iDreamPost
android-app
ios-app

క్వారంటైన్‌లో 29,115 మంది.. జగన్‌ సర్కార్‌ కీలక నిర్ణయం

క్వారంటైన్‌లో 29,115 మంది.. జగన్‌ సర్కార్‌ కీలక నిర్ణయం

ఏపీలో విదేశాల నుంచి వచ్చిన వారి సంఖ్య రోజు రోజుకి పెరుగుతోంది. గ్రామ, వార్డు వాలంటీర్లు ఎప్పటికప్పుడు విదేశాల నుంచి వచ్చిన వారిని గుర్తిస్తున్నారు. ఇప్పటికే రెండు సర్వేల ద్వారా వారిని గుర్తించారు. ఫీవర్‌ సర్వే ద్వారా గుర్తించిన విదేశఋయులను క్వారంటైన్‌లో ఉంచారు. మరోసారి వాలంటీర్లతో ఇంటింటి సర్వే చేశారు. ఈ నేపథ్యంలో తాజాగా విదేశాల నుంచి వచ్చిన వారి సంఖ్య 29,115కి చేరుకుంది.

విదేశాల నుంచి వచ్చిన వారిని గుర్తించేందుకు జగన్‌ సర్కార్‌ మరో నిర్ణయం తీసుకుంది. వాలంటీర్ల ద్వారా మరోసారి ఇంటింటి సర్వే చేయించాలని సంకల్పించింది. తద్వారా ఇంకా ఎవరైనా ఉన్నా, స్థానికంగా ఉంటున్న వారిలో ఎవరికైనా వైరస్‌ లక్షణాలు ఉన్నా గుర్తించాలని నిర్ణయించారు. గ్రామ, వార్డు వాలంటీర్లు ఇంటింటికి వెళ్లి క్షుణ్నంగా తనిఖీ చేయనున్నారు.

క్వారంటైన్‌లో ఉన్న వారిపై పూర్తి స్థాయిలో పర్యవేక్షణ కోసం సీఎం జగన్‌ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. ప్రతి పది మందికి ఒక డాక్టర్‌ను నియమించాలని ఆదేశించారు. ఆయా డాక్టర్లు, జిల్లా కేంద్రాల్లో ఉన్న ప్రత్యేక వైద్యులతో తరచూ వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించనున్నారు. తద్వారా క్వారంటైన్‌లో ఉన్న వారి ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు తెలుసుకుని, అవసరమైన చికిత్స ఇచ్చేందుకు వీలుంటుందని ప్రభుత్వం భావిస్తోంది.

ప్రస్తుతం దేశంలో 938 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయని కేంద్ర ఆరోగ్యశాఖ హెల్త్‌ బులిటెన్‌ విడుదల చేసింది. ఏపీలో 13 కేసులు నమోదయ్యాయని ఏపీ మంత్రి ఆళ్ల నాని తెలిపారు. రూరల్‌ ప్రాంతాలలో కన్నా అర్బన్‌ ప్రాంతాలలో పాజిటివ్‌ కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయని ప్రభుత్వం అంచనా వేసింది. ఏపీలో 12 కేసులు అర్బన్‌ ప్రాంతాల్లో నమోదవగా, రూరల్‌ ప్రాంతాల్లో ఒక కేసు నమోదవడాన్ని ప్రభుత్వం ఉదహరిస్తోంది. ఈ నేపథ్యంలో అర్బన్‌ ప్రాంతాల్లో మరింత కట్టుదిట్టంగా నివారణ చర్యలు తీసుకునేందుకు ఏపీ సర్కార్‌ సిద్దమైంది.