Idream media
Idream media
ఆంధ్రప్రదేశ్‌లో మరోసారి ప్రభుత్వ ఉద్యోగాల జాతరకు రంగం సిద్ధమవుతోంది. భర్తీ చేసే ప్రభుత్వ ఉద్యోగాల సమాచారంతో క్యాలెండర్ సిద్ధం చేయాలని, ఉగాదికి దాన్ని విడుదల చేయాలని సీఎం వైఎస్ జగన్ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ప్రభుత్వ ఉద్యోగాల భర్తీపై ఈ రోజు అధికారులతో సమీక్ష నిర్వహించిన సీఎం వైఎస్ జగన్ ఈ మేరకు పై విధంగా ఆదేశించారు. తొలి విడతలో 6 వేల ఉద్యోగాలు పోలీస్ శాఖలో భర్తీ చేయాలని సీఎం జగన్ సూచించారు. ఇందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని పోలీస్ శాఖను ఆదేశించారు.
వైఎస్ జగన్ ముఖ్యమంత్రి అయిన తర్వాత గ్రామ సచివాలయాల వ్యవస్థను ఏర్పాటు చేసి.. 1.30 లక్షల ఉద్యోగాలను కల్పించారు. అన్ని రకాల అర్హతలు ఉన్న వారికి ప్రభుత్వ ఉద్యోగం దక్కేలా, అదే సమయంలో ప్రజలకు మెరుగైన సేవలు అందించేలా గ్రామ సచివాలయాల్లో 13 రకాలు, వార్డు సచివాలయాల్లో ఆరు రకాల ఉద్యోగాలను సృష్టించారు. ఖాళీగా ఉన్న దాదాపు 15 వేల ఉద్యోగాలను రెండో దశలో భర్తీ చేశారు. ఇప్పటికీ మిగిలిపోయి ఉన్న దాదాపు ఆరు వేల పశువైద్య పోస్టులను భర్తీకి ఇటీవల గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.
ప్రతి ఏడాది జనవరిలో ఖాళీగా ఉన్న ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేస్తామని సీఎం వైఎస్ జగన్ గతంలో ప్రకటించారు. ఈ దిశగా తాజాగా చర్యలు చేపట్టారు. ఈ ఏడాది జనవరిలోనే ఉద్యోగల భర్తీకి క్యాలెండర్ విడుదల కావాల్సి ఉండగా.. కరోనా వైరస్, వ్యాక్సినేషన్ ప్రక్రియ, ఆ తర్వాత స్థానిక సంస్థల ఎన్నికల వల్ల ఆగిపోయింది. ప్రస్తుతం మండల, జిల్లా పరిషత్ ఎన్నికలు జరగాల్సి ఉన్నా.. అవి ఎప్పుడు జరుగుతాయో చెప్పలేని పరిస్థితుల్లో.. పూర్తిగా పరిపాలనపై సీఎం వైఎస్ జగన్ దృష్టి పెట్టారు. ఈ క్రమంలోనే దీర్ఘకాలిక అభివృద్ధి, ఉద్యోగాల భర్తీ అంశాలపై వేగంగా నిర్ణయం తీసుకుంటున్నారు.
ఇప్పటికే జంబో డీఎస్పీ వేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. అందుకు అనుగుణంగా అభ్యర్థులు కూడా సిద్ధమవుతున్నారు. కరోనా తగ్గడంతో పలు కోచింగ్ సెంటర్లు రెండు నెలల నుంచే అభ్యర్థులకు శిక్షణ ఇస్తున్నాయి. అదే సమయంలో పోలీస్ ఉద్యోగాల భర్తీపై కూడా గతంలోనే ప్రభుత్వం స్పష్టమైన సంకేతాలు ఇచ్చింది. ప్రతి ఏడాది ఆరు వేల ఉద్యోగాలను భర్తీ చేస్తామని ప్రకటించింది. ఈ సమాచారాన్ని ఆధారంగా చేసుకునే అభ్యర్థులు శిక్షణ తీసుకుంటున్నారు.
కరోనా కారణంగా నిరుద్యోగం భారీగా పెరిగిపోయింది. ప్రైవేటు కంపెనీలలో పని చేసే వేలాది మంది తమ కొలువులను కోల్పోయారు. తయారీ నుంచి సాఫ్ట్‌వేర్ రంగం వరకూ.. ప్రతి సెక్టార్ కరోనాకు ప్రభావితమైంది. ఈ నేపథ్యంలో యువత ప్రభుత్వం జారీ చేయబోయే ఉద్యోగల భర్తీ క్యాలెండర్‌పై ఎన్నో ఆశలు పెట్టుకుంది. సీఎం వైఎస్ జగన్ చెప్పిన ఆరు వేల పోలీస్ ఉద్యోగాలే కాకుండా.. వివిధ విభాగాలలో ఎంత మొత్తంలో పోస్టులు ఉంటాయనేది ఏప్రిల్ 13వ తేదీ ఉగాది నాడు తేలబోతోంది. మొత్తం మీద నూతన తెలుగు సంవత్సరం రోజున ఏపీ యువత తీపి కబురు అందడం ఖాయమైంది.
Also Read : తోటకు కౌంటర్ ఇచ్చే కాపు నేతే లేరా..?