Idream media
Idream media
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పదమూడు జిల్లాలు గల రాష్ట్రాన్ని ఇరవై ఆరు జిల్లాలకు పెంచింది. దశాబ్దాల తరబడి ఎవరూ చేయని ఛాలెంజ్ సీఎం జగన్మోహన్ రెడ్డి స్వీకరించారు. పాదయాత్రలో ఇచ్చిన మాటకు కట్టుబడి ప్రజలకు పాలనను చేరువ చేసేందుకు జిల్లాల సంఖ్యను పెంచారు. దీనిపై ప్రజలు సంబ్రమాశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. పాలన మరింత చేరువవుతున్నందుకు ఆనందం వెలిబుచ్చుతున్నారు. ఉద్యోగాల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నందుకు యువత కూడా సంతోషంలో ఉన్నారు. పలువురు రాజకీయ ప్రముఖులు కూడా దీనిపై స్పందిస్తున్నారు. కానీ.. మళ్లీ బతికేందుకు అపసోపాలు పడుతున్న కాంగ్రెస్ పార్టీకి మాత్రం ఆ ఊసే లేదు.
రాష్ట్రవిభజన అనంతరం ఏపీలో కాంగ్రెస్ పార్టీ తుడుచుకుపెట్టుకుని పోయింది. ఆ తర్వాత జరిగిన రెండు ఎన్నికల్లోనూ ఒక్కటంటే ఒక్క సీటు కూడా పొందలేకపోయింది. అన్ని చోట్లా అభ్యర్థులు కూడా దొరకని పరిస్థితి. తాను కాంగ్రెస్ నేతనని చెప్పుకోలేని దుస్థితి. వచ్చే ఎన్నికల నాటికైనా సరే.. రాష్ట్రంలో కాంగ్రెస్‌ను బతికించాలని అధిష్ఠానం తీవ్రంగా కసరత్తు చేస్తోంది. పగ్గాలు చేపట్టే నాయకుడి కోసం అన్వేషిస్తోంది. కానీ.. ఎవరూ ముందుకురావడం లేదు. ఆ సంగతి అలా ఉంచితే.. ప్రస్తుతం ఏపీలో కాంగ్రెస్ కు అసలు నేతలు ఉన్నారా అనే సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. ఎందుకంటే.. ఏపీలో కీలక మార్పులు చోటుచేసుకుంటే.. ఒక్క కాంగ్రెస్ నాయకుడూ స్పందించలేదు. ఏ ఒక్కరూ జిల్లాల ఏర్పాటుపై మంచీ, చెడూ మాట్లాడలేదు. కానీ.. తెలంగాణకు చెందిన కాంగ్రెస్ నేతలు స్పందించడం గమనించాల్సిన విషయం.
ఆంధ్రప్రదేశ్‌లో కొత్త జిల్లాల ఏర్పాటును స్వాగతిస్తున్నామని ఎన్డీఎంఏ మాజీ వైస్ ఛైర్మన్, కాంగ్రెస్ సీనియర్ నేత మర్రి శశిధర్ రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. 2014లో రాష్ట్ర విభజన సమయంలో తెలంగాణలో పది జిల్లాలు, ఆంధ్రప్రదేశ్‌లో పదమూడు జిల్లాలు ఉండేవి. ఆంధ్రప్రదేశ్ జిల్లాల ఏర్పాటు చట్టం 1974లోని నిబంధనల ప్రకారం, మొత్తం జిల్లాల సంఖ్యను 26కి తీసుకొని 13 కొత్త జిల్లాలను రూపొందించాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇప్పుడు ప్రతిపాదించిందన్నారు. మెరుగైన పరిపాలన వెనుకబడ్డ ప్రాంతాల అభివృద్ధి ప్రయోజనాల కోసం జిల్లాల ప్రాంతాలు లేదా సరిహద్దుల మార్పుకు వీలు కల్పించే విధంగా ఈ చట్టాన్ని రూపొందించారని శశిధర్ రెడ్డి అన్నారు. కొత్త జిల్లాల మధ్య అసెంబ్లీ స్థానాల సంఖ్య, ఇతర అంశాలపరంగా కొంత సమానత్వం ఉండేలా సహేతుకమైన కసరత్తు జరిగిందని, భౌగోళిక ప్రాంతాలు, జనాభాకు కూడా వెయిటేజీ ఇచ్చారని వెల్లడించారు. ఈ విషయంలో ఏపీ ప్రభుత్వాన్ని అభినందిస్తున్నట్టు శశిధర్‌రెడ్డి పేర్కొన్నారు. విజయవాడ జిల్లాకు ఎన్టీఆర్ జిల్లాగా పేరు పెట్టే ప్రతిపాదన చేయడం మార్పునకు నాంది అన్నారు. పుట్టపర్తిని కేంద్రంగా కొత్తగా శ్రీ సత్యసాయి జిల్లా ఏర్పాటు చేయడం కూడా చాలా స్వాగతించదగిన అంశమన్నారు.
గతంలో 1980లో డాక్టర్ మర్రి చెన్నారెడ్డి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో మూడు కొత్త జిల్లాలు ఏర్పాటు చేశారని గుర్తు చేశారు. కర్నూలు గుంటూరు జిల్లాల నుండి కొంత విస్తీర్ణాన్ని కలుపుకొని ప్రకాశం జిల్లాను, విశాఖపట్నం మరియు శ్రీకాకుళం జిల్లాల నుండి కొంత విస్తీర్ణాన్ని కలుపుకొని విజయనగరం జిల్లాని ఏర్పాటు చేశారన్నారు. అప్పుడున్న హైదరాబాద్ జిల్లాలోని హైదరాబాద్ పట్టణం చుట్టూ ఉన్న గ్రామీణ ప్రాంతాన్ని రంగారెడ్డి జిల్లాగా ఏర్పాటు చేశారని శశిధర్‌రెడ్డి పేర్కొన్నారు.