iDreamPost
android-app
ios-app

Ex Gratia To Covid 19 Death Families – కోవిడ్‌ మృతుల కుటుంబాలకు పరిహారం.. ఏపీ ఉత్తర్వులు

Ex Gratia To Covid 19 Death Families – కోవిడ్‌ మృతుల కుటుంబాలకు పరిహారం.. ఏపీ ఉత్తర్వులు

మహమ్మారి కరోన వైరస్‌ వల్ల చనిపోయిన వారి కుటుంబాలకు బాసటగా నిలిచేలా ఆంధ్రప్రదేశ్‌ సర్కార్‌ కీలక ఉత్తర్వులు జారీ చేసింది. మరణించిన వారి కుటుంబాలకు 50 వేల రూపాయల చొప్పన పరిహారం ఇచ్చేందుకు అవసరమైన ఉత్తర్వులు ఈ రోజు మంగళవారం విడుదల చేసింది. కోవిడ్‌తో చనిపోయిన వారి కుటుంబాలకు పరిహారం అందించాలనే సుప్రీం ఆదేశాలకు అనుగుణంగా కేంద్రప్రభుత్వం జారీ చేసిన మార్గదర్శకాల మేరకు ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.

కోవిడ్‌ మృతుల కుటుంబాలకు పరిహారం చెల్లించేలా కేంద్ర ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేయాలంటూ పలువురు సుప్రిం కోర్టులో పిటీషన్లు దాఖలు చేశారు. ఈ విషయంపై పలుమార్లు విచారణ జరిపిన సుప్రీం, పరిహారంపై కేంద్ర ప్రభుత్వం తన వైఖరిని తెలపాలని ఆదేశించింది. పరిహారం ఇవ్వలేమని కేంద్ర ప్రభుత్వం తెలపగా,4 లక్షల రూపాయల చొప్పన ఇవ్వాల్సిందేనని పిటిషనర్లు వాదించారు. పరిహారం అందించాలని సుప్రీం కూడా కేంద్రానికి సూచించిన నేపథ్యంలో.. 50 వేల రూపాయల చొప్పన ఇస్తామని కేంద్రం ముందుకు వచ్చింది. ఈ మేరకు గత నెల 22వ తేదీన సుప్రీం కోర్టులో ప్రమాణ పత్రం దాఖలు చేసింది.

కోవిడ్‌ మృతుల కుటుంబాలకు రాష్ట్ర విపత్తు నిర్వహణ నిధి నుంచి పరిహారం అందిస్తామని సుప్రీం కోర్టుకు తెలిపిన కేంద్ర ప్రభుత్వం.. ఆ మేరకు గతనెల 28వ తేదీన రాష్ట్రాలకు, కేంద్రపాలిత ప్రాంతాలకు ఆదేశాలు జారీ చేసింది. ఆ ఆదేశాలకు అనుగుణంగా ఆంధ్రప్రదేశ్‌ సర్కార్‌ కోవిడ్‌ మృతులకు 50 వేల రూపాయల చొప్పన పరిహారం ఇచ్చేందుకు అనుగుణంగా ఉత్తర్వులు జారీచేసింది.

Also Read : Jagan Launches 3 Scheme Today – నేడు అన్నదాతలకు పండగ.. ఒకే రోజు మూడు పథకాల లభ్ది

దేశంలో మంగళవారం వరకూ మొత్తం 3,42,02,202 మంది కోవిడ్‌ బారినపడ్డారు. ఇందులో 3,34,83,318 మంది కోలుకున్నారు. మరో 4,55,068 మంది ప్రాణాలు కోల్పోయారు. సుప్రిం కోర్టులో కేంద్ర ప్రభుత్వం అఫిడవిట్‌ దాఖలు చేసే సమయానికి మృతుల సంఖ్య 4.45 లక్షలుగా ఉంది. భవిష్యత్‌లో జరిగే మరణాలకు పరిహారం ఇవ్వాలని సుప్రీం తన ఆదేశాల్లో పేర్కొంది.

ఇక ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పటి వరకు 20,63,872 మంది కోవిడ్‌ బారిన పడగా.. అందులో 20,44,692 మంది కోలుకున్నారు. ప్రస్తుతం 4,830 కోవిడ్‌ యాక్టివ్‌ కేసులున్నాయి. కోవిడ్‌ కారణంగా ఆంధ్రప్రదేశ్‌లో మొత్తం 14,350 మంది ప్రాణాలు కోల్పోయారు. వీరందరి కుటుంబాలకు ఏపీ సర్కార్‌ 50 వేల రూపాయల చొప్పన పరిహారం అందించబోతోంది.

కాగా, ఇప్పటికే తల్లిదండ్రులను కోల్పోయిన పిల్లల బాధ్యతను ఏపీ సర్కార్‌ తీసుకుంది. వారి చదువు, రక్షణ బాధ్యతతోపాటు వారి పేరిట 10 లక్షల రూపాయల నగదును డిపాజిట్‌ చేసింది. కోవిడ్‌కు ముందే తల్లిదండ్రుల్లో ఒకరు చనిపోయి,కోవిడ్‌ వల్ల మిగిలిన తల్లి/తండ్రి చనిపోయిన వారికి కూడా రాష్ట్ర ప్రభుత్వం 10 లక్షల రూపాయల పరిహారం అందించి,ఆ పిల్లల భవిష్యత్‌కు ఢోకా లేకుండా చేసింది. ఏపీలో తల్లిదండ్రులు ఇద్దరినీ లేదా వారిలో ఒకరిని కోవిడ్‌ వల్ల పోగొట్టుకున్న పిల్లలు 6,800 మంది ఉన్నట్లు గణాంకాలు చెబుతున్నాయి.

Also Read : YS Jagan – Chandrababu Delhi Tour : జగన్‌ ఆ విషయాన్ని వదిలేశారు..! బాబులో తారాస్థాయికి ఫ్రస్ట్రేషన్‌