పెద్దగా మార్పు చోటు చేసుకోలేదు. అందువల్ల గ్రామీణ ప్రాంతాల్లో పనులకు డిమాండ్ పెరిగిందే తప్ప తగ్గలేదు. వ్యవసాయ పనులు ముగిసిన తర్వాత కూడా గ్రామీణ ప్రాంతాల్లో పేదల జీవనోపాధికి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉండేందుకు సీఎం జగన్ ఎప్పటికప్పుడు సమీక్షలు నిర్వహిస్తూ వారి సొంత గ్రామాల్లోనే పెద్ద ఎత్తున పనులు కల్పించారు. ప్రభుత్వం రాష్ట్ర చరిత్రలోనే అత్యధికంగా గత ఏడాది 26.03 కోట్ల పనిదినాలు కల్పించింది.
రాష్ట్రంలో వ్యవసాయ రంగం పరిస్థితి సైతం గతంతో పోల్చుకుంటే గత రెండేళ్లగా బాగా మెరుగు పడింది. ఇలా ఎటు చూసినా ప్రజల జీవనోపాధిలో మెరుగైన వృద్ధి కనిపించడం ఏపీ సర్కారు గొప్పతనంగా చెప్పొచ్చు.