iDreamPost
iDreamPost
ఆంధ్రప్రదేశ్ లో కోవిడ్ సెకండ్ వేవ్ ని నివారించేందుకు ప్రభుత్వం సకలయత్నాలు చేస్తోంది. ఓవైపు ఆక్సిజన్ నిల్వల మీద దృష్టి పెట్టింది. రాష్ట్రంలోని అన్ని ప్రధాన ఆసుపత్రుల్లో అవసరమైన మేరకు ప్రాణవాయువు అందుబాటులో ఉంచాలని భావిస్తోంది. ఇప్పటికే కృష్ణా, గుంటూరు, నెల్లూరు ప్రకాశం జిల్లాల్లో కొంత మేరకు తక్కువగా ఉన్న ఆక్సిజన్ కోసం అదనపు ప్రయత్నాలు చేస్తోంది.
అదే సమయంలో కోవిడ్ టెస్టులను ముమ్మరం చేయాలని నిర్ణయించింది. పరీక్షలు చేసిన తర్వాత వాటి ఫలితాలు కూడా త్వరగా అనుమానితులకు చేరేలా చూడాలని భావిస్తోంది. దానికి తగ్గట్టుగా అదనపు సిబ్బంది నియామకాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది
అన్ని ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో RTPCR పరీక్షలు మరింత వేగవంతం చేసేందుకు 113 మంది టెక్నికల్ సిబ్బంది నియామకానికి నోటిఫికేషన్ విడుదల చేశారు. కరోనా కట్టడికి అవసరమైన చర్యల కోసం ఏర్పాటు చేసిన గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ సమావేశంలో తీసుకున్న నిర్ణయంలో భాగంగా వైద్య ఆరోగ్య శాఖ ప్రకటన విడుదల చేసింది.
12ప్రభుత్వ మెడికల్ కాలేజీలతో పాటు మరో రెండు ప్రైవేట్ మెడికల్ కాలేజీల్లో ఉన్న VRDL కేంద్రాల్లో కరోనా పరీక్షలు నిర్వహణకు సిబ్బందిని నియమించబోతున్నట్టు మంత్రి ఆళ్ల నాని తెలిపారు. కొత్త సిబ్బంది ద్వారా RTPCR పరీక్షలు రిపోర్ట్ అతి తక్కువ సమయంలో రావడానికి చర్యలు తీసుకుంటున్నామన్నారు.
6నెలల కాంట్రాక్టు బేస్ లో కొత్తగా తీసుకుంటున్న సిబ్బంది నియామకాలు జరిపి, కరోనా టెస్టులు, రిపోర్టులు వేగవంతం చేస్తున్నట్టు వెల్లడించారు గత ఏడాది మార్చిలో వచ్చిన మొదటి విడత కోవిడ్ లో 92మందిని నియమించామన్నారు. మూడు దశల్లో ఇప్పటివరకు అన్ని ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో కరోనా పరీక్షలు నిర్వహణకు 533మంది సిబ్బందిని రిక్రూట్మెంట్ చేయగా వారంతా విధుల్లో ఉన్నట్టు మంత్రి తెలిపారు. మళ్ళీ ఇప్పుడు అదనంగా మరో 110మందిని తక్షణమే టెక్నికల్ మెడికల్ సిబ్బందిని నియమిస్తున్నాం. ప్రతీ వీఆర్ డీఎల్ టెస్ట్ సెంటర్ లోనూ కరోనా పరీక్షలు చేయడానికి ఒక రీసెర్చి సైoటిస్థు, రీసెర్చి అసిస్టెంట్, ల్యాబ్ టెక్నిషియన్, డేటా ఎంట్రీ ఆపరేటర్, ఆఫీస్ సభార్డినేట్ పోస్టు ఉంటాయన్నారు.
ప్రస్తుతం రోజుకి 40వేల మందికి ఆర్టీపీసీఆర్ పరీక్షలు జరుగుతున్నాయి. కొత్తగా నియమించే సిబ్బంది ద్వారా పరీక్షల సంఖ్య 60వేలకు చేరుతుందని మంత్రి ధీమా వ్యక్తం చేశారు. వాటితో పాటుగా ట్రూనాట్ పరీక్షలు కూడా గతంలో రోజుకి 10వేలు చేసిన అనుభవం ఉందన్నారు. ప్రస్తుతం వాటిని పెంచాలని నిర్ణయించినట్టు తెలిపారు.
రాబోయే మూడు రోజుల్లో ట్రూనాట్ టెస్టులు మళ్లీ ప్రారంభమవుతాయన్నారు. అన్ని ప్రభుత్వ మెడికల్ కాలేజీలతో పాటు ఏలూరు ఆశ్రమం మెడికల్ కాలేజీ, విజయనగరం మహారాజ మెడికల్ కాలేజీల్లో కూడా ఆర్టీపీసీఆర్ పరీక్షలు జరుపుతున్నట్టు తెలిపారు.