ప్రపంచ ఆరోగ్య సంస్థ నివేదిక మేరకే వాయిదా వేశాను – రమేష్ కుమార్

  • Published - 07:47 AM, Tue - 17 March 20
ప్రపంచ ఆరోగ్య సంస్థ నివేదిక మేరకే వాయిదా వేశాను – రమేష్ కుమార్

ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికలు వాయిదా వేస్తున్నట్లు ఏపీ ఎస్ఈసీ రమేష్ కుమార్ ప్రకటించిన తరువాత రాష్ట్రంలో ఇప్పటివరకు కరోనా ప్రభావం ఏమి లేదని.. ఎన్నికలు యథావిధిగా జరపాలని కోరుతూ సీఎస్ నీలం సాహ్ని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ కు లేఖ రాసిన నేపథ్యంలో సీఎస్ నీలం సాహ్ని లేఖ పై స్పందించిన ఎన్నికల కమిషనర్ ఎన్.రమేష్ కుమార్ ఓ మూడు పేజీల లేఖ రాశారు. ఈ లేఖలో ఎన్నికల వాయిదా వెయ్యడానికి గల పూర్తి కారణాలను సీఎస్ కి వివరించారు.

ఈ లేఖలో ఆయన పలు అంశాలు ప్రస్తావించారు. గతంలో ఆర్థిక శాఖలో ఫైనాన్స్ వ్యవహారాలు చూశానని, ఆర్థిక వ్యవహారాలపై నాకు పూర్తి అవగాహన ఉందని లేఖలో పేర్కొన్నారు.ఎన్నికలకు ఆర్థిక సంఘం నిధులకు లింక్ పెట్టాల్సిన పని లేదని, గతంలో కూడా ఇదేవిధంగా ఎన్నికలు నిలిపివేసినా కేంద్రం నుంచి నిధులు వచ్చిన సందర్భాలు ఉన్నాయని లేఖలో పేర్కొన్నారు.

కరోనా నేపథ్యంలో ఇప్పటికే మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్, ఒడిసా రాష్ట్రాల్లో స్థానిక సంస్థల ఎన్నికలు ఆపేశారు. గోవాలో కూడా ఎన్నికలు వాయిదా వేయాలని చూస్తున్నారు. రాష్ట్ర ఎన్నికల కమీషన్ ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరికలను, ఆరోగ్య- కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖతో మార్గదర్శకాలను పాటిస్తున్నాం అని లేఖలో తెలిపారు. ఈ నేపథ్యంలో రమేష్ కుమార్ రాసిన ఈ లేఖ పై రాష్ట్ర ప్రభుత్వం ఏవిధంగా స్పందిస్తుందో చూడాలి.

Show comments