iDreamPost
android-app
ios-app

తండ్రి బాటలో తనయుడు

తండ్రి బాటలో తనయుడు

బడుగు, బలహీన వర్గాలు, రైతులు, గిరిజనులకు మేలు చేయడంలో తన తండ్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి బాటలో సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి నడుస్తున్నారు. తన తండ్రి ఆశయ సాధనే లక్ష్యమని ప్రకటించిన సీఎం జగన్‌ విధానపరమైన నిర్ణయాలు, సంక్షేమ పథకాలతో ప్రజల జీవితాల మార్చేలా, జీవన ప్రమాణాలు పెంచేలా తండ్రికి తగ్గ తనయుడు అనిపించుకుంటున్నారు. అడవి తల్లిని నమ్ముకుని, పోడు వ్యవసాయం ద్వారా పొట్టుపోసుకుంటున్న గిరిజనులకు వారు సాగు చేసుకుంటున్న భూములపై హక్కును కల్పించిన వైఎస్సార్‌ మాదిరిగానే సీఎం జగన్‌ కూడా గిరి పుత్రులకు పట్టాలు పంపిణీ చేస్తున్నారు. జగనన్న పట్టా పేరుతో గిరిజనులకు రెండు ఎకరాల చొప్పున భూమికి పట్టా ఇచ్చే పథకానికి ఈ రోజు శ్రీకారం చుట్టనున్నారు.

రాష్ట్రంలో భూ పట్టాల కోసం ఎదురుచూస్తున్న గిరిజనులు 1.53 లక్షల మందికి 3 లక్షల ఎకరాల భూమిపై హక్కు వైసీపీ సర్కార్‌ కల్పిస్తోంది. గాంధీ జయంతి అయిన ఈ రోజు ఈ పథకాన్ని సీఎం వైఎస్‌ జగన్‌ ప్రారంభిస్తున్నారు. నెల రోజుల పాటు గిరిజనులందరికీ అధికారులు, ప్రజా ప్రతినిధులు పట్టాలు అందించేలా కార్యచరణ రూపొందించారు. వైఎస్సార్‌ తర్వాత మళ్లీ గిరిజనులుకు ఈ స్థాయిలో భూములపై హక్కు కల్పిస్తున్న సీఎంగా వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి నిలుస్తున్నారు. ప్రతిపక్ష నేతగా ఉన్న సమయంలో వైఎస్‌ జగన్‌ రాష్ట్రంలోని పలు గిరిజన ప్రాంతాల్లో పర్యటించారు. పోలవరం ముంపు ప్రాంతమైన తూర్పుగోదావరి జిల్లా చింతూరులోనూ, చాపరాయిలో విష జ్వరాల వల్ల మరణించిన వారి కుటుంబాలను పరామర్శించేందకు వెళ్లిన సీఎం జగన్‌ అడవి బిడ్డల జీవితాలు, వారు పడుతున్న కష్టాలను కళ్లారా చూశారు. ప్రజా సంకల్ప పాదయాత్రలో అడవి బిడ్డల వినతులు స్వీకరించారు. అధికారంలోకి వచ్చిన తర్వాత వారి జీవితాలను మార్చేలా అనేక నిర్ణయాలు తీసుకుంటున్నారు.

రైతులకు వ్యవసాయ పెట్టుబడి కోసం వైఎస్సార్‌ రైతు భరోసా పథకం కింద ఏడాదికి ఇస్తున్న 13,500 రూపాయలు ప్రస్తుతం పట్టాలు అందుకుంటున్న 1.53 లక్షల మందికి కూడా ఇవ్వనున్నారు. వీరితోపాటు ఇప్పటికే పట్టాలు ఉన్న వారికి రైతు భోరోసా పథకం కింద ప్రభుత్వం పెట్టుబడి సాయం అందిస్తోంది. రెండు ఎకరాల భూమితోపాటు ఆ భూమిని సాగు చేసుకునేందుకు ఏడాదికి 13,500 చొప్పున ప్రభుత్వం ఇచ్చే నగదు గిరిజనులకు ఎంతగానో ఉపయోగడనుంది. భూమి ఇవ్వడంతోపాటు ఆ భూములను అభివృద్ధి చేసే బాధ్యతను కూడా ప్రభుత్వమే తీసుకుంటోంది. భూములు అభివృద్ధి చేసిన తర్వాత అక్కడ ఉద్యనవన, తోటల పెంపకం, నీటి సదుపాయాల కల్పన కూడా ప్రభుత్వమే చేసి ఇవ్వనుంది. తన తండ్రి మాదిరిగానే తన ఫొటోను ప్రతి ఇంటిలోనూ ఉండాలన్నదే తన ఆకాంక్ష అని చెప్పిన సీఎం జగన్‌.. ఆ దిశగానే ప్రజలకు మేలు చేస్తున్నట్లు గడిచిన ఏడాదిన్నర పాలనతో అందరికీ అర్థం అయింది.