iDreamPost
android-app
ios-app

Three Capitals Bill – మూడు రాజధానులపై ఏపీ సర్కార్‌ సంచలన నిర్ణయం

Three Capitals Bill – మూడు రాజధానులపై ఏపీ సర్కార్‌ సంచలన నిర్ణయం

మూడు రాజధానులపై ఆంధ్రప్రదేశ్‌ సర్కార్‌ సంచలన నిర్ణయం తీసుకుంది. మూడు రాజధానుల బిల్లును వెనక్కి తీసుకోవాలని నిర్ణయించింది. ఈ మేరకు కొద్దిసేపటి క్రితం కేబినెట్‌ అత్యవసరంగా సమావేశమైంది. మూడు రాజధానుల బిల్లును వెనక్కి తీసుకోవాలని కేబినెట్‌ నిర్ణయించింది. ఈ నిర్ణయం అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. సీఎం వైఎస్‌ జగన్‌.. ఈ విషయాన్ని కాసేపట్లో అసెంబ్లీలో ప్రకటించబోతున్నారు.

అయితే ఏపీ హైకోర్టుకు ఈ విషయాన్ని ప్రభుత్వం అధికారికంగా తెలియజేసింది. ఏపీ అడ్వకేట్‌ జనరల్‌ (ఏజీ) సుబ్రమణ్యం శ్రీరామ్‌ ఈ విషయాన్ని ఏపీ హైకోర్టుకు తెలియజేశారు. ఈ విషయంపై హైకోర్టు స్పష్టత కోరింది. బిల్లు ఉపసంహరించుకునే అంశాన్ని పూర్తి స్పష్టతతో చెప్పాలని ఏజీని కోరింది. అసెంబ్లీ సమావేశం విరామంలో మంత్రిమండలి సమావేశం జరుగుతోందని, మరో అరగంటలో ప్రభుత్వం స్పష్టత ఇస్తుందని ఏజీ తెలిపారు. మూడు రాజధానుల బిల్లును ఉపసంహరించుకుంటుందని స్పష్టం చేసిన ఏజీ.. తదుపరి రాజధాని బిల్లు ఎలా ఉంటుందో తదుపరి కేబినెట్‌ సమావేశాల్లో నిర్ణయిస్తారని కోర్టుకు తెలిపారు. బిల్లు ఉపసంహరించుకోవడంతో ఇక ఈ అంశంపై విచారణ అవసరం లేదని మధ్యాహ్నం 2:15 గంటలకు ఏజీ మెమో దాఖలు చేయబోతున్నారు.

ఏపీ హైకోర్టులో సీఆర్‌డీఏ రద్దు, అభివృద్ధి వికేంద్రీకరణ బిల్లులను వ్యతిరేకిస్తూ.. అమరావతిలోని కొందరు రైతులు, టీడీపీ నేతలు వేసిన పిటిషన్లపై వారం రోజుల నుంచి రోజు వారీ విచారణ జరుగుతోంది. ఈ నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం అత్యవసరంగా కేబినెట్‌ సమావేశం నిర్వహించడం, మూడు రాజధానుల బిల్లును వెనక్కి తీసుకోవాలని నిర్ణయం తీసుకోవడం చకచకా జరిగిపోయింది.

మూడు రాజధానులపై కేబినెట్‌ ఎలాంటి నిర్ణయం తీసుకుంది, సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి అసెంబ్లీలో ఎలాంటి ప్రకటన చేయబోతున్నారనేది ఇప్పుడు అత్యంత ఆసక్తికరమైన అంశం. సీఎం వైఎస్‌ జగన్‌ ప్రకటన చేయబోతున్నారని మంత్రి కొడాలి నాని కూడా ప్రకటించారు.

కాగా, మూడు రాజధానుల బిల్లును పూర్తిగా వెనక్కి తీసుకుని, కొత్త బిల్లు ప్రవేశపెట్టబోతున్నారనే చర్చ కొనసాగుతోంది.

మూడు రాజధానుల ఆలోచన సాగిందిలా..

2019 డిసెంబర్‌ 17వ తేదీన మూడు రాజధానుల ఏర్పాటు అంశంపై సీఎం వైఎస్‌ జగన్‌ అసెంబ్లీలో ప్రకటన చేశారు. రాష్ట్రంలోని మూడు ప్రాంతాల సమగ్రాభివృద్ధికి మూడు రాజధానులు ఏర్పాటు చేయబోతున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు డిసెంబర్‌ 19వ తేదీన జీఎన్‌రావు నేతృత్వంలో ఓ కమిటీని ఏపీ సర్కార్‌ ఏర్పాటు చేసింది. ఆ కమిటీ ఇచ్చిన నివేదికపై చర్చించి, సరైన నిర్ణయం తీసుకునే విధంగా ప్రభుత్వానికి సూచనలు అందించేందుకు మంత్రుల నేతృత్వంలో హైపవర్‌ కమిటీని ఏర్పాటు చేశారు.

హైపవర్‌ కమిటీ ఇచ్చిన సూచన ప్రకారం.. కోస్తా ప్రాంతంలోని అమరావతిని శాసన రాజధానిగా కొనసాగిస్తూ, రాయలసీమలోని కర్నూలులో న్యాయరాజధాని, ఉత్తరాంధ్రలోని విశాఖలో కార్యనిర్వాహక రాజధానిని ఏర్పాటు చేయబోతున్నట్లు జగన్‌ సర్కార్‌ ప్రకటించింది. సీఆర్‌డీఏ రద్దు, అభివృద్ధి వికేంద్రీకరణ బిల్లులను అసెంబ్లీ, మండలిలో ప్రవేశపెట్టి ఆమోదించింది. అయితే ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ.. ఏపీ హైకోర్టులో పలు పిటిషన్లు దాఖలయ్యాయి.  సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఏపీ హైకోర్టు ఈ పిటిషన్లపై రోజువారీ విచారణ జరుపుతోంది. ఈ క్రమంలోనే మూడు రాజధానుల బిల్లును వెనక్కి తీసుకుంటున్నట్లు జగన్‌ సర్కార్‌ నిర్ణయించడం గమనార్హం.

Also Read : Amaravati Yatra 3 Capitals -మూడు రాజధానులు- రెండు రాజధానులు- ఒక్కటే బీజేపీ