Idream media
Idream media
ఇటీవల ప్రకటించిన పీఆర్‌సీతో జీతాలు తగ్గుతాయనే ప్రచారం అవాస్తవమని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్ శర్మ చెప్పారు. కొత్త పీఆర్‌సీతో ఏ ఒక్క ఉద్యోగి జీతం తగ్గదని స్పష్టం చేశారు. హెచ్‌ఆర్‌ఏ పెరిగిందా..? తగ్గిందా..? అని కాదని.. ఓవరాల్‌గా జీతం పెరిగిందా..? లేదా..? అని చూడాలని ఉద్యోగులను కోరారు. కొత్త పీఆర్‌సీతో గ్రాస్ శాలరీ తగ్గలేదని చెప్పారు. పీఆర్‌సీ అమలుపై ఇటీవల ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులను ఉద్యోగ సంఘాల నేతలు వ్యతిరేకిస్తున్న నేపథ్యంలో.. సమీర్ శర్మ ఉద్యోగుల అపోహలను తొలగించేందుకు మీడియా సమావేశంలో మాట్లాడారు.
ఇతర రాష్ట్రాలతో పోల్చితే ఆంధ్రప్రదేశ్‌లోనే జీతాల బడ్జెట్ ఎక్కువగా ఉందని సమీర్ శర్మ చెప్పారు. ఇతర రాష్ట్రాలతో పోల్చుకుంటే రాష్ట్రంలోని ఉద్యోగుల పట్ల సీఎం వైఎస్ జగన్ సానుకూలంగా ఉన్నారని చెప్పారు. పీఆర్‌సీ ఆలస్యం అవుతోందని భావించి.. కరోనా కష్టకాలంలోనూ ఐఆర్ రూపంలో 17 వేల కోట్ల రూపాయలు ఇచ్చారని తెలిపారు. ఇది జీతంలో భాగం కాదన్నారు. కొత్త పీఆర్‌సీ వల్ల జీతం, గ్రాట్యూటీ, పెన్షన్ పెరిగిందని తెలిపారు. దేశంలో రిటైర్మెంట్ వయస్సు 62 ఏళ్లకు పెంచిన తొలి రాష్ట్రం మనదేనన్నారు.
కరోనా వల్ల రాష్ట్ర ఆదాయం పడిపోయిందని సీఎస్ సమీర్ శర్మ చెప్పారు. ఆర్థిక వ్యవస్థపై కరోనా తీవ్ర ప్రభావం చూపిందన్నారు. కరోనా లేకుంటే రాష్ట్ర రెవెన్యూ 98 వేల కోట్ల రూపాయలు ఉండేదని, వైరస్ ప్రభావం వల్ల అది ప్రస్తుతం 62 వేల కోట్ల రూపాయలు మాత్రమే ఉందని చెప్పారు. థర్డ్ వేవ్ ప్రభావం మళ్లీ ఆదాయాలపై పడే ప్రమాదం ఉందన్నారు. కరోనా సమయంలో ఆదాయం, ఖర్చును బ్యాలెన్స్ చేస్తూ వెళుతున్నామని వివరించారు. ఉద్యోగుల జీతాలు, ప్రజలకు సంక్షేమ పథకాలు, మౌలిక, అభివృద్ధి పనులు చేయాల్సిన పరిస్థితిని విశాల దృక్ఫథంతో ఆలోచించాలని కోరారు. అపోహలు, అభిప్రాయాలు కాకుండా.. పే స్లిప్ తీసుకుని గణాంకాలు పరిశీలించి.. జీతం తగ్గిందా..? పెరిగిందా..? చూడాలని సీఎస్ సమీర్ శర్మ సూచించారు. ఉద్యోగుల అపోహలను తొలగించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు.
Also Read : కేసీఆర్ ఇంటి ముందు హల్చల్.. జేసీ దివాకర్ రెడ్డి