Idream media
Idream media
రాష్ట్రంలోని అన్నివర్గాల అభివృద్ధే లక్ష్యంగా పాలన సాగిస్తున్నామని ఆంధ్రప్రదేశ్ గవర్నర్ బిశ్వభూషన్ హరిచందన్ పేర్కొన్నారు. 73వ గణతంత్ర వేడుకలు బుధవారం విజయవాడలోని ఇందిరా ప్రియదర్శిని స్టేడియంలో జరిగాయి. జాతీయ జెండాను గవర్నర్ బిశ్వభూషన్ హరిచందన్ ఎగురవేశారు. అంతకు ముందు సాయుధ దళాల నుంచి గౌరవ వందనం స్వీకరించిన తర్వాత గవర్నర్ ప్రసంగించారు. 32 నెలలుగా సాగిన పాలన గురించి గవర్నర్ వివరించారు.
‘‘మేనిఫెస్టోలో పెట్టిన హామీల్లో 95 శాతం అమలు చేశాం. నవరత్నాల ద్వారా అర్హత ఉన్న ప్రతి ఒక్కరికీ మేలు చేస్తున్నాం. రైతుల సంక్షేమం కోసం పనిచేస్తున్నాం. రైతు భరోసా కేంద్రాల ద్వారా అన్నిరకాల సాయం అందిస్తున్నాం. పెట్టుబడికోసం వైఎస్సార్ రైతు భరోసా పథకం పేరుతో ప్రతి ఏడాది 13,500 రూపాయలు అందిస్తున్నాం. వ్యవసాయరంగంలో దేశంలోనే అగ్రగామిగా నిలిచాం. అమూల్ పాలవెల్లువ ద్వారా పాడి రైతులకు అధిక ఆదాయం వచ్చేలా కార్యక్రమం రూపొందించాం. ప్రతి పేదవాడి సొంత ఇంటి కలను నెరవేర్చాం. మత్స్యకారుల సంక్షేమం కోసం పెద్దపీట వేశాం. కొత్తగా ఆరు ఫిషింగ్ హార్బర్లను నిర్మిస్తున్నాం.
విద్యకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నాం. ఇప్పటి వరకు 34 వేల కోట్లరూపాయలు వివిధ విద్యా పథకాలకు వెచ్చించాం. డాక్టర్ వైఎస్సార్ ఆరోగ్యశ్రీ ద్వారా రాష్ట్రంలోని 95 శాతం కుటుంబాలకు మేలు జరిగేలా మార్పులు చేశాం. కరోనా మొదటి, రెండో వేవ్‌లను సమర్థంగా ఎదుర్కొన్నాం. వైఎస్సార్ కాపు నేస్తం పథకం ద్వారా కాపు సామాజికవర్గంలోని 45–60 ఏళ్ల మధ్య వయసు గల మహిళలకు, వైఎస్సార్ ఈబీసీ నేస్తం పథకం ద్వారా అగ్రవర్ణాల్లోని పేద మహిళలకు, వైఎస్సార్ చేయూత పథకం ద్వారా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీల్లోని మహిళలకు ఆర్థికసాయం చేస్తున్నాం. వైఎస్సార్ పెన్షన్ కానుక ద్వారా పింఛన్ నగదును 2500 రూపాయలకు పెంచి ప్రతినెలా అందిస్తున్నాం. ఇప్పటి వరకు 45 వేల కోట్ల రూపాయలను పింఛన్ పథకం కోసం వెచ్చించాం. ప్రతి నెలా దాదాపు 62 లక్షల మందికి పింఛన్ అందిస్తున్నాం.
ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌లో అగ్రస్థానంలో ఉన్నాం. సూక్ష్మ, మధ్య తరహా పరిశ్రమలకు సకాలంలో రాయితీలు అందిస్తూ అండగా ఉన్నాం. కొప్పర్తి ఇండస్ట్రియల్ పార్క్‌ను ఏర్పాటు చేశాం. 30.73 లక్షల ఇళ్ల స్థలాలను పేద మహిళలకు అందించాం. 28 లక్షల ఇళ్లను ప్రభుత్వం నిర్మించి ఇవ్వబోతోందని” గవర్నర్ బిశ్వభూషన్ హరిచందన్ పేర్కొన్నారు.