iDreamPost
android-app
ios-app

జగన్‌ ఆలోచన అద్భుతం.. అమలు జరిగితే జీవితాలే మారిపోతాయ్‌

జగన్‌ ఆలోచన అద్భుతం.. అమలు జరిగితే జీవితాలే మారిపోతాయ్‌

ఒకప్పుడు ఒక కుటుంబానికి కూడు, గుడ్డ, నీడ ఉంటే చాలు.. ఆ కుటుంబం అవసరాలు వంద శాతం తీరినట్లే. కానీ రోజులు మారాయి. ఇప్పుడు కూడు, గుడ్డ, నీడతోపాటు విద్య, వైద్యం కూడా ఉంటేనే కుటుంబ అవసరాలు పూర్తయినట్లు. విద్య, వైద్యం కూడా నాణ్యమైనదిగా ఉండాలి. లేదంటే అవి తీరనట్లే. అందుకే ప్రతి కుటుంబం తమ సంపాదనలో సగానికి పైగా విద్య, వైద్యం కోసం ఖర్చు చేస్తున్నాయి. మన దేశంలో విద్య, వైద్యం ప్రభుత్వంలో నాసిరకంగా, ప్రైవేటు రంగంలో నాణ్యంగా లభిస్తోంది. ప్రభుత్వ రంగ విద్య, వైద్య రంగాలను బలోపేతం చేయాలని, ప్రజలకు నాణ్యమైన విద్య, వైద్యం అందించాలనే దిశగా ఇప్పటి వరకు ప్రభుత్వాలు ఆలోచించిన దాఖలాలు లేవని కనిపిస్తూనే ఉన్నాయి.

విద్య, వైద్యం కోసం పెట్టే ఖర్చుతో పేద, మధ్యతరగతి కుటుంబాలు ఆర్థికంగా ఎదగలేకపోతున్నాయి. పిల్లల చదువుల కోసం తల్లిదండ్రులు ఇద్దరు సంపాధించినా చాలడం లేదు. 2007లో దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి ఫీజు రియంబర్స్‌మెంట్‌ ప్రవేశపెట్టక ముందు ఉన్నత విద్య పేద, మధ్యతరగతి వారికి అందని ద్రాక్ష లాంటిది. ఫీజు రియంబర్స్‌మెంట్‌ పథకం వచ్చిన తర్వాత ఆ పరిస్థితిలో మార్పు వచ్చింది. పిల్లలను ఇంటర్‌ వరకు చదివిస్తే.. చాలు ఆ తర్వాత ఉన్నత చదువుల బాధ్యత ప్రభుత్వమే తీసుకుంటుందనే భరోసా ప్రజలకు లభించింది. ఇంటర్‌ వరకు చదివించేందుకు తల్లిదండ్రులు లక్షల రూపాయలు ఖర్చు చేసేవారు. కొంత మంది ఆస్తులు కూడా అమ్ముకునేలా ప్రైవేటు, కార్పొరేట్‌ విద్యాసంస్థల్లో ఫీజులు ఉండేవి. ఇతరుల పిల్లల మాదిరిగానే తమ పిల్లలు కూడా బాగా చదువుకోవాలనే ఆశతో తల్లిదండ్రులు అప్పులు చేసేందుకు కూడా వెనుకాడేవారు కాదు.

Also Read : ఏపీలో మరో కొత్త పథకం

ఏళ్ల తరబడి ఉన్న ఈ పరిస్థితి ఇక మారుతుందా..?

విద్య, వైద్యం కోసం పేద, మధ్యతరగతి కుటుంబాల ఆర్థిక పరిస్థితి ఎక్కడవేసిన గొంగళి అక్కడే మాదిరిగా ఉండాల్సిందేనా..? ఈ పరిస్థితి మారదా..? అని ఏళ్ల తరబడి పేద, మధ్యతరగతి కుటుంబాలను వేధిస్తున్న ఈ ప్రశ్నలకు ఆంధ్రప్రదేశ్‌లో సమాధానం లభిస్తోంది. జగన్‌ సర్కార్‌ ప్రవేశపెట్టిన మన బడి నాడు–నేడు కార్యక్రమం ప్రభుత్వ పాఠశాలలను అత్యున్నత స్థాయికి తీసుకెళుతోంది. మూడు దశల్లో దాదాపు 43 వేల ప్రభుత్వ ప్రాథమిక, ఉన్నత, జూనియర్, డిగ్రీ కాలేజీలను సకల సౌకర్యాలతో తీర్చిదిద్దుతున్నారు. మొదటి దశలో దాదాపు 15 వేల విద్యా సంస్థల రూపుమారిపోయాయి. ప్రస్తుతం రెండో దశ నాడు నేడు పనులు జరుగుతున్నాయి. దీని ఫలితం స్పష్టంగా కనిపిస్తోంది. గడిచిన రెండేళ్లలో ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల చేరికలు భారీగా పెరిగాయి. ప్రభుత్వం అమలు చేస్తున్న అమ్మ ఒడి, జగనన్న గోరు ముద్ద పథకం, జగనన్న విద్యా కిట్‌ పథకాలు పేద, మధ్యతరగతి కుటుంబాల పిల్లలను ప్రభుత్వ పాఠశాలల వైపు నడిపిస్తున్నాయి. ఫలితంగా ప్రతి ఏడాది ఫీజుల కోసం వేలాది రూపాయలు ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి తల్లిదండ్రులకు తప్పింది.

నాడు నేడు ద్వారా ఉన్నత పాఠశాల వరకు ఇబ్బంది లేదు. ఇంటర్‌ తర్వాత ఉన్నత విద్యకు ప్రభుత్వం బాధత్య తీసుకుంది. కాలేజీ ఫీజుల కోసం జగనన్న విద్యా దీవెన, హాస్టల్‌ ఖర్చుల కోసం జగనన్న వసతి దీవెన పథకాలు జగన్‌సర్కార్‌ అమలు చేస్తోంది. ఇక మిగిలి ఉంది ఇంటర్‌ విద్య. ప్రతి విద్యార్థి జీవితంలో ఇంటర్‌ విద్య అత్యంత ముఖ్యమైనది. అందుకే తల్లిండ్రులు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు. ఇంటర్‌ విద్య రెండేళ్ల కోసం దాదాపు లక్ష నుంచి రెండు లక్షల రూపాయలు ఖర్చు చేయాల్సిన పరిస్థితిని కూడా తప్పించేందుకు జగన్‌ సర్కార్‌ విప్లవాత్మకమైన నిర్ణయం తీసుకుంది. ప్రతి మండలంలో రెండు ప్రభుత్వ జూనియర్‌ కాలేజీలు ఏర్పాటు చేసేందుకు ప్రణాళికలు రచించింది. మండలానికి రెండు జూనియర్‌ కాలేజీలు ఉండాలంటే.. కొత్తగా ఏపీలో 200 జూనియర్‌ కాలేజీలు ఏర్పాటు చేయాల్సి ఉంది. అందుకోసం ప్రతిపాదనలు సిద్ధం చేసినట్లు విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌ ప్రకటించారు. ఆ ప్రతిపాదనలు ఆచరణలోకి వస్తే.. ఏపీలో 1వ తరగతి నుంచి పీజీ వరకు ప్రభుత్వ రంగంలో నాణ్యమైన విద్య లభిస్తుంది. ఫలితంగా ఖర్చులేని నాణ్యమైన విద్య లభించడం వల్ల పేద, మధ్య తరగతి కుటుంబాల సంపాదన వారికే మిగులుతుంది. ఆర్థికంగా వారు ఎదగడం ఖాయంగా జరుగుతుంది. సమాజంలో పేదరికం దూరమవుతుంది.

Also Read : సచివాలయ వ్యవస్థ మరింత పటిష్టం.. జగన్ కీలక ఆదేశాలు