Idream media
Idream media
తమిళనాడులోని ఊటిలో జరిగిన ఆర్మీ హెలికాప్టర్ ప్రమాదంలో మృతి చెందిన లాన్స్ నాయక్ సాయితేజ కుటుంబానికి ఆంధ్రప్రదేశ్ సర్కార్ ఆర్థిక సహాయం ప్రకటించింది. సాయితేజ కుటుంబానికి 50 లక్షల రూపాయలు ఇవ్వాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నిర్ణయించారు. ఈ విషయాన్ని ముఖ్యమంత్రి కార్యాలయం ట్విట్టర్ ద్వారా వెల్లడించింది.
ఈ నెల 8వ తేదీన ఊటి కొండల్లో కున్నూరు వద్ద త్రివిధ దళాల అధిపతి బిపిన్ రావత్ దంపతులు, ఇతర అధికారులు ప్రయాణిస్తున్న హెలికాప్టర్ కుప్పకూలింది. ఈ ప్రమాదంలో బిపిన్ రావత్ దంపతులతో సహా 13 మంది మరణించారు. గ్రూప్ కెప్టెన్ వరుణ్ సింగ్ ఒక్కరే ప్రాణాలతో బయటపడ్డారు. తీవ్ర గాయాలైన ఆయనకు చికిత్స కొనసాగుతోంది.
చిత్తూరు జిల్లా మదనపల్లి మండలం ఎగువరేగడి పల్లి గ్రామానికి చెందిన సాయితేజ.. బిపిన్ రావత్ వ్యక్తిగత భద్రతా సిబ్బందిగా పని చేస్తున్నారు. 9 ఏళ్ల క్రితం ఆర్మీలో జవానుగా చేరిన సాయితేజ.. అంచెలంచెలుగా ఎదుగుతూ.. లాన్స్ నాయక్ స్థాయికి ఎదిగారు. భారత త్రివిధ దళాల అధిపతి బిపిన్‌రావత్‌కు భద్రత కల్పిస్తున్నారు.
హెలికాప్టర్ కుప్పకూలి, మంటలు చెలరేగడంతో మృతదేహాలు గుర్తుపట్టలేని పరిస్థితి నెలకొంది. డీఎన్‌ఏ పరీక్షల ద్వారా సాయితేజ భౌతికకాయాన్ని ఈ రోజు గుర్తించారు. ఈ రోజు వీర జవాను భౌతికకాయం స్వగ్రామం ఎగువు రేగడిపల్లికి చేరనుంది. రేపు అంత్యక్రియలు నిర్వహించనున్నారు.
కాగా, దేశ రక్షణలో భాగస్వాములైన జవాన్లు దురదృష్టవశాత్తూ ప్రాణాలు కోల్పోతే.. వారి కుటుంబానికి అండగా ఉండే సాంప్రదాయాన్ని ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి సర్కార్ వచ్చిన తర్వాత మొదలు పెట్టింది. వీర జవాన్ల కుటుంబాలకు ఆర్థికంగా అండగా ఉంటోంది. ఈ మేరకు గతంలో దేశ రక్షణలో వీరమరణం పొందిన చిత్తూరు జిల్లాకు చెందిన ప్రవీణ్‌కుమార్ రెడ్డి, గుంటూరు జిల్లా బాపట్లకు చెందిన జస్వంత్ రెడ్డిల కుటుంబాలకు 50 లక్షల చొప్పన ఆర్థిక సహాయం అందజేసింది. ఈ విధానాన్ని కొనసాగిస్తూ.. సాయితేజ కుటుంబానికి కూడా జగన్ సర్కార్ 50 లక్షల రూపాయల ఆర్థిక సహాయం ప్రకటించింది.
Also Read : ప్రభుత్వం చేయాల్సింది చేస్తుంది బాబూ.. జవాన్ కుటుంబానికి మీరేమిస్తున్నారు..?