iDreamPost
android-app
ios-app

AP Govt, Lance Naik Sai Teja – అమర జవాను కుటుంబానికి తక్షణ సహాయం.. చెక్‌ అందించిన పెద్దిరెడ్డి

AP Govt, Lance Naik Sai Teja – అమర జవాను కుటుంబానికి తక్షణ సహాయం.. చెక్‌ అందించిన పెద్దిరెడ్డి

తమిళనాడులోని ఊటిలో జరిగిన ఆర్మీ హెలికాప్టర్‌ ప్రమాదంలో మృతి చెందిన లాన్స్‌ నాయక్‌ సాయితేజ కుటుంబానికి 50 లక్షల రూపాయల ఆర్థిక సహాయం ఈ రోజు మధ్యాహ్నం ప్రకటించిన జగన్‌ సర్కార్‌.. వెంటనే ఆ మొత్తాన్ని అందించింది. 50 లక్షల రూపాయల చెక్‌ను డిప్యూటీ సీఎం నారాయణ స్వామి, మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, తంబల్లపల్లి ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారకానాథ్‌ రెడ్డిలు వెళ్లి ఇచ్చారు. ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుందని పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సాయితేజ సతీమణి శ్యామలకు ధైర్యం చెప్పారు. శ్యామలను తన బిడ్డలా చూసుకుంటానని ఎమ్మెల్యే ద్వారకానాథ్‌ రెడ్డి భరోసా ఇచ్చారు.

ఈ నెల 8వ తేదీన ఊటి కొండల్లో కున్నూరు వద్ద త్రివిధ దళాల అధిపతి బిపిన్‌ రావత్‌ దంపతులు, ఇతర అధికారులు ప్రయాణిస్తున్న హెలికాప్టర్‌ కుప్పకూలింది. ఈ ప్రమాదంలో బిపిన్‌ రావత్‌ దంపతులతో సహా 13 మంది మరణించారు. గ్రూప్‌ కెప్టెన్‌ వరుణ్‌ సింగ్‌ ఒక్కరే ప్రాణాలతో బయటపడ్డారు. తీవ్ర గాయాలైన ఆయనకు చికిత్స కొనసాగుతోంది.

చిత్తూరు జిల్లా మదనపల్లి మండలం ఎగువరేగడి పల్లి గ్రామానికి చెందిన సాయితేజ.. బిపిన్‌ రావత్‌ వ్యక్తిగత భద్రతా సిబ్బందిగా పని చేస్తున్నారు. 9 ఏళ్ల క్రితం ఆర్మీలో జవానుగా చేరిన సాయితేజ.. అంచెలంచెలుగా ఎదుగుతూ.. లాన్స్‌ నాయక్‌ స్థాయికి ఎదిగారు. భారత త్రివిధ దళాల అధిపతి బిపిన్‌రావత్‌కు భద్రత కల్పిస్తున్నారు.

హెలికాప్టర్‌ కుప్పకూలి, మంటలు చెలరేగడంతో మృతదేహాలు గుర్తుపట్టలేని పరిస్థితి నెలకొంది. డీఎన్‌ఏ పరీక్షల ద్వారా సాయితేజ భౌతికకాయాన్ని ఈ రోజు గుర్తించారు. భౌతికకాయాన్ని ఢిల్లీ నుంచి బెంగుళూరుకు తీసుకువచ్చారు. అక్కడ నుంచి రోడ్డు మార్గాన ఎగువరేగడి పల్లికి చేర్చారు. రేపు ఉదయం అంత్యక్రియలు నిర్వహించనున్నారు.

Also Read : వీర జవాను కుటుంబానికి జగన్‌ సర్కార్‌ ఆర్థిక సహాయం