పదవుల పండగ.. నేడు బీసీ కార్పొరేషన్ల పాలక మండళ్ల ప్రకటన

ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా 56 బీసీ కార్పొరేషన్లు. అన్నింటికి ఒకే సారి పాలక మండళ్ల ప్రకటన. తెలుగు రాజకీయ చరిత్రలో బీసీలకు ఆర్థికంగా దన్నుగా నిలిచేలా కులాల వారీగా కార్పొరేషన్లు ఏర్పాటు చేయడంతోపాటు.. వారికి రాజకీయంగా పెద్దపీట వేయడం ఇదే తొలిసారి. ఎలాంటి ప్రచార ఆర్భాటం, హడావుడి, ఓట్ల లక్ష్యం లేకుండా జగన్‌ సర్కార్‌ బీసీ కార్పొరేషన్లు చైర్మన్లు, వైస్‌ చైర్మన్లు, డైరెక్టర్‌ పదవులను ఈ రోజు ప్రకటించబోతోంది.

మొత్తం 56 బీసీ కార్పొరేషన్లకు పాలక మండళ్లను ప్రకటించబోతున్నారు. ఇందులో 50 శాతం పదవులు మహిళలతో భర్తీ చేయనున్నారు. 56 చైర్మన్‌ పోస్టుల్లో 29 మహిళలకు, 27 పురుషులకు కేటాయించనున్నారు. డైరెక్టర్‌ పదవుల్లోనూ సగం మహిళలతో భర్తీ చేయనున్నారు. ఆయా జిల్లాల్లో అధిక జనాభా ఉండే బీసీ కులాల వారికి ఆయా కార్పొరేషన్ల చైర్మన్‌ పదవి దక్కే అవకాశం ఉంది. అంతేకాకుండా చైర్మన్, డైరెక్టర్‌పదవుల్లో ప్రతి జిల్లాకు సమ ప్రాధాన్యం కల్పించనున్నారు. ప్రతి జిల్లాలకు కనిష్టంగా నాలుగు, గరీష్టంగా ఆరు చైర్మన్‌ పదవులు లభించే అవకాశం ఉంది. శ్రీకాకుళం జిల్లాకు ఆరు, కృష్ణా, విశాఖ జిల్లాలకు ఐదు చొప్పన, మిగతా అన్ని జిల్లాలకు నాలుగు చొప్పున చైర్మన్‌ పదవులు కేటాయించే అకాశం ఉంది.

అన్ని జిల్లాలకు, బీసీల్లోని అన్ని కులాల వారికి కార్పొరేషన్‌ పదవుల్లో రాజకీయ ప్రాధాన్యం దక్కేలా వైసీపీ సమగ్ర కసరత్తు చేసింది. ఆ పార్టీ ముఖ్య నేతలు, జిల్లాల ఇంఛార్జిలైన సజ్జల రామకృష్ణారెడ్డి, విజయసాయి రెడ్డి, వైవీ సుబ్బారెడ్డి, మోపీదేవి వెంకట రమణ, వేమిరెడ్డి ప్రభాకర్‌ రెడ్డిలు పదవులకు నేతల ఎంపిక బాధ్యతలను నిర్వర్తించారు. మరి కొద్ది గంటల్లో ప్రకటించబోతున్న పదవులు ఎవరికి దక్కబోతున్నాయన్న ఆసక్తి ఏపీలో నెలకొంది.

Show comments