iDreamPost
android-app
ios-app

ఉల్లి కష్టాలకు చెక్‌

  • Published Oct 22, 2020 | 11:26 AM Updated Updated Oct 22, 2020 | 11:26 AM
ఉల్లి కష్టాలకు చెక్‌

కొనుగోలుదారులకు కన్నీళ్ళు తెప్పిస్తున్న ఉల్లి దెబ్బ నుంచి ప్రజలను కాపాడేందుకు ఏపీ సర్కార్‌ నడుంబిగించింది. ప్రస్తుతం బహిరంగ మార్కెట్‌లో కిలో ఉల్లి రూ. 60 నుంచి రూ. 90ల మధ్య తచ్చాడుతోంది. దీంతో పేద, మధ్యతరగతి ప్రజలు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు.

ఈ నేపథ్యంలో అప్రమత్తమైన ఏపీ ప్రభుత్వం రైతు బజార్ల ద్వారా కేజీ రూ. 40లకే అందించేందుకు ఏర్పాట్లు చేస్తోంది. ఈ మేరకు రాష్ట్ర వ్యవసాయశాఖామంత్రి కురసాల కన్నబాబు అధికారులతో చేసిన సమీక్షా సమావేశంలో వెల్లడించారు. నాఫెడ్‌ ద్వారా 5వేల టన్నుల ఉల్లిని దిగుమతి చేసుకుని రైతులు బజార్ల ద్వారా ప్రజలకు అందుబాటులోకి తీసుకువచ్చేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. మొత్తం 5వేల టన్నుల ఉల్లి దిగుమతి ఇండెంట్‌ అందజేసినట్లు ఆయన వెల్లడించారు.

ఇటీవల కురిసిన భారీ వర్షాలకు ఉల్లి పంటల కూడా దెబ్బతింది. ఉన్న సరుకును అధికధరలకు విక్రయించేందుకు దళారులు సిద్ధమైపోయారు. ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. అప్రమత్తమైన రాష్ట్ర ప్రభుత్వం ధరలను క్రిందికి దింపేందుకు వెనువెంటనే చర్యలు ప్రారంభించింది. అందులో భాగంగానే రైతు బజార్ల ద్వారా ఉల్లిని ప్రజలకు అందుబాటులోకి తీసుకువస్తున్నారు.