Idream media
Idream media
కరోనా వల్ల ఆర్థిక ఇబ్బందులు ఎదురైనా.. ప్రజా సంక్షేమం విషయంలో ఆంధ్రప్రదేశ్ సీఎం వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి ఎక్కడా రాజీపడడం లేదు. ప్రజలే ముందు అనే లక్ష్యంతో పాలన సాగిస్తున్న జగన్.. తాజాగా మరో నిర్ణయం తీసుకున్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాలు అందించాలనే లక్ష్యంతో పని చేస్తున్న సీఎం వైఎస్ జగన్.. కొత్తగా మరో 1.33 లక్షల పింఛన్లు మంజూరు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. వృద్ధులు, వితంతువులు, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడే వారు సహా 12 కేటగిరీల్లో వైఎస్సార్ ఆసరా పేరుతో జగన్ సర్కార్ ప్రతి నెలా పింఛన్లు ఇస్తున్న విషయం తెలిసిందే. ప్రతి మూడు నెలలకు ఒకసారి దరఖాస్తు చేసుకున్న అర్హులైన వారికి పింఛన్లు మంజూరు చేసే విధానాన్ని జగన్ సర్కార్ అవలంభిస్తోంది. ఈ నేపథ్యంలో రాబోయే జనవరి 1వ తేదీన కొత్తగా మరో 1.33 లక్షల మందికి ఆసరా పింఛన్లు మంజూరు చేసి వృద్ధులు, వితంతువులు, లబ్ధిదారుల మోముల్లో సంతోషాన్ని నింపింది.
వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండున్నరేళ్లు పూర్తయింది. 2019 మే 30వ తేదీన ముఖ్యమంత్రిగా సీఎం వైఎస్ జగన్ ప్రమాణ స్వీకారం చేశారు. ఆదే సమయంలో వృద్ధులకు ఇచ్చే పింఛన్ మొత్తాన్ని 2 వేల రూపాయల నుంచి 2,250 రూపాయలకు పెంచారు. గత ప్రభుత్వం వృద్ధుల పింఛన్ వయస్సును 60 నుంచి 65 ఏళ్లకు పెంచగా.. తిరిగి జగన్ 60 ఏళ్లకు తగ్గించారు. కొత్తగా పింఛన్ కోసం దరఖాస్తు చేసుకున్న వారికి 2020 జనవరిలో మంజూరు చేశారు. ఆ తర్వాత రెండేళ్లలో పలుమార్లు నూతన పింఛన్లు మంజూరు చేస్తూ వచ్చారు. ఇప్పటి వరకు జగన్ సర్కార్ అధికారంలోకి వచ్చిన తర్వాత రెండేళ్లలోనే 17,03,250 పింఛన్లు మంజూరు చేసింది. కొత్తగా మరో 1.33 లక్షల పింఛన్లకు ఆమోదం తెలిపింది. మొత్తంగా జగన్ సర్కార్ రెండేళ్లలో 18,06,260 మందికి కొత్త వారికి పింఛన్లు మంజూరు చేసింది.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చంద్రబాబు ఉన్న సమయంలో.. అర్హులు ఎంత మంది ఉన్నా ఒక ఊరికి నిర్ణీత సంఖ్యలో మాత్రమే పింఛన్లు ఇచ్చేవారు. అర్హత కలిగిన వారికి పింఛన్ రావాలంటే.. అప్పటికే పింఛన్ తీసుకునే వారిలో ఎవరో ఒకరు మరణిస్తే తప్పా.. వచ్చేది కాదు. అలాంటి పరిస్థితిని 2004లో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి మార్చివేశారు. అంతేకాకుండా పింఛన్ మొత్తాన్ని 75 రూపాయల నుంచి 200 రూపాయలకు పెంచారు. ప్రజా సంక్షేమంలో తన తండ్రి అనుసరించిన బాటలో పయనిస్తున్న జగన్ కూడా.. వృద్ధులు, వికలాంగులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా.. ప్రతి నెలా ఒకటో తేదీన పింఛన్ సొమ్మును వారి ఇంటి వద్దే వలంటీర్ల ద్వారా పంపుతున్నారు. వేలి ముద్రలు పడకపోవడంతో పింఛన్ సొమ్ము అందజేత నిలిపివేయడం వంటి పరిస్థితి ఏపీలో ఇప్పుడు కనిపించడం లేదు. జనవరిలో ఇవ్వబోయే నూతన పింఛన్లతో కలిపి మొత్తంగా ప్రతి నెల జగన్ సర్కార్ 63.01 లక్షల పింఛన్లు ఇస్తోంది.
Also Read : రైతు ముంగిటకే బ్యాంకు సేవలు