Idream media
Idream media
అమరావతి ఇన్‌సైడర్ ట్రేడింగ్ వ్యవహారం దేశ అత్యున్నత న్యాయస్థానానికి చేరింది. ఇన్‌సైడర్ ట్రేడింగ్‌పై జరుగుతున్న విచారణను నిలిపివేస్తూ ఏపీ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను రాష్ట్ర ప్రభుత్వం సుప్రీం కోర్టులో సవాల్ చేసింది. విచారణ యథావిధిగా జరిగేలా ఏపీ హైకోర్టు ఇచ్చిన స్టేను ఎత్తివేయాలని పిటిషన్‌లో కోరింది. పిటిషన్‌ను సుప్రీం విచారణకు స్వీకరించింది.
టీడీపీలో అలజడి..
రాజధాని ప్రకటన ముందే అమరావతి చుట్టు పక్కల చంద్రబాబు సన్నిహితులు, టీడీపీ నేతలు 4,070 ఎకరాల భూమిని కొనుగోలు చేశారని మంత్రివర్గ ఉపసంఘం ప్రాథమికంగా నిర్థారించింది. ఈ వివరాలతో ఏపీ ప్రభుత్వం సమగ్ర విచారణకు సీబీఐ విచారణకు ఆదేశించింది. మరో వైపు తనకు అందిన ఫిర్యాదులపై సీఐడీ విచారణ జరుపుతోంది. బాబు హాయంలో అడ్వకేట్ జనరల్‌గా పని చేసిన దమ్మాలపాటి శ్రీనివాస్, ప్రస్తుత సుప్రిం కోర్టు చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ కుమార్తెలు సహా 13 మంది ఇన్‌సైడర్ ట్రేడింగ్‌లో భూములు కొనుగోలు చేశారనే ఫిర్యాదులుపై ఏసీబీ ఎఫ్‌ఐఆర్ దాఖలు చేసింది. మంత్రివర్గ ఉప సంఘం చర్యలు, సీఐడీ విచారణ నిలిపివేయాలంటూ… టీడీపీ నేతలు వర్ల రామయ్య, ఆలపాటి రాజా ఏపీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయగా.. వారికి అనుకూలంగా తీర్పు వచ్చింది.
ఏసీబీ విచారణపై స్టే ఇవ్వాలని దమ్మాలపాటి శ్రీనివాస్ కోరగా.. స్టేను మంజూరు చేస్తూ.. ఏసీబీ దాఖలు చేసిన ఎఫ్‌ఐఆర్‌ను బయటపెట్టబద్దని గ్యాగ్ ఆర్డర్‌ను జారీ చేసింది. హైకోర్టు ఆదేశాలపై రాష్ట్ర ప్రభుత్వం సుప్రీం కోర్టును ఆశ్రయించడంతో.. సద్దుమణిగిందనుకున్న ఇన్‌సైడర్ ట్రేడింగ్ వ్యవహారం మళ్లీ మొదటికొచ్చిందనే ఆందోళన టీడీపీ నేతల్లో నెలకొంది.
Also Read : కేజ్రీవాల్ వజ్రాయుధం అదేనా..?
ఇన్‌సైడర్ ట్రేడింగ్ చేశారిలా..
రాష్ట్ర విభజన తర్వాత 13 జిల్లాల ఆంధ్రప్రదేశ్‌లో టీడీపీ అధికారంలోకి వచ్చింది. రాజధానిగా అమరావతిని ప్రకటించక ముందే చుట్టుపక్కల వేలాది ఎకరాలను చంద్రబాబు అనుచరులు, టీడీపీ ముఖ్యనేతలు కొనుగోలు చేశారు. నూజివీడు, ఏలూరు, నాగార్జున యూనివర్సిటీ.. ఇలా పలుచోట్లను రాజధాని ఏర్పాటుకు ప్రభుత్వం పరిశీలిస్తుందనే ప్రచారం టీడీపీ అనుకూల మీడియాలో సాగగా.. ఆయా ప్రాంతాలలో పెద్ద ఎత్తున వ్యాపారులు భూ లావాదేవీలు జరిపారు. ఇదే సమయంలో టీడీపీ నేతలు అమరావతి ప్రాంతంలో చాప కింద నీరులా పెద్ద ఎత్తున భూములు కొనుగోలు చేశారు. రాజధానిగా అమరావతి ప్రకటన తర్వాత ఆ భూముల విలువ పదుల రెట్లు పెరిగింది.
సవాళ్లు విసిరి.. స్టేల కోసం పిటిషన్లు..
ఈ దందా 2015లోనే వెలుగులోకి వచ్చింది. బాబు బండారం బయటపడింది. అయితే.. డబ్బులు ఉన్న వాళ్లు కొంటే తప్పేంటంటూ చంద్రబాబు ఇన్‌సైడర్ ట్రేడింగ్ వ్యవహారాన్ని సమర్థించుకున్నారు. ప్రజా రాజధాని అంటున్న అమరావతిలో జరిగిన ఈ భూ కుంభకోణంపై విచారణ జరిపించాలన్న వైసీపీ డిమాండ్‌ను పట్టించుకోలేదు. తాము అధికారంలోకి వస్తే.. అమరావతి భూ కుంభకోణంపై విచారణ జరిపిస్తామని, నేరం చేసిన వారిని శిక్షిస్తామని ప్రతిపక్ష నేత హోదాలో వైఎస్ జగన్ తన ప్రజా సంకల్ప పాదయాత్రలో పలుమార్లు చెప్పారు. చెప్పిన మాట ప్రకారం అధికారంలోకి వచ్చిన తర్వాత.. విచారణ జరిపిస్తుండగా.. ఏపీ హైకోర్టు బ్రేక్ వేసింది. తామేమీ తప్పు చేయలేదని, దమ్ముంటే విచారణ జరిపించాలంటూ సవాళ్లు విసిరిన చంద్రబాబు.. ఆ తర్వాత విచారణ ఆపాలంటూ తన పార్టీ నేతలతోనే హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేయించడం విశేషం. అమరావతి భూ కుంభకోణంపై విచారణ కొనసాగుతుందా..? లేదా హైకోర్టు స్టేను సుప్రీం కోర్టు సమర్థిస్తుందా..? వేచి చూడాలి.
Also Read : కరోనా మరణాలు ప్రభుత్వ హత్యలైతే.. మరి పుష్కర తొక్కిసలాట మరణాలు..?