iDreamPost
android-app
ios-app

పరిషత్‌ ఎన్నికలకు సాయంత్రం నోటిఫికేషన్‌..?

పరిషత్‌ ఎన్నికలకు సాయంత్రం నోటిఫికేషన్‌..?

మండల, జిల్లా పరిషత్‌ పోరుపై నూతన ఎస్‌ఈసీ నీలం సాహ్ని కసరత్తులు మొదలు పెట్టారు. ఈ రోజు ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్‌ (ఏపీ ఎస్‌ఈసీ)గా బాధ్యలు చేపట్టిన నీలం సాహ్ని ఆ వెంటనే మధ్యలో ఆగిపోయిన ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల నిర్వహణపై దృష్టి సారించారు. పరిషత్‌ ఎన్నికలు నిర్వహించేందుకు సిద్ధమని గవర్నర్‌ బిశ్వభూషన్‌ హరిచందన్‌కు తెలియజేసిన నీలం సాహ్ని.. ఆ వెంటనే కమిషన కార్యదర్శి కన్నబాబుతో సమీక్ష నిర్వహించారు. పరిషత్‌ ఎన్నికలు ఎక్కడ ఆగింది..? ప్రస్తుత పరిస్థితి, కోర్టు ఆదేశాలు తదితర అంశాలను అడిగి తెలుసుకున్నారు.

కమిషనర్‌ నీలం సాహ్ని, కమిషన్‌ కార్యదర్శి కన్నబాబుల సమావేశం తర్వాత.. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆధిత్యానాథ్‌ దాస్‌ నీలం సాహ్నితో సమావేశమయ్యారు. పరిషత్‌ ఎన్నికల నిర్వహణపై ఇద్దరూ సమాలోచనలు జరిపారు. వీరిద్దరి మధ్య దాదాపు అరగంట సేపు చర్చలు జరిగాయి. ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని సీఎస్‌ ఆధిత్యానాథ్‌ దాస్‌ ఎస్‌ఈసీకి వివరించారు. అన్ని ఏర్పాట్లు చేసేందుకు సిద్ధమని వివరించారు.

ఎస్‌ఈసీతో సీఎస్‌ భేటీ ముగిసిన వెంటనే.. డీజీపీ, సీఎస్, జిల్లా కలెక్టర్లు, ఎస్పీలతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించేందుకు కమిషనర్‌ నీలం సాహ్ని సిద్ధమయ్యారు. సాయంత్రం నాలుగు గంటలకు ఈ సమావేశం జరగబోతోంది. పరిషత్‌ ఎన్నికలకు సన్నద్ధతపై ఎస్‌ఈసీ నీలం సాహ్ని.. కలెక్టర్లు, ఎస్పీలకు దిశానిర్ధేశం చేయబోతున్నారు. ఈ సమావేశం ముగిసిన వెంటనే ఎన్నికల నిర్వహణపై కమిషనర్‌ ప్రకటన చేసే అవకాశం ఉంది.

గత ఏడాది మార్చిలో కరోనాను సాకుగా చూపుతూ అప్పటి కమిషనర్‌ నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌ ఎన్నికలను వాయిదా వేశారు. పంచాయతీ, మున్సిపల్‌ ఎన్నికలను నిర్వహించిన నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌.. పరిషత్‌ ఎన్నికలపై మాత్రం మౌనం వహించారు. నామినేషన్ల ఉపసంహరణ ముగిసి, తుది అభ్యర్థుల జాబితా ప్రకటన వరకు పరిషత్‌ ఎన్నికల ప్రక్రియ పూర్తయింది. ఇప్పుడు తిరిగి ఎన్నిక ప్రక్రియ ప్రచారం నుంచి ప్రారంభం కానుంది. పోలింగ్, కౌటింగ్‌ అంతా.. ఆరు రోజుల్లోనే పూర్తవుతుంది. పరిషత్‌ ఎన్నికలను పూర్తి చేసి.. కరోనా వ్యాక్సిన్‌ ప్రక్రియపై దృష్టి పెట్టాలని ప్రభుత్వం భావిస్తోంది.

Also Read : కొత్త ఎస్ఈసీ ఆధ్వర్యంలో పరిషత్ ఎన్నికల ఏర్పాట్లు