కేంద్ర ప్రభుత్వం రైతుల కోసం అనేక పథకాలను ప్రవేశ పెట్టింది. అలానే రైతుల ఆదాయం పెరిగేందుకు అనేక కార్యక్రమాలను ప్రవేశపెట్టింది. అదే విధంగా వ్యవసాయరంగాని ప్రోత్సహిస్తూ తరచూ పలు కీలక నిర్ణయాలు తీసుకుంటుంది. తాజాగా సేంద్రియ వ్యవసాయ ప్రోత్సాహానికి కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. యూరియా రాయితీ కింద మూడేళ్లలో రూ.3.68 కోట్లు ఖర్చు చేయడానికి కేంద్రం ఆమోదముద్ర వేసింది. ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే..
బుధవారం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన కేంద్ర కేబినెట్ మీటింగ్ జరిగింది. ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. అలానే పలు అంశాలకు ఆమోద ముద్ర వేశారు. యూరియా రాయితీ కింద మూడేళ్లలో రూ.3,68,676.70 కోట్లు ఖర్చు చేయడానికి కేంద్ర మంత్రి వర్గం ఆమోదముద్ర వేసింది. ఈ నిర్ణయం ప్రకారం రైతులకు 2025 వరకు రాయితీపై వేపపూత , యూరియా దక్కనుంది. 45 కిలోల బస్తా అసలు ధర రూ.2,200 ఉండగా ప్రభుత్వం రూ.242కే అందిస్తుందని కేంద్ర ఎరువులు, రసాయనాల శాఖ మంత్రి మన్‌సుఖ్ మాండవీయ తెలిపారు. కేబినెట్ సమావేశానంతరం మంత్రులు మన్ సుఖ్ మాండవీయ, అనురాగ్ ఠాకూర్ మీడియా సమావేశం నిర్వహించి పలు విషయాలు వెల్లడించారు.
2025-26 నాటికి 8 ఫ్యాక్టరీల ద్వారా 44 కోట్ల సీసాల నానో యూరియా ఉత్పత్తి చేయనున్నట్లు వెల్లడించారు. “దీని ద్వారా రైతుల ఆదాయం పెరుగుతుంది. అలానే సేంద్రియ వ్యవసాయం బలోపేతం అవుతుంది. ఇదే సమయంలో భూమి ఉత్పాదకత పెరిగి ఆహారభద్రత సాధ్యమవుతుంది’ అని తెలిపారు. రసాయన ఎరువుల వినియోగాన్ని సమతౌల్యం చేసేందుకు కేంద్రం కొత్త స్కీమ్ ను తీసుకొస్తున్నట్లు మంత్రులు తెలిపారు. ఆ పథకానికి ప్రధానమంత్రి ప్రోగ్రామ్ ఫర్ రెస్టోరేషన్ అవేర్ నెస్, జనరేషన్, నరిష్మెంట్ అండ్ అమలియోరేషన్ ఆఫ్ మదర్ ఎర్త్(పీఎం ప్రణామ్) అని పేరు పెట్టారు.
ఈ పథకం కింద ప్రత్యామ్నాయ ఎరువులు వాడే రాష్ట్రాలకు ప్రోత్సాహం అందిస్తామని మంత్రులు వెల్లడించారు. రసాయన ఎరువుల వినియోగం తగ్గించడం వల్ల ఎంత రాయితీ మిగులుతుందో అందులో 50శాతం నగదును ఆ రాష్ట్రాలకే ఇవ్వాలని నిర్ణయించినట్లు ప్రకటించారు. సేంద్రియ ఎరువుల తయారీని ప్రోత్సహించడానికి రూ.1,451.84 కోట్లు కేటాయించనున్నట్లు వెల్లడించారు. ఏటా కేంద్ర ప్రభుత్వం ప్రతి రైతు కుటుంబానికి రూ.50వేల ఆర్థిక సాయం అందిస్తోందని మంత్రి పేర్కొన్నారు. మరి.. కేంద్ర మంత్రులు చేసిన కీలక ప్రకటనలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.