iDreamPost
android-app
ios-app

కత్తి మహేష్‌ మృతికి కారణం అదే.. విచారణకు సిద్ధమన్న ప్రభుత్వం

కత్తి మహేష్‌ మృతికి కారణం అదే.. విచారణకు సిద్ధమన్న ప్రభుత్వం

సినీ విశ్లేషకుడు, నటుడు కత్తి మహేష్‌ మరణంపై పలువురు అనుమానాలు వ్యక్తం చేసిన నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేస్తే విచారణకు సిద్ధమని మంత్రి ఆదిమూలపు సురేష్‌ చెప్పారు. రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి, చికిత్స పొందుతూ కత్తి మహేష్‌ ప్రాణాలు కోల్పోగా.. ఆయన మృతిపై ఎంఆర్‌పీఎస్‌ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ, కత్తి మహేష్‌ తండ్రి అనుమానాలు వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో మంత్రి చేసిన ప్రకటన కీలకంగా మారింది. దళిత సమాజంలో కత్తి మహేష్‌ ఉన్నత స్థాయికి చేరిన వ్యక్తి అని కొనియాడిన మంత్రి సురేష్‌.. ఆయన వైసీపీ సానుభూతిపరుడని వ్యాఖ్యానించారు.

డ్రైవింగ్‌ చేసిన సురేష్‌ను విచారించిన పోలీసులు..

కత్తి మహేష్‌ ప్రయాణిస్తున్న కారు కుడి వైపు తీవ్రంగా దెబ్బతిన్నది. కానీ ఎడమ వైపు కూర్చున్న కత్తి మహేష్‌ మృతి చెందగా.. కుడివైపు డ్రైవింగ్‌ సీటులో ఉన్న సురేష్‌ స్వల్ప గాయాలతో బయటపడ్డారని మందకృష్ణ మాదిగతోపాటు ఇతరులు కత్తి మహేష్‌ మృతిపై అనుమానాలు వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో శ్రీ పొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా కొవూరు సీఐ రామకృష్ణారెడ్డి విచారణ జరిపారు. డ్రైవింగ్‌ చేసిన బత్తిన సురేష్‌ను విచారించారు. రోడ్డు ప్రమాదం వల్లే కత్తి మహేష్‌ చనిపోయారని సురేష్‌ పోలీసులకు తెలిపారు. కత్తి మహేష్‌ సీటు బెల్టు పెట్టుకోకపోవడం వల్లే తీవ్ర గాయాలు అయ్యాయని వివరించారు. తాను సీటు బెల్టు పెట్టుకోవడం వల్ల స్వల్ప గాయాలతో బయటపడ్డానని చెప్పారు.

తలకు, కళ్లకు తీవ్ర గాయాలు..

గత నెల 26వ తేదీన కత్తి మహేష్‌ ప్రయాణిస్తు కార్డు ప్రమాదానికి గురైంది. నెల్లూరు జిల్లా కొడవలూరు మండలం చంద్రశేఖరపురం వద్ద జాతీయ రహదారిపై వేగంగా వెళుతూ.. ముందు వెళుతున్న లారీని ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో కత్తి మహేష్‌ తలకు, కళ్లకు తీవ్ర గాయాలు అయ్యాయి. వెంటనే ఆయన్ను నెల్లూరులోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేర్పించారు. అక్కడ నుంచి మెరుగైన చికిత్స కోసం చెన్నై అపోలో ఆస్పత్రికి తరలించారు. ఆయన చికిత్స కోసం ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం 17 లక్షల రూపాయలు ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి మంజూరు చేసింది. ఆయన కోలుకుంటున్నారనే వార్తలు కూడా వచ్చాయి. అయితే పరిస్థితి విషమించడంతో ఈ నెల 10వ తేదీన తుదిశ్వాస విడిచారు.

Also Read : కత్తి మహేష్‌ది అకాల మరణం కాదా..? కుట్ర జరిగిందా..?