Idream media
Idream media
ఆంధ్రప్రదేశ్‌లో దేవాలయాలపై జరుగుతున్న దాడులపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్‌దాస్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇప్పటికైనా ఆపకుంటే నిందితులకు కఠిన శిక్షలు తప్పని హెచ్చరించారు. ఇలాంటి సంఘ విద్రోహ చర్యల పట్ల ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని సూచించారు. పథకం ప్రకారం విగ్రహాలను ధ్వంసం చేయడం ద్వారా ప్రభుత్వానికి చెడ్డ పేరు తేవడంతో పాటు సమాజాన్ని విడదీసి ప్రజల దృష్టి మరల్చాలని, అన్నదమ్ముల్లా కలసి మెలసి జీవిస్తున్న రాష్ట్ర ప్రజల మధ్య కులాలు, మతాల పేరుతో వైషమ్యాలను రగిల్చేందుకు భారీ కుట్ర జరుగుతోందని అన్నారు. భిన్నత్వంలో ఏకత్వానికి ప్రతీకగా నిలిచే రాష్ట్రంలో మతసామరస్యాన్ని దెబ్బతీయడం ద్వారా సమాజాన్ని విచ్ఛిన్నం చేసి అభివృద్ధిని అడ్డుకునేందుకు కొన్ని శక్తులు పథకం ప్రకారం కుట్రలకు పాల్పడుతున్నాయని, ఇటీవల దేవాలయాలపై జరుగుతున్న దాడులే ఇందుకు నిదర్శనమని చెప్పారు. సమాజాన్ని ఏకతాటిపైకి తెచ్చి విధ్వంసకర శక్తులను అడ్డుకుంటామని స్పష్టం చేశారు. విజయవాడలోని ఆర్ అండ్ బీ కార్యాలయంలో సీఎస్ ఆదిత్యనాథ్‌దాస్ విలేకరులతో మాట్లాడారు.
అభివృద్ధి నిరోధానికి ఆ శక్తుల ప్రణాళికలు
దేశవ్యాప్తంగా సంక్షేమ, అభివృద్ధి పథకాల అమలులో దూసుకెళుతున్న ఆంధ్రప్రదేశ్‌లో మతకల్లోలాలను సృష్టించడం ద్వారా శాంతి భద్రతలను దెబ్బతీసి అభివృద్ధిని నిరోధించేందుకు కొన్ని శక్తులు కుట్ర పన్నాయని సీఎస్ పేర్కొన్నారు. ఇందులో భాగంగానే మారుమూల ప్రాంతాల్లో ఉన్న దేవాలయాలపై దాడులు చేస్తూ దేవతామూర్తుల విధ్వంసాలకు పాల్పడుతున్నారన్నారు. దుశ్చర్యలకు పాల్పడేవారి పట్ల ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తుందని హెచ్చరించారు. ఇలాంటి ఘటనలను, శక్తులను సమాజం అంతా కలిసి అడ్డుకుంటుందని, ఇందులో భాగంగానే రాష్ట్ర, జిల్లా స్థాయిల్లో మతసామరస్య కమిటీలను ఏర్పాటు చేస్తూ జీవో 6 జారీ చేసినట్లు వివరించారు. మతసామరస్యాన్ని కాపాడేందుకు ఏర్పాటైన కమిటీలు తరచూ సమావేశమై ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కృషి చేయడంతోపాటు శాంతియుత వాతావరణం వెల్లివిరిసేలా దోహదం చేస్తాయని సీఎస్ వివరించారు.
అన్ని వర్గాల్లో విశ్వాసం, మనోధైర్యాన్ని పెంపొందిస్తూ మత సామరస్యాన్ని పరిరక్షించి రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపించేందుకు మత సామరస్య కమిటీలు దోహదం చేస్తామని సీఎస్ తెలిపారు. కమిటీల్లో అన్ని మతాలకు చెందిన వారు ఉంటారని, ఎక్కడైనా అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకుంటే కమిటీలు సందర్శిస్తాయని చెప్పారు. కొన్ని ఘటనలకు సంబంధించి వెంటనే కేసులు నమోదు చేశామని, నిందితులను గుర్తించడంతో పాటు వీటి వెనక ఎవరున్నారో కూడా బహిర్గతం చేస్తామని స్పష్టం చేశారు. కులమతాలకు అతీతంగా ప్రజా సంక్షేమమే లక్ష్యంగా పనిచేసే ప్రభుత్వ అధికారులకు కులమతాలను ఆపాదించడం హేయమైన చర్య అని ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు.