iDreamPost
android-app
ios-app

థ‌ర్ట్ వేవ్ : ఏపీ స‌ర్కార్ ముందు చూపు భేష్‌

థ‌ర్ట్ వేవ్ : ఏపీ స‌ర్కార్ ముందు చూపు భేష్‌

క‌రోనా క‌ట్ట‌డి, వ్యాక్సినేష‌న్ లో ఆంధ్ర‌ప్ర‌దేశ్ దేశంలోని మిగ‌తా రాష్ట్రాల కంటే మెరుగైన ప‌నితీరు క‌న‌బ‌రిచింది. ఈ విష‌యం దేశం మొత్తం గుర్తించింది. రెండో ద‌శ‌లో క‌రోనా కేసుల సంఖ్య గ‌ణనీయంగా త‌గ్గిన‌ప్ప‌టికీ.. ముందు చూపుతో కొన్ని ప్రాంతాల్లో రాత్రి క‌ర్ఫ్యూ ఇప్ప‌టికీ కొన‌సాగిస్తోంది. అవ‌స‌రాన్ని బ‌ట్టి త‌గిన చ‌ర్య‌లు తీసుకుంటోంది. ఇదిలా ఉండ‌గానే, థర్డ్‌వేవ్ త‌ప్ప‌ద‌ని ప‌లు అధ్య‌య‌నాలు తెలియ‌జేస్తున్నాయి. డ‌బ్ల్యూ హెచ్ఓ ప్ర‌తినిధులు కూడా అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని హెచ్చ‌రిస్తున్నారు. ఈ సూచ‌న‌లు, హెచ్చ‌రిక‌లు ఎలాగున్నా, ముందస్తు చ‌ర్య‌లు చేప‌ట్ట‌డంలో ఏపీ ప్ర‌భుత్వం మిగతా రాష్ట్రాల కంటే ముందంజలో ఉంది.

ఒక వేళ థర్డ్‌ వేవ్‌లో కూడా కరోనా విజృంబిస్తే ఎదుర్కొనేందుకు ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం చేపట్టిన చర్యలు ముమ్మరంగా సాగుతున్నాయి. ఆక్సిజన్‌ పడకలకు ఎలాంటి కొరత తలెత్తకుండా ఉండేందుకు వీలుగా అధికారులు అటు ప్రైవేట్, ఇటు ప్రభుత్వాస్పత్రుల్లో వాటి సంఖ్యను గణనీయంగా పెంచుతున్నారు. ఇందులో భాగంగా.. గడిచిన రెండు నెలలుగా సాధారణ పడకలకు మూడు రెట్లు ఎక్కువగా ఆక్సిజన్‌ పడకలు ఏర్పాటుచేస్తున్నారు. అదే సమయంలో ఐసీయూ పడకలను పెంచేందుకూ చర్యలు తీసుకుంటున్నారు. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రుల్లో 25,198 ఆక్సిజన్‌ పడకలున్నాయి. వీటిని 37,136కు పెంచనున్నారు. థర్డ్‌ వేవ్‌ సన్నాహాల్లో భాగంగా సాధారణ పడకల్లో ఎక్కువ భాగం ఆక్సిజన్‌ పడకలుగా మారుస్తున్నారు.

విశాఖపట్నం లాంటి పెద్ద నగరాల్లో భారీగా ఏర్పాట్లు చేస్తున్నారు. వేలాది సాధారణ పడకల నుంచి ఆక్సిజన్‌ పడకలుగా మార్చనున్నారు. అలాగే, రాష్ట్రంలో ప్రస్తుతం ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రుల్లో చిన్న పిల్ల‌ల వైద్యుల సంఖ్య‌ను పెంచుతున్నారు. ఇప్ప‌డు ఉన్న వారికి అద‌నంగా పీడియాట్రిక్‌ వైద్యులను కోవిడ్‌ సేవలకు వినియోగించుకునేందుకు ప్ర‌ణాళిక‌లు ర‌చించారు. ఇప్ప‌టికే వంద‌లాది మందిని కొత్త‌గా నియ‌మించారు. ఇక స్టాఫ్‌ నర్సులు, సహాయక సిబ్బందిని కూడా అద‌నంగా నియ‌మిస్తున్నారు. దీంతో బాధితులకు మెరుగైన సేవలందించే అవకాశం ఉంటుంది. థర్డ్‌వేవ్‌కు ముందస్తు చర్యల్లో భాగంగా ఆక్సిజన్‌ ప్లాంట్లు, పడకల ఏర్పాటు పనులు ముమ్మరంగా సాగుతుండ‌డం ప్ర‌భుత్వ ముందుచూపున‌కు నిద‌ర్శ‌నంగా నిలుస్తోంది. ఏర్పాట్లలో మిగతా రాష్ట్రాలతో పోలిస్తే ఏపీ ముందంజలో ఉండ‌డం అభినంద‌నీయ‌మ‌ని ప‌రిశీల‌కులు భావిస్తున్నారు.