iDreamPost
android-app
ios-app

ఫైబర్ స్కామ్ – లోకేష్ ఇరుకున్నట్లేనా?

ఫైబర్ స్కామ్ – లోకేష్ ఇరుకున్నట్లేనా?

నిను వీడ‌ని నీడ‌ను నేను.. అన్న‌ట్లుగా అధికారంలో ఉండ‌గా చేసిన ఫైబ‌ర్ నెట్ కుంభ‌కోణం తెలుగుదేశం పార్టీని వ‌దిలా లేదు. జ‌గ‌న్ స‌ర్కార్ తీసుకున్న తాజా నిర్ణ‌యం చిన్న‌బాబుకు కంటిమీద కునుకు లేకుండా చేస్తుంద‌న‌డంలో సందేహం లేదు. ఎందుకంటే అప్పుడు ఐటీ శాఖ మంత్రి గా ఉన్న‌ది లోకేషే కాబ‌ట్టి. ప్రస్తుత ఫైబర్ నెట్ చైర్మన్ పూనూరు గౌతమ్ రెడ్డి ఇచ్చిన నివేదిక ఆధారంగా ఫైబర్ నెట్ స్కామ్ కేసును సీఐడీ విచారణకు ఆదేశిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ కేసు విచార‌ణ చేయాల్సిందిగా గతంలో సీబీఐని కోరిన‌ప్ప‌టికీ స్పందించక పోవ‌డంతో ప్ర‌భుత్వం ఈ నిర్ణ‌యం తీసుకుంది.

ఫైబర్ నెట్ స్కామ్ లో సుమారు రూ.700-1000 కోట్ల మధ్య కుంభకోణం జ‌రిగిన‌ట్లు ఎప్ప‌టి నుంచో ఆరోప‌ణ‌లు వ‌స్తున్నాయి. సెట్ టాప్ బాక్సుల కొనుగోళ్లు ఫైబర్ నెట్ కు సంబంధించి వివిధ టెండర్లను ఖరారు చేసే క్రమంలో అక్రమాలు జరిగాయన్నది ప్రధాన అభియోగంగా ఉంది. టెరా సాఫ్ట్ కంపెనీకి టెండర్లు కట్టబెట్టేలా అప్పటి టీడీపీ సర్కార్ వ్యవహరించిందని ఆరోపణలున్నాయి. తప్పుడు పత్రాలతో ఫైబర్ నెట్లో నిబంధనలకు విరుద్ధంగా నియామకాలు జరిగాయని కూడా వార్తలు వచ్చాయి. అప్పటి ఐటీ శాఖ మంత్రి లోకేష్ ఐటీ సలహాదారు వేమూరి హరికృష్ణ ప్రసాద్ మీద ఈ విషయంపై ఎప్పటినుంచో జగన్ సర్కార్ ఆరోపణలు చేస్తూనే ఉంది. తాజాగా విచారణను వేగంగా పూర్తి చేయాలని సీఐడీని జగన్ సర్కార్ ఆదేశించింది.

చంద్రబాబు హయాంలోని అక్రమాలు అవినీతిపై జగన్ ప్రభుత్వం గద్దెనెక్కగానే కేబినెట్ సబ్ కమిటీ ఏర్పాటు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఈ మంత్రివర్గ ఉపసంఘం విచారణలో తాజాగా విస్తుగొలిపే వాస్తవాలు వెలుగుచూశాయని తెలిసింది. మాజీ సీఎం చంద్రబాబు మాజీ మంత్రి నారాలోకేష్ కు అత్యంత సన్నిహితుడైన వేమూరి హరికృష్ణ కేంద్రంగా ఈ అవినీతి సాగినట్టు సబ్ కమిటీ తేల్చింది. ఈ వేమూరి హరికృష్ణ గతంలో ఈవీఎంల ట్యాంపరింగ్ చోరీ కేసులో ప్రధాన నిందితుడు. ఇతడికి చెందిన బ్లాక్ లిస్ట్ లో ఉన్న టెరాసాఫ్ట్ కు గత చంద్రబాబు ప్రభుత్వం నిబంధనలకు విరుద్ధంగా ఫైబర్ గ్రిడ్ పనులను కట్టబెట్టినట్టు ఏపీ కేబినెట్ సబ్ కమిటీ విచారణలో తేలినట్టు తెలిసింది. ఈ నేపథ్యంలోనే చంద్రబాబుతోపాటు లోకేష్ పాత్ర కూడా సీబీఐ దర్యాప్తులో వెలుగుచూసే అవకాశం ఉందని తెలుస్తోంది.

ఏపీ ప్రభుత్వం చంద్రబాబు సీఎంగా ఉన్న సమయంలో 2015 జూలై 7న గత సర్కారు హయాంలో రూ.329 కోట్ల అంచనా వ్యయంతో ఏపీఎస్ఎఫ్ఎల్ (ఆంధ్రపదేశ్ స్టేట్ ఫైబర్ నెట్ లిమిటెడ్) టెండర్ నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ టెండర్లలో నాలుగు సంస్థలు బిడ్లు దాఖలు చేశాయి. హారిజోన్ బ్రాడ్క్రాస్ట్ ఎల్ఎల్పీ సిగ్నమ్ డిజిటల్ నెట్తో టెరాసాఫ్ట్ కన్సార్టియంగా ఏర్పడి రూ.320.88 కోట్లకు బిడ్ దాఖలు చేసింది. అయితే ఇందులో తూర్పు గోదావరి జిల్లాలో ఈ–పాస్ యంత్రాల సరఫరాలో అక్రమాలకు పాల్పడిన టెరాసాఫ్ట్ను 2015 మే 11న ఏపీటీఎస్(ఆంధ్రప్రదేశ్ టెక్నాలజీ సర్వీసెస్) బ్లాక్ లిస్ట్లో పెట్టింది.

బ్లాక్ లిస్ట్లో ఉన్న సంస్థకు టెండర్లలో బిడ్ దాఖలు చేసేందుకు అర్హత ఉండదు. కానీ ఈఎంవీ (ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషీన్)ల చోరీ కేసులో నిందితుడు చంద్రబాబుకు అత్యంత సన్నిహితుడైన వేమూరు హరికృష్ణకు చెందిన టెరాసాఫ్ట్ బీడ్ను ఆమోదించాలని టీడీపీ సర్కార్ పెద్దలు అధికారులపై ఒత్తిడి తెచ్చారని సబ్ కమిటీ నివేదించింది. అంతటితో ఆగకుండా తక్కువ ధరకు బిడ్ దాఖలు చేసిన ఎల్–1ను కాదని అధిక ధరక బిడ్ దాఖలు చేసిన టెరాసాఫ్ట్కు ఫైబర్ గ్రిడ్ దక్కేలా చక్రం తిప్పినట్టు కేబినెట్ సబ్ కమిటీ విచారణలో తేలింది. ఈ క్రమంలో పైబర్ గ్రిడ్ ప్రాజెక్టులో రూ.200 కోట్లకుపైగా అవినీతి చోటు చేసుకున్నట్లు నిర్ధారిస్తూ కేబినెట్కు నివేదిక ఇచ్చింది. సీఐడీ విచార‌ణ‌లో మ‌రిన్ని వివ‌రాలు వెలుగులోకి వ‌చ్చే అవ‌కాశం ఉంది. మ‌రి ఈ కేసు ఎంత వ‌ర‌కూ వెళ్తుందో వేచి చూడాలి.