iDreamPost
android-app
ios-app

జగన్‌ చిత్తశుద్ధికి నిదర్శనం ఇదే..!

జగన్‌ చిత్తశుద్ధికి నిదర్శనం ఇదే..!

రైతుకు, వ్యవసాయానికి అండగా ఉండడం బాధ్యత అని చెప్పిన ఆంధ్రప్రదేశ్‌ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి.. ఆ బాధ్యతను చక్కగా నిర్వర్తిస్తూ.. వారి పట్ల తన చిత్తశుద్ధిని నిరూపించుకుంటూనే ఉన్నారు. చెప్పిన మాటను.. తు.చ. తప్పకుండా నిర్ణీత సమయంలో అమలు చేస్తూ తనది రైతు ప్రభుత్వం అని సీఎం వైఎస్‌ జగన్‌ చాటుకుంటున్నారు. ఇటీవల సంభవించిన నివర్‌ తుఫాను వల్ల నష్టపోయిన రైతులకు ఇన్‌పుట్‌ సబ్సిడీని డిసెంబర్‌ 31వ తేదీ లోపు ఇస్తామని ప్రకటించిన సీఎం వైఎస్‌ జగన్‌.. ఇచ్చిన మాట ప్రకారం ఈ రోజు పరిహారాన్ని రైతుల ఖాతాల్లో జమ చేశారు. కంప్యూటర్‌లో బటన్‌ నొక్కడం ద్వారా నగదు జమ చేసే ప్రక్రియను సీఎం వైఎస్‌ జగన్‌ లాంఛనంగా ప్రారంభించారు.

నివర్‌ తుఫాను వల్ల ఉత్తరాంధ్ర మినహా మిగతా 9 జిల్లాల్లో 8.34 లక్షల మంది రైతులు 12.01 లక్షల ఎకరాల్లో పంట నష్టపోయారు. 33 శాతం కన్నా ఎక్కువగా పంట నష్టపోయిన రైతులకు ప్రభుత్వం పరిహారం అందించింది. వీరికి 645.99 కోట్ల రూపాయలను ఈ రోజు జగన్‌ ప్రభుత్వం అందించింది.

వైఎస్సార్‌ రైతు భరోసా పథకం చివరి విడత నగదును కూడా సీఎం వైఎస్‌ జగన్‌ ఈ రోజు రైతులకు అందించారు. పంట పెట్టుబడి సాయం కింద ఏడాదికి 13,500 రూపాయలను ప్రభుత్వం రైతులకు మూడు దఫాలుగా అందిస్తోంది. ఇప్పటికే రెండు దఫాలుగా 11,500 రూపాయలను అందించింది. జనవరి నెలలో మూడో విడత కింద 2 వేల రూపాయలు అందించాల్సి ఉండగా.. ప్రస్తుత కష్టకాలంలో రైతులకు ఆ మొత్తం ఇవ్వడం ద్వారా మేలు జరుగుతుందని భావించిన సీఎం వైఎస్‌ జగన్‌ పక్షం రోజులు ముందుగానే ఆ మొత్తాన్ని రైతుల ఖాతాల్లో జమ చేశారు. రాష్ట్ర వ్యాప్తం ఈ పథకం కింది 51.59 లక్షల మంది లబ్ధి పొందుతున్నారు. ఈ రోజు రెండు వేల చొప్పున వీరి ఖాతాల్లో దాదాపు 1,120 కోట్ల రూపాయలను ప్రభుత్వం జమ చేసింది.