iDreamPost
iDreamPost
ఆంధ్రప్రదేశ్ కి చెందిన 22 మంది మత్స్యకారులు పాకిస్తాన్ చెరలో చిక్కి సుమారు 14 నెలల పాటు కఠిన కారాగార శిక్ష అనుభవించాల్సి వచ్చింది. దేశం కానీ దేశంలో వారంతా జైళ్లలో మగ్గాల్సి వచ్చిన దుస్థితి గురించి ఆలోచించే తీరిక చాలామంది నేతలకు కనిపించ లేదు. సుదీర్ఘకాలంగా ఈ సమస్య ఉంది. శ్రీకాకుళం జిల్లాకు చెందిన పలువురు మత్స్యకారులు పాకిస్తాన్ జైళ్లలోనే ప్రాణాలు కోల్పోయిన ఘటనలున్నాయి. అది కూడా ఏపీ టీడీపీ అధ్యక్షుడిగా ఉన్న కిమిడి కళా వెంకట్రావు సొంత నియోజకవర్గానికి చెందిన వారే పెద్ద సంఖ్యలో ఉండడం గమనార్హం.
బంగాళాఖాతం తీరంలో విస్తృతమైన అవకాశాలున్నాయి. అయినా మన రాష్ట్రానికి చెందిన
మత్స్యకారులు అరేబియా సముద్రంలో వేట కోసం వలసలు వెళ్లాల్సి రావడమే ఈ దుస్థితికి కారణం. ఉత్తరాంధ్ర కూలీలు మహానగరాల్లో మట్టి పనులకే కాకుండా, అక్కడి జాలర్లు తమ జీవనోపాధి కోసం గుజరాత్ వంటి రాష్ట్రాలకు వలసలు పోవాల్సిన దౌర్భాగ్యం కొనసాగడమే అందుకు కారణం. అయితే తమ పల్లెలను ఆనుకుని సముద్రం ఉన్నప్పటికీ వేట కోసం వెయ్యి కిలోమీటర్ల దూరం వెళ్లాల్సి రావడం, సముద్రంలో సరిహద్దులు గుర్తించే అవగాహన లేక చివరకు పాకిస్తాన్ చెరబడడం వంటి పరిణామాలు నిత్యకృత్యం అవుతున్న తరుణంలో జగన్ ఈ సమస్యకు పరిష్కారం వెదికే పనిలో పడ్డారు.
ఎన్నో ఏళ్లుగా విస్మరించిన మత్స్యకారుల సమస్యల పరిష్కారానికి జగన్ చొరవ చూపడంతో ఇప్పుడు కొత్త వెలుగులు ఖాయమనే అభిప్రాయం వినిపిస్తోంది. ఉత్తరాంధ్ర మత్స్యకారులు ఇతర ప్రాంతాలకు వలసలు వెళ్లాల్సిన అవసరం ఎందుకు వచ్చిందంటే అందరూ చెప్పే సమాధానం తాము వేటాడుకునే అవకాశాలు లేకపోవడం అని. హార్బర్లు కాదు కదా..కనీసం జెట్టీలు కూడా నిర్మించిన దాఖలాలే లేవు. విశాఖపట్నం తర్వాత మళ్లీ ఒడిశాలోని పారాదీప్ వరకూ ఒక్క హార్బర్ కూడా లేదు. మధ్యలో కళింగపట్నం సహా పలు ప్రాంతాల్లో జెట్టీల నిర్మాణానికి అన్ని రకాలుగానూ అవకాశాలున్నా ప్రభుత్వాలు విస్మరించాయి. ఫలితంగా వేట కోసం మత్స్యకారులు వలసలు వెళుతున్నారని చెప్పవచ్చు.
ఇప్పుడు జగన్ ప్రభుత్వం ఈ సమస్యపై దృష్టి సారించింది. మత్స్యకారుల వలసలు నివారించి, స్థానికంగా ఉపాధి కల్పించే అవకాశాల వైపు అడుగులు వేస్తోంది. కొత్త జెట్టీల నిర్మాణాలకు పూనుకుంటోంది. త్వరలోనే అన్నింటినీ పరిశీలించి జెట్టీల నిర్మాణానికి చర్యలు తీసుకుంటామని తాజాగా సీఎం ప్రకటించారు. పాకిస్తాన్ నుంచి వచ్చిన మత్స్యకారులతో ఆయన మాట్లాడుతూ శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల పరిధిలో వీలయిన చోట్ల జెట్టీల నిర్మాణాలకు నిధులు కేటాయిస్తామని హామీ ఇచ్చారు. దాంతో వారంతా సంతృప్తి వ్యక్తం చేశారు. ఉత్తరాంద్ర మత్స్యకారుల జీవితాల్లో ఈ జెట్టీల నిర్మాణం నూతన ఆశలు రేకెత్తిస్తోంది. తమ చుట్టూ సముద్రం ఉన్నప్పటికీ తాము ఎక్కడికో పోవాల్సిన అవసరం లేకుండా జెట్టీల నిర్మాణం, దానికి అనుబంధంగా ఇతర సమస్యలు పరిష్కరిస్తే ఎంతో ప్రయోజనం దక్కుతుందనే ఆశావాహ దృక్పథం కనిపిస్తోంది. మరి జగన్ సర్కారు తీసుకోబోయే ఈ చర్యలు ఉత్తరాంధ్ర భవిష్యత్ ని మార్చే అవకాశం ఉంటుందనే అంచనాలున్నాయి. ఎప్పటికీ ఆచరణ రూపం దాలుస్తాయో చూడాలి