Idream media
Idream media
ఆంధ్రప్రదేశ్ ఆర్థికస్థితిపై ఇటీవల ఓ రేంజ్ లో ప్రచారం జరుగుతోంది. విపక్షాలు అప్పులపై తప్పుల తడకలను అల్లేస్తున్నాయి. అదే నిజమంటూ సంబంధిత మీడియా కథనాలను కూడా అల్లేస్తోంది. అసలు విపక్షాలు చేస్తున్న ప్రచారం నిజమేనా, ఆ పత్రికలు రాస్తున్న వార్తలు వాస్తవమేనా, టీడీపీ హయాంలో చేసిన అప్పులెన్ని, ఈ మూడేళ్లలో వైసీపీ చేసిన అప్పులెన్ని, వాటికి, వీటికి తేడా ఎంత, కారణాలేంటి, ఇటీవల కొంతకాలంగా రాష్ట్రంలోని కొన్ని పత్రికలు (సాక్షి కాదు) రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ మీద తప్పుడు ప్రచారం చేయడం వెనుక ఉద్దేశ్యం ఏంటి.. ఇలాంటి ఎన్నో ప్రశ్నలకు ముఖ్యమంత్రి ఆర్థిక వ్యవహారాల ప్రత్యేక కార్యదర్శి దువ్వూరి కృష్ణ అంకెలు, ఆధారాలతో సహా వివరణ ఇచ్చారు. ఇప్పుడు చెప్పండి.. ఇప్పుడు రాయండి.. నిజాలను అంటూ సవాల్ విసిరారు.
లోటు 5,484 శాతం ఉన్నప్పుడెందుకు రాయలేదు..
తప్పుడు ప్రచారాన్నే నమ్మించి రాష్ట్రానికి పరపతి లేకుండా చేయాలని, అప్పులు పుట్టనివ్వకుండా చేసి తద్వారా ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు ముందుకు సాగనీయకుండా అడ్డు వేయాలన్నది దీనివెనుక ఉన్న ప్రధాన ఉద్దేశమని దువ్వూరి ఆరోపించారు. తాజాగా ఓ పత్రికలో వచ్చిన కథనాన్ని ఉటంకిస్తూ, రాష్ట్రం రెవిన్యూ లోటు, బడ్జెట్ అంచనాలకు మించి, మొదటి మూడు త్రైమాసికాల్లోనే, డిసెంబరు నాటికే 918%కి చేరుకుందని పేర్కొన్నారు. దీని ద్వారా రాష్ట్రానికి సంబంధించిన ఆర్థిక పరిస్థితి దిగజారిపోతుందనే సంకేతాన్ని ప్రజలకు ఇవ్వడానికి ఈ కథనం ద్వారా ఒక ప్రయత్నం చేశారని పేర్కొంటూ నిజాలను వెల్లడించారు.
విపత్తులు, కోవిడ్ ల కాలంలో ఉన్న 918 శాతం రెవెన్యూ లోటును ఏ రికార్డు చూసి చెప్పారో, అదే రికార్డులో ఎలాంటి విపత్తు, ఎలాంటి కష్టం లేనప్పుడు కూడా టీడీపీ హయాంలో 2016–19 మధ్య మూడు ఆర్థిక సంవత్సరాలకు సంబంధించి రెవిన్యూ లోటుకు సంబంధించిన గణాంకాలను ఒకసారి పరిశీలించాలన్నారు. 2017–18 మొదటి మూడు త్రైమాసికాలకు రెవెన్యూ లోటును చూస్తే దాదాపు 5,484 శాతం ఉందని పేర్కొన్నారు. 918 శాతాన్ని చూపుతూ ఆర్థిక సంక్షోభం అంటూ ఏ పత్రికైతే చెప్పిందో, మరి 5,484% రెవెన్యూ లోటు ఉన్నప్పుడు ఆ పత్రిక అప్పుడెందుకు రాయలేదని ప్రశ్నించారు.
గత ప్రభుత్వం సృష్టించిన ఇబ్బందులకు తోడు కోవిడ్‌తో కష్టాలు..
గత సర్కారు తీసుకున్న అప్పులను ఉత్పాదక రంగంపై వెచ్చించకపోగా వ్యవసాయం, విద్య, ఆరోగ్య రంగాలను నిర్లక్ష్యం చేసింది. టీడీపీ సర్కారు దుర్వినియోగ చర్యలతో విభజన కష్టాల్లో ఉన్న రాష్ట్రాన్ని మరింత ఆర్థిక సమస్యల్లోకి గెంటేసింది. ఆ ఇబ్బందులకు తోడు ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వాన్ని కోవిడ్ కష్టాలు చుట్టుముట్టాయి. అనూహ్యంగా కోవిడ్ రావడం, లాక్‌డౌన్ విధించడం, ఆర్థిక వ్యవస్త పూర్తిగా నిలిచిపోవడం లాంటి ఇప్పుడున్న పరిస్థితులు అప్పుడు లేవు కదా? జీవనోపాధిని ప్రజలు కోల్పోవడం, విపరీతమైన ఖర్చులు చేయాల్సిన పరిస్థితులు అప్పుడు లేనేలేవు. అలాంటి పరిస్థితుల్లో కూడా అంత రెవిన్యూ లోటును మనం చూశాం. ఇప్పుడు వరుసగా మూడేళ్ల నుంచి ఆర్థిక వ్యవస్థ మందగమనంతోపాటు, కోవిడ్ లాంటి విపత్కర పరిస్థితులు తలెత్తాయి. ఇలాంటి పరిస్థితుల్లో అప్పులు చేయడం సహజమన్నారు.
అయినప్పటికీ ఇప్పుడు 14 శాతమే..
చంద్రబాబు హయాంలో ఏటా పెరిగిన అప్పులు 17శాతం అయితే ఇప్పుడు 14 శాతం అన్నది వాస్తవం కాదా అని దువ్వూరి ప్రశ్నించారు. రాష్ట్రం విభజించే నాటికి రాష్ట్రానికి అప్పులు రూ. 97,213 కోట్లు. పబ్లిక్ అక్కౌంట్‌తో కలుపుకుని రూ.1,20,556 కోట్లు. టీడీపీ పాలన ఐదేళ్లలో రూ,2,68,225 కోట్లకు అప్పులు చేరాయి. ఆ ఐదేళ్లలో సగటున ప్రతి ఏడాదికి 17శాతం మేర అప్పులు పెరుగుకుంటూ వచ్చాయి. అంతేకాదు చెల్లించకుండా వదిలిపెట్టిన బకాయిలు రూ.39వేల కోట్లు ఉన్నాయి.
రాష్ట్ర విభజన నాటికి ప్రభుత్వ గ్యారెంటీతో తెచ్చిన అప్పులు దాదాపుగా రూ.14,028 కోట్లు ఉన్నాయి. అదికాస్తా గత ప్రభుత్వం హయాంలో రూ.58వేల కోట్లకు వెళ్లింది. అన్నికంటే.. మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే.. 2019 ఎన్నికలకు ఒక రోజు ముందు.. ఏప్రిల్ 9న ఒకరోజులోనే ఆర్బీఐలోనే రూ.5వేల కోట్లు అప్పులు చేసింది. ఒకరోజులో ఇంత పెద్ద మొత్తంలో అప్పు చేసిన రాష్ట్రం ఇటీవలి కాలంలో ఎక్కడా లేదు. కానీ ఇవాళ పత్రిల్లో కథనాలు జూన్, జులై, ఆగష్టుల్లో అప్పులు చేసినా సంవత్సరానికి ఇచ్చిన రుణ పరిమితిలో మొత్తం అంతా ఇప్పుడే చేసేస్తున్నట్టుగా రాస్తున్నారు. మరి ఆరోజు ఆర్థిక సంవత్సరం ప్రారంభమైన మొదట్లోనే ఒకే రోజులో రూ.5వేల కోట్లు అప్పులు చేశారు.అప్పుడెందుకు రాయలేదు.. అని అన్నారు.
విద్య, వైద్యం, మౌలిక సదుపాయాల కల్పనకే ఖర్చు
టీడీపీ ప్రభుత్వం వ్యవసాయం, విద్య, వైద్య రంగాలను నిర్లక్ష్యం చేసింది. రైతులకు రూ.87,612 కోట్లు రుణమాఫీ చేస్తామని చెప్పి మాటతప్పింది. దీంతో రైతులు అప్పుల ఊబిలో కూరుకుపోయిన విషయాన్ని 2016–17 నాబార్డు సర్వే స్పష్టం చేసింది. అలాగే గత ప్రభుత్వం ప్రాథమిక విద్యను పూర్తిగా నిర్లక్ష్యం చేసింది. ప్రాథమిక విద్య గ్రాస్ ఎన్‌రోల్‌మెంట్ రేషియో దేశ సగటు 99 శాతం కాగా అత్యల్పంగా రాష్ట్రంలో కేవలం 84.48 శాతమే ఉంది. దీన్నిబట్టి టీడీపీ ప్రభుత్వం అప్పులను ఎలా విచ్చలవిడిగా వ్యయం చేసిందో బోధపడుతోంది.
ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం కోవిడ్ సంక్షోభంలో కూడా పరిమితికి లోబడి అప్పులు చేస్తూ ఒకపక్క ప్రజలను నగదు బదిలీ ద్వారా ఆదుకుంటూ మరోపక్క విద్య, వైద్య రంగాల్లో నాడు–నేడు కార్యక్రమాలతో మౌలిక సదుపాయాలను కల్పిస్తోంది. కోవిడ్ కారణంగా పలు దేశాలతో పాటు రాష్ట్రాలు ఎక్కువగా అప్పులు చేయాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. మన రాష్ట్రం కూడా అదే తరహాలో అప్పులు చేస్తున్నా వాటిని కోవిడ్ విపత్తులో ప్రజలకు జీవనోపాధి కల్పిచడం, వ్యవసాయం, విద్య, వైద్య రంగాల్లో మౌలిక సదుపాయాల కల్పనకు వ్యయం చేసింది. ఈ చర్యల వల్లే ఆర్థిక వ్యవస్థ కుప్పకూలకుండా నిలబడింది.
గర్వంగా చెబుతున్నాం..
గర్వంగా చెప్పదలచుకున్న విషయం ఏంటంటే.. రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ వైయస్.జగన్ గారి కార్యదక్షత, సంకల్ప బలంతోటి ఈ రెండున్నరేళ్ల కాలంలో రూ.1.27లక్షల కోట్లు డీబీటీ పద్ధతిలో అవినీతి లేకుండా, వివక్ష లేకుండా ప్రజల్లో పెట్టగలిగాం. దీన్ని సగర్వంగా చెప్పగలం. మహిళా సాధికారిత, విద్య, వైద్యం, వ్యవసాయం రంగాల్లో చక్కటి పురోగతి సీఎంగారు చేపట్టిన కార్యక్రమాల వల్ల చూస్తున్నాం. వైఎస్ ఆర్ ఆసరా, చేయూతలను అర్హులైన మహిళల చేతుల్లోనే పెట్టాం. దీనివల్ల ఆయా కుటుంబాల్లో పేదరికం తగ్గుతోంది. వారిపై రుణభారం తగ్గుతోంది. ఆర్థికంగా వారికి భరోసా ఉంటోంది… ఆయన వివరించారు. ఇలా విద్యుత్ వ్యవస్థ సహా రాష్ట్రంలోని పలు వ్యవస్థల్లో చోటుచేసుకున్న మార్పులు, అవసరాలకు అనుగుణంగా చేసిన అప్పులు, అప్పులు చేయడంలోనూ పరిమితులకు లోబడిన విధానాన్ని కూలంకశంగా ఆయన వివరించారు.