Idream media
Idream media
కరోనా వైరస్ వల్ల ఆగిపోయిన చదువుల బండి మళ్లీ పట్టాలెక్కబోతోంది. మెల్లగా పాఠశాలలను పునఃప్రారంభించేందుకు ఆంధ్రప్రదేశ్‌లోని వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి సర్కార్ ప్రణాళికలు సిద్ధం చేసింది. కేంద్రప్రభుత్వం ఇచ్చిన మార్గదర్శకాలకు అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం పాఠశాలలకు సంబంధించి మర్గదర్శకాలను సిద్ధం చేసుకుంది. వాటి ఆధారంగా పాఠశాలలను నిర్వహించాలని నిర్ణయించింది. పలుమార్లు వాయిదాల తర్వాత నవంబర్ 2వ తేదీ నుంచి రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలలు తిరిగి ప్రారంభం కాబోతున్నాయి.
రాష్ట్రంలో కరోనా తగ్గుముఖం పట్టినా.. ఓ మోస్తరుగా కొత్త కేసులు నమోదవుతున్నాయి. అత్యధికంగా పదివేల కేసులు నమోదయ్యే పరిస్థితి నుంచి పక్షం రోజులుగా రోజుకు నాలుగు వేల మేరకు నూతన కేసులు నమోదవుతున్నాయి. ప్రస్తుతం ఆ సంఖ్య మూడు వేల దిగువకు చేరుకుంది. ఇలాంటి పరిస్థితుల్లో ఏ మాత్రం నిర్లక్ష్యం చూపకుండా ఉంటూనే.. మరో వైపు విద్యా సంవత్సరం వృథా కాకుండా పాఠశాలలను నిర్వహించేందుకు వైసీపీ సర్కార్ సరికొత్త విధానాన్ని అమలు చేయబోతోంది. విద్యార్థులు భారీ సంఖ్యలో గుమికూడకుండా తరగతుల నిర్వహణలో సరిబేసి విధానం అమలు చేయాలని నిర్ణయించింది.
రోజు మార్చి రోజు తరగతులు నిర్వహించాలని సీఎం వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి నిర్ణయించారు. ఒక రోజు 1,3,5,7 తరగతుల వారికి పాఠశాల నిర్వహిస్తే మరుసటి రోజు 2,4,6,8 తరగతుల వారికి పాఠాలు చెప్పాలని నిర్ణయించారు. 9, 10 తరగతుల వారికి మాత్రం ప్రతి రోజు తరగతులు ఉంటాయి. అందరికీ మధ్యాహ్నం వరకే తరగతులు నిర్వహించనున్నారు. మధ్యాహ్నం భోజనం తర్వాత పంపిచనున్నారు. ఒక వేళ సదురు పాఠశాలలో విద్యార్థుల సంఖ్య 750 మించి ఉంటే మూడు రోజులకోసారి తరగతులు నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం మార్గదర్శకాలు రూపొందించింది.
ఇప్పటికే జగనన్న విద్యాకానుక పథకం అమలు చేశారు. ఈ పథకం కింద విద్యార్థులకు యూనిఫాం, బెల్ట్, పాఠ్య, నోట్ పుస్తకాలు, షూ, సాక్స్, బెల్ట్, బ్యాగ్ తదితర వస్తువులు విద్యార్థులకు అందించారు. పాఠశాల ప్రారంభం అయ్యేలోపు మూడు జతల యూనిఫాంను విద్యార్థులు కుట్టించుకునేందుకు అనుగుణంగా ఈ పథకాన్ని ముందుగానే అమలు చేశారు. కుట్టుకూలి కూడా ప్రభుత్వం అందించింది. పాఠశాల ప్రారంభం అయినప్పటి నుంచి విద్యార్థులందరూ యూనిఫాంతో వచ్చేలా జగన్ సర్కార్ చర్యలు చేపట్టింది.
ఇప్పటికే నాడు నేడు మొదటి దఫాలో రాష్ట్రంలోని 15,750 పాఠశాలల్లో పూర్తి స్థాయిలో మౌలిక సదుపాయాలు కల్పించారు. ప్రస్తుతం రెండో దఫా నాడు నేడు పనులు జరుగుతున్నాయి. నవంబర్ 15వ తేదీ కల్లా ఈ పనులు పూర్తి చేయాలని సీఎం వైఎస్ జగన్ అధికారులు లక్ష్యం నిర్ధేశించారు. మొత్తం 43 వేల పాఠశాలలను నాడు నేడు కింద అభివృద్ధి చేయనున్నారు. చివరిదైన మూడో దఫా నాడు నేడు కార్యక్రమం కూడా పూర్తయి వచ్చే ఏడాది విద్యా సంవత్సరం నాటికి అన్ని పాఠశాలలు సకల సౌకర్యాలతో కార్పొరేట్ స్కూళ్లకన్నా మిన్నగా ఉంటాయి.