iDreamPost
iDreamPost
టెస్ట్, ట్రేసింగ్, ట్రీట్మెంట్ విధానం కోవిడ్ 19 నియంత్రణలో అత్యంత కీలకం. ముందు నుంచీ ఈ విధానాన్నే ఆచరిస్తున్న ఏపీ ప్రభుత్వం మూడు టీలలోనూ చివరిదైన ట్రీట్మెంట్లో వేగం పెంచుతోంది. దాదాపు ప్రతి రోజూ 60వేలకుపైగా పరీక్షలు నిర్వహిస్తూ వ్యాధి నియంత్రణలో చురుకుని కొనసాగిస్తోంది. పరీక్షల సంఖ్యకు అనుగుణంగానే పాజిటివ్‌లు కూడా బైట పడుతున్నాయి. దీంతో గుర్తించిన పాజిటివ్ రోగుల ఆరోగ్య పరిస్థితికి అనుగుణంగా ట్రీట్మెంట్ విధానంలో ఎప్పటికప్పుడు మార్పులు చేస్తూ, వేగవంతమైన సేవలు అందించేందుకు కృషిచేస్తోంది. తద్వారా ఐసీయూ వరకు వెళ్ళే రోగుల సంఖ్యను గణనీయంగా తగ్గించి, వ్యాధి ప్రాధమికదశలోనే వైద్యం అందే విధంగా ఏర్పాట్లు చేస్తున్నారు.
అంతే కాకుండా ఐసీయూ స్టేజ్‌కు వచ్చినవారిలో కూడా ప్రాణాపాయం తగ్గించేందుకు అవసరమైన మేరకు బెడ్లు, ఆక్సిజన్ తదితర ఏర్పాట్లు కూడా సమకూరుస్తోంది. జానాభా ప్రాతిపదికన అంచనాలు వేసి ఎప్పటికప్పుడు ఆసుపత్రి బెడ్ల సంఖ్యను పెంచుతూ ట్రీట్మెంట్ వేగంగా అందించే కార్యాచరణను అమలులో పెట్టింది. అయితే టెస్టుల సమయంలో ఫలితాలు వచ్చేందుకు కొంచె ఆలస్యం అవుతున్న నేపథ్యంలో ట్రీట్మెంట్లో వేగం మందిగిస్తోంది. ప్రభుత్వం వెంటనే అధిగమించేందుకు చర్యలకు దిగింది.
ఈ నేపథ్యంలో వరుసగా మూడు, నాలుగు రోజుల పాటు జ్వరం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు, ఆక్సిజన్ శాతం 94కంటే తక్కువగా ఉన్న రోగులను వెంటనే ఆసుపత్రిలో చేర్చుకుని చికిత్స అందించేందుకు జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేసింది. తద్వారా ఐసీయూ స్టేజ్‌కు చేరే రోగులకు కూడా ప్రాణాపాయ స్థితి ఏర్పడకుండా పకడ్భంధీగా చర్యలు చేపడుతోంది. కోవిడ్ నియంత్రణకు ఏపీ ప్రభుత్వం ముందునుంచీ చేపడుతున్న వినూత్న విధానాల్లో ఇది కూడా ఒకటని చెప్పొచ్చు.
జన సంచారం పెరిగే కొద్దీ పాజిటివ్‌ల సంఖ్య కూడా పెరుగుతోంది. ప్రస్తుతం రాష్ట్రంలోని నాలుగు జిల్లాల్లో పాజిటివ్‌ల గుర్తింపు అధికంగా ఉంది. మిగిలిన జిల్లాల్లో కూడా ఇదే పరిస్థితి ఎదురవుతుందని అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలో పాజిటివ్‌ల సంఖ్యను నియంత్రించడం కంటే అత్యయిక స్థితిలోకి జారే రోగుల ప్రాణాలు కాపాడడంపైనే ఎక్కువగా దృష్టి పెట్టాల్సిన అవసరం ఎక్కువుందని నిపుణులు నొక్కిచెబుతున్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వాలు కూడా ఇదే ప్రాధాన్యంగా తీసుకుంటున్నాయి. కేసుల పెరుగుదలకు అనుగుణంగా మరణాలు సంభవించకుండా ముందు జాగ్రత్తలకు సిద్ధమవుతున్నారు.