Idream media
Idream media
వైసీపీ ప్రభుత్వం మరో పథకంలో డోర్ డెలివరీ ప్రక్రియను ప్రారంభించింది. రైతులకు కావాల్సిన విత్తనాల నుంచి ఎరువుల వరకూ అన్ని గ్రామంలోనే అందుబాటులో ఉండేలా జగన్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన వైఎస్సార్ రైతు భరోసా కేంద్రాల(ఆర్‌బీకే)లో ఎరువులను ఇకపై రైతుల ఇంటి వద్దకే డెలివరీ చేయనున్నారు. ఈ ప్రక్రియను సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కేంద్ర ఎరువుల శాఖ మంత్రి సదానంద గౌడతో కలసి లాంఛనంగా వర్చువల్ విధానంలో ప్రారంభించారు. ఇకపై రైతులు ఎరువులు బుక్ చేసుకున్న 48 గంటల్లోనే వారి ఇళ్ల వద్దకు చేరతాయని సీఎం వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి ప్రకటించారు.
ఈ ఏడాది జూన్ 1వ తేదీన ఖరీఫ్ ప్రారంభం రోజున జగన్ సర్కార్ వైఎస్సార్ ఆర్‌బీకేలను ప్రారంభించింది. ఒకే సారి రాష్ట్ర వ్యాప్తంగా 10,641 ఆర్‌బీకేలు రైతులకు గ్రామ స్థాయిలో సేవలు అందిస్తున్నాయి. విత్తనాలు, పురుగుమందులు, ఎరువులు అన్ని కూడా ఆర్‌బీకేల నుంచి ప్రభుత్వం కంపెనీ ధరకే అందిస్తోంది. అయితే ఇక్కడ ఓ సమస్య ఉత్పన్నమవుతోంది. రైతులు ఎరువులు బుక్ చేసుకున్న తర్వాత ఎప్పుడు వస్తాయన్నదానిపై స్పష్టత కరువైంది. బుక్ చేసుకున్న తర్వాత రెండు నుంచి వారం, పది రోజుల సమయం పడుతోంది. తాము బుక్ చేసుకున్న ఎరువులు ఎప్పుడు వస్తాయన్న అంశంపై రైతులకు ఆర్‌బీకేలు స్పష్టత ఇవ్వలేకపోతుండడంతో చిన్న, సన్నకారు రైతులు మళ్లీ వ్యాపారుల వద్దకే వెళ్లాల్సి వస్తోంది.
రెండు నుంచి పది బస్తాల వరకూ కొనుగోలు చేసే రైతులు ఆర్‌బీకేల ద్వారా ఎరువులు అందుకోలేకపోతున్నారు. పెద్ద రైతులైతే ఒకే సారి 50 బస్తాలు అంతకన్నా బుక్ చేసుకుంటుండడంతో వెంటనే సరుకు వస్తోంది. కనీసం 50 బస్తాల కన్నా ఎక్కువ బుకింగ్ అయితేనే సదరు ఆర్‌బీకేకు స్టాక్ పాయింట్ నుంచి సరుకు పంపిస్తున్నారు. పత్రి 20 మండలాలకు ఒకటి చొప్పన స్టాక్ పాయింట్‌ను జిల్లాల్లో ఏర్పాటు చేశారు. ప్రధానంగా ఇవన్నీ రెవెన్యూ డివిజన్ కేంద్రంలోనే ఉన్నాయి.
అయితే ఈ సమస్యకు తాజాగా సీఎం జగన్ పరిష్కారం చూపినట్లైంది. ఎరువులు బుక్ చేసుకున్న 48 గంటల్లో డోర్ డెలివరీ పూర్తయితే అన్నదాతలకు మేలు జరుగుతుంది. ముఖ్యంగా సన్న, చిన్నకారు రైతులకు ఆర్థికంగా ప్రయోజనం చేకూరుతుంది. వ్యాపారుల ధరకు, ఆర్‌బీకేలలో ధరకు యూరియా బస్తాకు (50కేజీలు) దాదాపు 100 రూపాయల వ్యత్యాసం ఉంటోంది. ఆర్‌బీకేల్లో పది బస్తాల యూరియా కొనుగోలు చేసే రైతుకు దాదాపు వెయి రూపాయలు ఆదా అవుతోంది. దీనికి అదనంగా రవాణా ఖర్చులు కలిసి వస్తున్నాయి. తాజా డోర్ డెలివరీ విధానంతో మార్కెట్ కన్నా తక్కువ ధరకు ఎరువులు లభించడంతోపాటు రవాణా ఖర్చులు కూడా రైతులకు మిగులుతాయి.